వారానికి ఒకరోజు ప్రజాదర్బార్
ABN , Publish Date - Dec 14 , 2025 | 01:41 AM
వారా నికి ఒక రోజు పార్టీ కార్యాలయం కేంద్రంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వాటి పరిష్కారానికి చర్య లు తీసుకోవాలన్న అధిష్ఠానం ఆదేశాలతో జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు ప్రజాదర్బార్‌లు నిర్వ హిస్తున్నారు. శనివారం మూడు నియోజకవర్గాల్లో ఏర్పాటు చేశారు. మి
అధిష్ఠానం ఆదేశాలతో నిర్వహిస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలు , ఇన్‌చార్జిలు
ప్రజల నుంచి అర్జీల స్వీకరణ
వారి సమస్యల పరిష్కారానికి చర్యలు
ఒంగోలు, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి) : వారా నికి ఒక రోజు పార్టీ కార్యాలయం కేంద్రంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వాటి పరిష్కారానికి చర్య లు తీసుకోవాలన్న అధిష్ఠానం ఆదేశాలతో జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు ప్రజాదర్బార్‌లు నిర్వ హిస్తున్నారు. శనివారం మూడు నియోజకవర్గాల్లో ఏర్పాటు చేశారు. మిగిలిన వాటిలో ఈవారం ప్రజా దర్బార్‌లు ఇప్పటికే జరిగాయి. ప్రజాప్రభుత్వం అధి కారంలోకి వచ్చిన కొద్దిరోజుల నుంచే ప్రజాదర్బార్ నిర్వహణకు టీడీపీ అధిష్ఠానం ఆదేశించింది. జిల్లాలో ఎస్‌ఎన్‌పాడు, కనిగిరి ఎమ్యెల్యేలు విజయకుమార్, ఉగ్రనరసింహారెడ్డిలు కొంతమేర పాటించగా ఎక్కువ మంది ప్రజాప్రతినిధులు దానిని అంత సీరియస్‌గా తీసుకోలేదు. నిత్యం తమ నివాసాలు, పార్టీ కార్యాలయాలు, వివిధ ప్రభుత్వ, పార్టీ కార్యకలాపాలకు హాజరైన సమయంలో తమను కలిసి సమస్యలపై వివిధ వర్గాల వారు ఇచ్చే వినతులను పరిశీలించి వాటి పరిష్కారానికి ఎక్కువమంది చర్యలు తీసుకుంటున్నారు. అలా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేస్తున్న తాము ప్రత్యేకంగా వారానికి ఒకసారి అవసరం ఏమిటన్న భావనలో ఉన్నారు. అయితే నెల క్రితం యువనేత నారా లోకేష్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వినతుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించగా రాష్ట్రంలోని వివిఽధ ప్రాంతాల నుంచి అర్జీలతో ప్రజానీకం పోటెత్తారు. వేలాదిమంది రావడంతో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం కిటకిటలాడిపోయింది. దీంతో నియోజకవర్గ స్థాయిలో క్రమం తప్పకుండా ప్రజాదర్బార్‌లు నిర్వహిస్తే అధిక వ్యయప్రయాసాలకోర్చి ప్రజానీకం కేంద్ర కార్యాలయానికి వచ్చే అవసరం ఉండదని భావించారు. ఇక నుంచి విధిగా ప్రతి శుక్రవారం స్థానికంగా ప్రజాదర్బార్లు నిర్వహించాలని మరోసారి అధిష్ఠానం పెద్దలు అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలను ఆదేశించారు. అవి జరుగుతున్నాయా? లేదా? అన్న విషయాన్ని కూడా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పర్యవేక్షిస్తున్నారు. దీంతో జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో రెండు, మూడు వారాలుగా ప్రజాదర్బార్‌లు జరుగుతున్నాయి. శుక్రవారం ఏదైనా కారణంతో నిర్వహించలేకపోతే మరో రోజు వీటిని నిర్వహిస్తున్నారు. కొందరు నియోజకవర్గకేంద్రంలో నిర్వహిస్తుండగా మరికొందరు ఇతర మండల కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్నారు. శనివారం మూడు నియోజకవర్గాల్లో అవి జరిగాయి. ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మధ్యాహ్నం వరకు నగరంలోని పార్టీ కార్యాలయంలో ఉండి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారి నుంచి అర్జీలను స్వీకరించారు. గిద్దలూరులో అక్కడి ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి, వైపాలెంలో అక్కడి టీడీపీ ఇన్‌చార్జి ఎరిక్షన్‌బాబులు కూడా ప్రజాదర్బార్ నిర్వహించారు. ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్ శుక్రవారం నిర్వహించగా మిగతా నియోజకవర్గాల్లోనూ ఈవారంలో ఇవి జరిగాయి. ఎక్కువమంది వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి, భూములు, స్థలాలు ఇతర కుటుంబపరమైన సమస్యలు, ఆరోగ్యం, విద్య సంబంధిత అంశాలలో సాయం కోరుతూ వినతులు అందజేస్తున్నారు. అవకాశం ఉన్న వాటిని సత్వర పరిష్కారానికి, అలా లేని వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి నేతలు చర్యలు తీసుకుంటున్నారు.