వేటు తప్పదు!
ABN , Publish Date - Nov 02 , 2025 | 01:23 AM
జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా)లో అవినీతి అనకొండగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్వపు పీడీ కె.శీనారెడ్డి అక్రమాలపై చర్యలకు ఎట్టకేలకు ఉన్నత స్థాయిలో కదలిక వచ్చింది. ఆయన ప్రస్తుతం గుంటూరు డివిజనల్ సహకార శాఖ అధికారిగా ఉన్నారు. అవినీతి, అక్రమాలు.. నిధుల దుర్వినియోగంపై సమగ్ర నివేదికతోపాటు కఠిన చర్యలు తీసుకోవాలని ఎనిమిది నెలల క్రితం నాటి కలెక్టర్ తమీమ్ అన్సారియా ప్రభుత్వానికి నివేదిక పంపారు.
వైసీపీ పాలనలో డ్వామాలో అవినీతి అనకొండపై ప్రభుత్వంలో కదలిక
పూర్వపు పీడీ శీనారెడ్డి అక్రమాలపై దృష్టి సారించిన ఉన్నతాధికారులు
24 అభియోగాలపై సంజాయిషీ కోరుతూ తాఖీదులు
కఠిన చర్యలకు కలెక్టర్ సిఫార్సు చేసిన ఎనిమిది నెలల అనంతరం చర్యలకు సిద్ధం
జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా)లో అవినీతి అనకొండగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్వపు పీడీ కె.శీనారెడ్డి అక్రమాలపై చర్యలకు ఎట్టకేలకు ఉన్నత స్థాయిలో కదలిక వచ్చింది. ఆయన ప్రస్తుతం గుంటూరు డివిజనల్ సహకార శాఖ అధికారిగా ఉన్నారు. అవినీతి, అక్రమాలు.. నిధుల దుర్వినియోగంపై సమగ్ర నివేదికతోపాటు కఠిన చర్యలు తీసుకోవాలని ఎనిమిది నెలల క్రితం నాటి కలెక్టర్ తమీమ్ అన్సారియా ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఇప్పటికి ఈ అంశంపై ఉన్నత స్థాయి అధికారులు దృష్టి సారించారు. కలెక్టర్ నివేదికలో పేర్కొన్న 24 అంశాలపై వివరణ కోరుతూ ఆర్టికల్ ఆఫ్ చార్జెస్ (అభియోగ పత్రం)ను శీనారెడ్డికి పంపుతూ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు ఇచ్చారు. నోట్‌ను అందుకున్న పది రోజుల్లోపు లిఖితపూర్వకంగా సంజాయిషీ ఇవ్వాలని అందులో ఆదేశించారు. ఉత్తర్వుల కాపీలను శీనారెడ్డితోపాటు వ్యవసాయ, సహకార, పీఆర్, గ్రామీణాభివృద్ధి శాఖల ఉన్నతాధికారులు, కలెక్టర్‌కు పంపారు.
ఒంగోలు, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి) : డ్వామా పీడీగా గత వైసీపీ ప్రభుత్వంలో నాలుగున్నరేళ్లు డిప్యుటేషన్‌పై పనిచేసిన శీనారెడ్డి అక్రమాలపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. ఆ మేరకు నోటీసులు జారీ చేసింది. ఆయన పనిచేసిన కాలంలో అవినీతి, అధికార దుర్వినియోగం తదితర అంశాలు ప్రజా ప్రభుత్వం రాగానే వెలుగులోకి వచ్చాయి. వాటిపై విచారణ, చర్యలకు ప్రభుత్వానికి కలెక్టర్ సిఫార్సు చేశారు. ఆయా అంశాలను పరిశీలిస్తే.. వైసీపీ ప్రభుత్వంలో డ్వామా పీడీగా పనిచేసిన శీనారెడ్డి అప్పట్లో అధికార పార్టీ కీలక నేతల అండదండలతో ఇష్టారీతిగా అవినీతికి పాల్పడి దోచేశారన్న ఆరోపణలు, విమర్శలు అధికంగా ఉన్నాయి. ఆ శాఖలో తన ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తూ నిబంధనలు పట్టించుకోకుండా అక్రమాలకు పాల్పడ్డారని.. తద్వారా పెద్దఎత్తున అడ్డగోలుగా సంపాదించారని ప్రస్తుత ప్రభుత్వం వచ్చాక ఫిర్యాదులు వెల్లువెత్తాయి. పీడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ ఈదర మోహన్, మరో ఐదుగురు వ్యక్తిగతంగా వివిధ స్థాయిల్లో ఇచ్చిన ఫిర్యాదులతో పాటు మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేల నుంచి ప్రభుత్వానికి ఫిర్యాదులు చేరాయి.
అక్రమాలు నిజమేనన్న త్రిసభ్య కమిటీ
ఆయా ఫిర్యాదులపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించడంతో నాటి కలెక్టర్ తమీమ్ అన్సారియా గత ఏడాది డిసెంబరులో అప్పటి ఫారెస్టు సెటిల్‌మెంట్ ఆఫీసర్‌గా ఉన్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లోకేశ్వరరావు నేతృత్వంలో త్రిసభ్య కమిటీని నియమించారు. ఆ కమిటీ డిసెంబరు, జనవరి నెలల్లో డ్వామా కార్యాలయంలో రికార్డుల పరిశీలించింది. ఫిర్యాదుదారులైన ఈదర మోహన్, ఇతర వ్యక్తులు, ఆరోపణలు ఎదుర్కొన్న శీనారెడ్డి, అలాగే ఫిర్యాదులోని అంశాలతో సంబంఽధం ఉన్న డ్వామా ఉద్యోగులు కలిపి మొత్తం 70మందికిపైగా ప్రత్యక్షంగా విచారించింది. వారి నుంచి స్టేట్‌మెంట్లు తీసుకుంది. అందుబాటులో ఉన్న అన్ని రికార్డులు పరిశీలించింది. ఫిర్యాదులో పేర్కొన్న అనేక అంశాలు వాస్తవాలేనని డ్వామా పీడీగా శీనారెడ్డి పనిచేసిన కాలంలో భారీగా ప్రభుత్వ ధనం దుర్వినియోగం జరిగినట్లు త్రిసభ్య కమిటీ విచారణలో తేలింది. నిబంధనలకు విరుద్ధంగా పాలనాపరమైన నిర్ణయాలు, అధికార దుర్వినియోగం జరిగిందని.. కొన్ని అంశాలలో ఆ కార్యాలయ ఉద్యోగుల పాత్ర కూడా ఉందని కమిటీ తమ విచారణలో తేల్చింది. ఆ మేరకు కమిటీ సభ్యులు నివేదించగా పరిశీలించిన నాటి కలెక్టర్ అన్సారియా దాదాపు 2వేల పేజీల నివేదికను ప్రభుత్వానికి పంపుతూ శీనారెడ్డిపై కఠిన చర్యలకు సిఫార్సు చేశారు.
పైస్థాయిలో మేనేజ్ చేశారని ప్రచారం..
ఈ ఏడాది ఫిబ్రవరి 11న కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక పంపగా అనంతరం చర్యలు చేపట్టకుండా ఉన్నత స్థాయి అధికారులతో తనకు ఉన్న సంబంధాలతో శీనారెడ్డి అపుకున్నారన్న ప్రచారం ఆ శాఖ వర్గాల్లో సాగింది. అలాగే శీనారెడ్డి అడ్డగోలుగా డ్వామాలో వ్యవహరించిన సమయంలో జిల్లాలో ఆయనకు గాడ్‌ఫాదర్‌గా ఉన్న నాటి అధికార పార్టీ కీలక నేత, ప్రస్తుతం కూటమి పార్టీలో ఉండి శీనారెడ్డిపై చర్యలు ముందుకు సాగకుండా సహకరిస్తున్నారన్న ఆరోపణలు కూడా బలంగా వినిపించాయి. సాధారణంగా ఇలాంటి నివేదికలు కలెక్టర్ల నుంచి చేరితే వారం, పది రోజుల్లో చర్యలు ఉంటాయి. అలాంటిది శీనారెడ్డి వ్యవహారంలో కలెక్టర్ నివేదిక పంపిన తర్వాత నెలల తరబడి చర్యలు లేకపోవడంతో అలాంటి ఆరోపణలు వాస్తవమేనని ప్రచారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన కొందరు కీలక ప్రజాప్రతినిధులు, ఉన్నత స్థాయి నేతలు, ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. దీంతో ఎట్టకేలకు ప్రభుత్వంలో కదలిక వచ్చింది. కలెక్టర్ నివేదిక ఆధారంగా 24 అంశాలపై సంజాయిషీ కోరుతూ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ తాజాగా శీనారెడ్డికి తాఖీదులు ఇచ్చారు. అందులో 24 అంశాలను స్పష్టంగా పేర్కొన్నారు.
అవినీతి, అక్రమ వ్యవహారాలు ఇలా..
సంజాయిషీలో ప్రధాన అంశాలు ఇలా ఉన్నాయి. కార్యాలయంలో పనులు సక్రమంగా జరిగాయని నిర్ధారించకుండా, పరిశీలన చేయకుండానే రూ.1.84 కోట్ల ఉపాధి నిధులు విడుదల చేయడం ఆయన అధికార దుర్వినియోగానికి, విధులలో నిర్లక్ష్యానికి నిదర్శనం.
కొనకనమిట్ల ఏపీవో డి.రవిబాబుపై రూ.41.03 లక్షలు రికవరీకి ప్రొసీడింగ్స్ ఇచ్చి ఆ మొత్తం వసూలు చేయాల్సి ఉండగా రూ.3.42 లక్షలు మాత్రమే రాబట్టారు. ఆయన వద్ద రూ.53వేలు జరిమానా విధించి తిరిగి అదేచోట పోస్టింగ్ ఇచ్చారు. తద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడటంతోపాటు ప్రభుత్వ నిధులకు నష్టం చేశారు.
సర్వీసు నిబంధనలు పాటించకుండా పీఆర్ నుంచి సూపరింటెండెంట్ కేడర్‌లో డ్వామాలో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్న పి.వెంకటస్వామి నియామకం, మండలాల్లో కీలకమైన ఈసీ, జేఈ పోస్టులలో వ్యక్తిగత లాభాలకు ప్రాధాన్యం ఇచ్చారు.
పెద్దారవీడు, కొండపి మండలాల్లో తగిన పరిశీలన చేయకపోవడంతో ఉద్యోగులు రూ.21.65 లక్షలు దుర్వినియోగం చేయగా కమిటీ పరిశీలన సమయంలో తప్పుడు నివేదికలు రూపొందించడం మోసపూరిత చర్యగా గుర్తించారు.
డ్వామాకు ప్రభుత్వం మంజూరు చేసిన సిబ్బంది సంఖ్య కన్నా అధికంగా వ్యక్తిగత స్వార్థం కోసం తన ఇష్టం వచ్చినట్లు నియమించారు.
జలకళ పథకానికి సంబంధించి బ్యాంకుల్లో జమ అయ్యే వడ్డీని తనకు అనుకూలంగా ఉండే అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ద్వారా అక్రమంగా డ్రా చేయుంచారు.
జగనన్న కాలనీల్లో చేపట్టిన పనులకు సంబంధించి ఉపాధి నిధుల వినియోగంలో జిల్లాలో భారీగా అవినీతి, అక్రమాలకు ఆయనే బాధ్యుడు.
గతంలో డ్వామాలో ఫైనాన్స్ మేనేజర్‌గా పనిచేసిన కాలంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఉద్యోగి అయిన తన భార్య పేరుతో వాహన బిల్లులు తీసుకున్నారు. డ్వామా పీడీగా నెలకు రూ.45వేలు మాత్రమే వాహనానికి చెల్లించే అవకాశం ఉండగా రూ.60వేలు వంతున బిల్లులు డ్రా చేశారు.
పీడీగా తనకు ఉన్న అధికారాలను దుర్వినియోగం చేస్తూ పెద్దఎత్తున ఉద్యోగుల బదిలీలు, నియామకాలు చేశారు. సేవా నియామకాలకు విరుద్ధంగా కందుకూరు ఏపీవో సుభాషిణిని అక్కడ ఇన్‌చార్జి ఏపీవోగా, సూపరింటెండెంట్ వెంకటస్వామిని ఇన్‌చార్జి ఏపీవోగా, మరో చిన్నస్థాయి ఉద్యోగిని మార్కాపురం ఏపీడీగా నియమించి వారి కన్నాపై స్థాయి అధికారులైన ఎంపీడీవోలపై పర్యవేక్షణకు పెట్టడం నిబంధనలకు విరుద్ధం.
ఒంగోలు ఏపీడీ పరిధిలో రూ.10.90 లక్షలను అటెండర్ నకిలీ సంతకాలతో బ్యాంకు నుంచి డ్రా చేయగా క్రిమినల్ కేసు పెట్టకుండా పెండింగ్ విచారణ పేరుతో ఆ ఉద్యోగిని తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ సురేష్‌బాబుకు అర్హతలు లేకపోయినా హెచ్‌ఆర్ మేనేజర్‌గా నియమించారు. కార్యాలయానికి భోజనాలు, స్నాక్స్ ఇతరత్రా సరఫరాలో భారీగా బోగస్ బిల్లులతో డ్రా చేయించారు. ఇవన్నీ ఫైనాన్స్ విభాగంలోని ఉద్యోగి ద్వారా చేయించారు.
త్రిపురాంతకం మండలంలో 4వ రౌండ్ సోషల్ ఆడిట్‌లో రూ.3.81కోట్లు దుర్వినియోగమైనట్లు తేలగా అందుకు బాధ్యులైన పది మంది ఉద్యోగులు సస్పెండయ్యారు. వారిపై కలెక్టర్ ఆదేశాలు లేకుండా తొలుత ఏడుగురిని, తర్వాత మిగిలిన ముగ్గురిని విధుల్లోకి తీసుకున్నారు.
వాటర్‌షెడ్ స్కీం నుంచి రూ.1.94 కోట్లను బ్యాంకు నుంచి ఉపసంహరించి ఆ మొత్తాలను ఆఫీసు ఖర్చులకు వినియోగించడం ప్రభుత్వ ఆర్థిక నియామకాలకు, వాటర్‌షెడ్ పథకం మార్గదర్శకాలకు వ్యతిరేకం. ఆయా అంశాలపై సంజాయిషీ ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విచారణ అనంతరం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే ఇంతటి తీవ్రస్థాయిలో ఆర్థిక అక్రమాలు, అవినీతి, అధికార దుర్వినియోగానికి పాల్పడిన అధికారిని కనీసం సస్పెండ్ కూడా చేయకుండా సంజాయిషీ కోరడం వెనుక ఉన్నత స్థాయు అధికారులు, నాటి ప్రభుత్వంలో కీలకంగా నేడు కూటమి పార్టీలో చేరిన నాయకుడి పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.