Share News

ఆక్రమించారు.. దున్నేశారు!

ABN , Publish Date - Nov 05 , 2025 | 01:11 AM

కురిచేడు మండలం ఆవుల మంద పంచాయతీ పరిధిలో పశువుల మేత పోరంబోకు భూమిని వారం రోజుల నుంచి కొంతమంది ఆక్రమించి దున్నుతున్నారు. దీంతో మూగజీవాలకు గ్రాసం చిక్కదని గ్రామస్థులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్‌ రజనీకుమారి ఆ భూములను పరిశీ లించారు. ఆక్రమణదారులకు హెచ్చరికలు జారీ చేసి బోర్డు ఏర్పాటు చేయించారు.

ఆక్రమించారు.. దున్నేశారు!
ఆవులమంద గ్రామంలో ఆక్రమించి దున్నిన పశువుల మేత పోరంబోకు భూమి

ఆవులమంద గ్రామంలో పోరంబోకు భూమిపై కన్ను

చెట్లు తొలగించి చదును చేసి సాగుకు సిద్ధం

అధికారులకు గ్రామస్థుల ఫిర్యాదు

పరిశీలించి బోర్డు ఏర్పాటు చేయించిన తహసీల్దార్‌

కురిచేడు, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి) : కురిచేడు మండలం ఆవుల మంద పంచాయతీ పరిధిలో పశువుల మేత పోరంబోకు భూమిని వారం రోజుల నుంచి కొంతమంది ఆక్రమించి దున్నుతున్నారు. దీంతో మూగజీవాలకు గ్రాసం చిక్కదని గ్రామస్థులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్‌ రజనీకుమారి ఆ భూములను పరిశీ లించారు. ఆక్రమణదారులకు హెచ్చరికలు జారీ చేసి బోర్డు ఏర్పాటు చేయించారు. కురిచేడు మండలం ఆవులమంద పంచాయతీ పరిధి కొత్తూరు గ్రామ సమపంలో కొండబోడు అనుకుని సర్వే నంబరు 140లో 124.91 ఎకరాల పశువుల మేత పోరంబోకు భూమి ఉంది. వారం రోజుల నుంచి కొందరు ఆ భూమిని ఆక్రమించే యత్నాలు చేస్తున్నారు. ఒక్కొక్కరుగా చెట్లు పీకి చదును చేశారు. మరి కొంతమంది ఇది మాది అంటూ హద్దులు ఏర్పాటు చేసుకున్నారు. ఒకరిని చూసి మరొకరు పంటల సాగుకు దిగారు. మేత పోరంబోకు భూమి పూర్తిగా అన్యాక్రాంతమైతే గ్రామంలో పశువులకు గ్రాసం లేకుండా పోయే పరిస్థితి ఎదురవుతుంది. దీంతో పోరంబోకు భూమి ఆక్రమణ విషయమై కొంత మంది గ్రామస్థులు జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈనేపథ్యంలో తహసీల్దార్‌ రజనీకుమారి మంగళవారం ఆవులమంద గ్రామ పరిధిలో కజ్జాకు గురైన పశువుల మేత పోరంబోకు భూమిని పరిశీలించారు. అక్కడ ఉన్న రైతులతో మాట్లాడారు. ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే క్షమించేది లేదని హెచ్చరించారు. ఆక్రమణదారులకు ప్రభుత్వ భూమి ఆక్రమణల చట్టం 1905 ప్రకారం ఫాం-7లో నోటీసులు ఇస్తున్నట్లు ఆమె తెలిపారు.

Updated Date - Nov 05 , 2025 | 01:11 AM