లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
ABN , Publish Date - Jun 06 , 2025 | 11:07 PM
దక్షిణ సింహాచలంగా పేరుగాంచిన సింగరాయకొండ వరాహ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు శుక్రవారం రాత్రి శాస్ర్తోక్తంగా అంకురార్పణ చేశారు.
సింగరాయకొండ, జూన్ 6 (ఆంధ్రజ్యోతి) : దక్షిణ సింహాచలంగా పేరుగాంచిన మండలంలోని పాతసింగరాయకొండ వరాహ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు శుక్రవారం రాత్రి శాస్ర్తోక్తంగా అంకురార్పణ చేశారు. తొలుత దేవస్థానంలోని మూలవిరాట్ వరాహ లక్ష్మీనరసింహస్వామి, అమ్మవార్లు రాజ్యలక్ష్మి, గోదాదేవి, యోగానందలక్ష్మీనరసింహస్వామి, స్వయంభు ఆంజనేయుడిని సుందరమైన పూలతో అలంకరించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. రాత్రికి బ్రహ్మోత్సవాలకు ప్రారంభ సూచికంగా మేళతాళాలతో పుట్టమట్టిని దేవస్థానానికి తీసుకొచ్చారు. వేదమంత్రోచ్ఛరణల మధ్య ఆమట్టిలో నవధాన్యాలను పోసి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో పి.కృష్ణవేణి, ప్రధాన అర్చకుడు ఉదయగిరి వెంకట శేషాలక్ష్మీనరసింహాచార్యులు, అర్చకులు నరసింహాచార్యులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారికి ధ్వజారోహణ నిర్వహిస్తారు. రాత్రికి చంద్రప్రభ వాహనంపై లక్ష్మీనరసింహుడు భక్తులకు దర్శనమిస్తారు.
హుండీ ఆదాయం రూ.2.21లక్షలు
వరాహ లక్ష్మీనరసింహస్వామివారి హుండీలోని కానుకలను శుక్రవారం లెక్కించారు. 84 రోజులకు రూ.2,21,135 ఆదాయం వచ్చింది. కార్యక్రమంలో ఈవో పి.కృష్ణవేణి, ప్రధాన అర్చకుడు ఉదయగిరి వెంకట శేషాలక్ష్మీనరసింహాచార్యులు పాల్గొన్నారు.