Share News

‘అయ్యో’రు!

ABN , Publish Date - May 31 , 2025 | 02:28 AM

దివ్యాంగులు, వ్యాధిగ్రస్థులైన ఉపాధ్యాయులపై విద్యాశాఖకు కనికరం కరువైంది. ప్రాధాన్యత కేటగిరీలో చేర్చి బదిలీల్లో ప్రథమ స్థానం ఇస్తామని చెప్పినా ఫలితం లేకుండాపోయింది. అన్నిస్థానాలు కోరుకునేందుకు అవకాశం లభించలేదు.

‘అయ్యో’రు!
విద్యాశాఖ డైరెక్టర్‌ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న డీఈవో కిరణ్‌కుమార్‌, ఎంఈవోలు, హెచ్‌ఎంలు

దివ్యాంగ టీచర్లపై దయలేదు

వ్యాధిగ్రస్థులపై కనికరం కరువు

పేరుకే ప్రాధాన్య కేటగిరి

బదిలీల్లో వీరికి చుక్కలే

దివ్యాంగులు, వ్యాధిగ్రస్థులైన ఉపాధ్యాయులపై విద్యాశాఖకు కనికరం కరువైంది. ప్రాధాన్యత కేటగిరీలో చేర్చి బదిలీల్లో ప్రథమ స్థానం ఇస్తామని చెప్పినా ఫలితం లేకుండాపోయింది. అన్నిస్థానాలు కోరుకునేందుకు అవకాశం లభించలేదు. అందుకు ప్రభుత్వం విధించిన నిబంధనలు అడ్డంకిగా మారాయి. తక్కువ వైకల్యంతో ప్రత్యేక పాయింట్లు పొందిన టీచర్లకు అన్ని స్థానాలు కోరుకునేందుకు అధికారులు అవకాశం ఇచ్చారు. అయితే 80 నుంచి 100శాతం వైకల్యం ఉన్నవారికి, తాము ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతూ చికిత్స చేయించుకుంటున్న వారికి మాత్రం షరతులు విధించారు. మొత్తం ఖాళీల్లో కేవలం నాల్గో వంతు మాత్రమే కోరుకునేందుకు అవకాశం ఇచ్చారు. గతంలో జరిగిన బదిలీల్లో అన్ని స్థానాలకు అవకాశం ఇవ్వగా ఈసారి మాత్రం వీరిపై ఆంక్షల పిడుగుపడింది. దీంతో వీరు బదిలీల్లో సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.

ఒంగోలు, మే 30 (ఆంధ్రజ్యోతి) : ఉపాధ్యాయుల బదిలీల్లో దివ్యాంగ టీచర్లపై ప్రభుత్వానికి దయలేకుండా పోయింది. ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతూ చికిత్సపొందుతున్న టీచర్లపై కనికరం కరువైంది. గతంలో జరిగిన బదిలీల్లో 40శాతం వైకల్యం ఉన్న వారు, ప్రాణాంతక వ్యాధులకు చికిత్సపొందుతున్న వారిని ప్రాధాన్యత కేటగిరీలో చేర్చి బదిలీల్లో మొదటిగా స్థానాలు కోరుకునేందుకు అవకాశం ఇచ్చారు. అప్పట్లో కొందరు బోగస్‌ వైద్య ధ్రువీకరణ పత్రాలతో లబ్ధిపొందారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో ప్రస్తుతం జరుగుతున్న బదిలీల్లో నిబంధనలను కఠినతరం చేశారు. 80శాతానికిపైన శారీరక వైలక్యం ఉన్నవారు, 100శాతం దృష్టి లోపం ఉన్న టీచర్లకు బదిలీల్లో మొదటి ప్రాధాన్యం ఇచ్చారు. అంటే బదిలీల్లో పాయింట్లతో సంబంధం లేకుండా వారు కోరుకున్న స్థానాలను కేటాయిస్తారు. 75శాతం దృష్టి లోపం, 70 నుంచి 79శాతం శారీరక వైకల్యం, 70శాతం వినికిడి లోపం ఉన్నవారికి రెండో ప్రాధాన్యత ఇచ్చారు. పునర్వివాహం చేసుకోని వితంతువులు, క్యాన్సర్‌, ఓపెన్‌ హార్ట్‌ సర్జరీ, అవయవ మార్పిడి, మేజర్‌ న్యూరోసర్జరీ, బోన్‌టిలి, కిడ్నీ మార్పిడి, డయాలసిస్‌, స్పైనర్‌ సర్జరీ చేయించుకొని చికిత్స పొందుతున్న వారికి కూడా ప్రాధాన్యత కేటగిరీలో స్థానం కల్పించారు. టీచర్ల స్పౌజ్‌ పిల్లలు మానసిక సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతుంటే వారికి కూడా ప్రాధాన్యత కేటగిరీ బదిలీకి అవకాశం ఇచ్చారు. అయితే బదిలీల్లో అంతా గందరగోళం నెలకొంది. విపరీతమైన ఆంక్షలతో వ్యాధిగ్రస్థులు, దివ్యాంగులైన టీచర్లు ఇబ్బంది పడుతున్నారు.

ఆంక్షలు ఇవీ..

‘అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ అన్న చందంగా ప్రాధాన్యత కేటగిరీలో ఆంక్షలు టీచర్లను కుంగదీస్తున్నాయి. సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు అయితే ఒక పాఠశాలలో 40శాతం, స్కూలు అసిస్టెంట్లు అయితే 50శాతం ఖాళీలు ప్రతి సబ్జెక్టులో కేటాయించమన్నారు. అంటే ముగ్గురు సెకండరీ గ్రేడ్‌ టీచర్లు పనిచేస్తున్న పాఠశాలల్లో ఒక పోస్టు, ఐదుగురు పనిచేసే పాఠశాలల్లో రెండు పోస్టులు, ఎనిమిది మంది పనిచేసే స్కూళ్లలో మూడు, పదిమంది ఉంటే నలుగురు, 13 మందికి ఐదుగురు, 15 మందికి ఆరుగురు, 18 మందికి ఏడుగురు, 20మంది పనిచేస్తున్న పాఠశాలల్లో ఎనిమిది స్థానాలు మాత్రమే ప్రాధాన్యత కేటగిరీ టీచర్లకు కేటాయించారు. హైస్కూళ్లలో ఒక సబ్జెక్టులో రెండు పోస్టులు ఉంటే ఒకటి, నాలుగు పోస్టులు ఉంటే రెండు, ఆరు పోస్టులకు మూడు, ఎనిమిది పోస్టులకు నలుగురు, పది పోస్టులకు ఐదు, 12 పోస్టులు ఉంటే ఆరుగురు, 14 పోస్టులు ఉంటే ఏడుగురు, 16 పోస్టులు ఉంటే ఎనిమిది ప్రాధాన్యత కేటగిరి వారు కోరుకునేందుకు అవకాశం ఇచ్చారు. జిల్లాలో కేవలం సింగిల్‌ సెక్షన్‌తో నడుస్తున్న సుమారు 200 హైస్కూళ్లలో ప్రాధాన్యత కేటగిరీ టీచర్లు కోరుకునేందుకు స్థానాలే లేవు. అంటే బదిలీల్లో వీరికి ఎంత అన్యాయం జరిగిందో అర్థమవుతుంది.

1,255 ఖాళీలకే వీరు అర్హులు

జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలకు సుమారు 6వేల ఖాళీలు ఉండగా వీటిలో కేవలం 1,255 స్థానాలు కోరుకునేందుకు మాత్రమే ప్రాధాన్యత కేటగిరీలో అర్హులు. కొన్ని సబ్జెక్టుల్లో అసలు వీరికి కోరుకునే అవకాశం లేదు. గ్రేడ్‌-2 హెచ్‌ఎం, పీఎస్‌హెచ్‌ఎం, పీఎస్‌హెచ్‌ఎం, ఎస్‌ఏ పోస్టుల్లో వీరికి ఒక్క స్థానం కూడా కేటాయించ లేదు. స్కూలు అసిస్టెంట్‌ తెలుగులో 173 ఖాళీలకు 546, హిందీలో 219 ఖాళీలకు 74, ఇంగ్లీషులో 253కు 77, గణితంలో 335కు 106, ఫిజికల్‌ సైన్స్‌లో 356కు 91, బయోలాజికల్‌ సైన్స్‌లో 216కు 65, సెండరీ గ్రేడ్‌ తెలుగులో 2,956కు 710, ఉర్దూలో 57కు 8 స్థానాలు ప్రాధాన్యత కేటగిరీలో కేటాయించారు. ఇతర సబ్జెక్టుల్లో ఒక్క స్థానం కూడా వీరికి కేటాయించలేదు.

88మందికి హెచ్‌ఎంలుగా ఉద్యోగోన్నతి

ఒంగోలు విద్య, మే 30 (ఆంధ్రజ్యోతి) : గ్రేడ్‌-2 ప్రధానోపాధ్యాయుల ఉద్యోగోన్నతుల కౌన్సెలింగ్‌లో 88 మంది స్కూలు అసిస్టెంట్లకు హెచ్‌ఎంలుగా ఉద్యోగోన్నతి కల్పించారు. వీరిలో జడ్పీ యాజమాన్యంలో 83 మంది, మునిసిపాలిటీల్లో నలుగురుకి, ఒంగోలు మునిసిపల్‌ కార్పొరేషన్‌లో ఒకరికి హెచ్‌ఎంగా ప్రమోషన్‌ ఇచ్చారు. జడ్పీ యాజమాన్యంలో హెచ్‌ఎంలుగా స్థానాలు కోరుకున్న ఇరువురు శనివారం హెచ్‌ఎంలుగా బాధ్యతలు స్వీకరించి అదే రోజు ఉద్యోగ విరమణ చేయాలి. ఈ రెండు స్థానాలు కోరుకున్న ఇద్దరు మిగతా హెచ్‌ఎంలుగా ఉద్యోగోన్నతి పొందిన వారు జూన్‌ 1న కొత్త పాఠశాలల్లో బాధ్యతలు స్వీకరించాలి, జడ్పీ యాజమాన్యంలోని రెండు స్థానాలను కౌన్సెలింగ్‌కు గైర్హాజరైన వారి కోసం ఉంచారు. గైర్హాజరైన వారికి ఆ రెండు స్థానాలు కేటాయించి నియామకపు ఉత్తర్వులు ఇస్తారు.

Updated Date - May 31 , 2025 | 02:28 AM