అధికారులు సమన్వయంతో పనిచేయాలి
ABN , Publish Date - Nov 09 , 2025 | 10:25 PM
మండలంలోని లింగన్నపాలెంలో ఎంఎస్‌ఎంఈ ప్రాజెక్టును ప్రారంభించేందుకు ఈనెల 11న వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటనకు అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు.
కలెక్టర్ రాజాబాబు
పీసీపల్లి, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): మండలంలోని లింగన్నపాలెంలో ఎంఎస్‌ఎంఈ ప్రాజెక్టును ప్రారంభించేందుకు ఈనెల 11న వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటనకు అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖమంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి, ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి లింగన్నపాలెం గ్రామ సమీపంలోని ఎంఎస్‌ఎంఈ పార్క్‌ను ఆదివారం పరిశీలించారు. అనంతరం వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులతో జరిగిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి పర్యటన నేపథ్యంలో తక్కువ సమయం ఉన్నప్పటికీ చిన్న సమస్య కూడా తలెత్తకుండా సాఫీగా జరగాలంటే అధికారులందరూ సమన్వయంతో పనిచేసి శాఖలవారీగా కేటాయించిన విధులను క్రమశిక్షణతో నిర్వహించాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు హెలికాప్టర్ దిగిన దగ్గర నుంచి సభ ముగించుకుని వెళ్లేంతవరకు అధికారులందరూ అప్రమత్తంగా ఉండి వారికి కేటాయించిన విధులను సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. సమావేశంలో జేసీ గోపాలక్రిష్ణ, కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్‌యశ్వంత్, వివిధ శాఖల జిల్లాస్థాయి అధికారులు పాల్గొన్నారు.
సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ
మండలంలోని లింగన్నపాలెం గ్రామంలో నిర్మించిన ఎంఎస్‌ఎంఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఈనెల 11న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రానున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్‌రాజు ఆదివారం ఎంఎస్‌ఎంఈ పార్క్‌ను పరిశీలించారు. హెలిప్యాడ్, రూట్ మ్యాప్, ప్రజావేదిక, వాహన పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న పోలీసు అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ముఖ్యమంత్రి రాకపోకల సమయంలో ఎటువంటి అంతరాయం కలగకుండా అన్నివిభాగలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. భద్రతా బలగాలకు విధుల కేటాయింపు, ట్రాఫిక్ నియంత్రణతో పాటు సభకు వచ్చే ప్రజల రాకపోకలపై స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. కార్యక్రమంలో కనిగిరి డీఎస్పీ సాయిఈశ్వర్‌యశ్వంత్, సీఐ ఖాజావలి, పీసీపల్లి, హెచ్‌ఎంపాడు ఎమ్మెల్యే జి.కోటయ్య, మాధవరావు తదితరులు పాల్గొన్నారు.