ఆధునికీకరణకు ఆటంకం
ABN , Publish Date - Aug 13 , 2025 | 10:39 PM
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన సాగర్ కాలువల ఆధునికీకరణకు ప్రస్తుత ప్రజా ప్రభుత్వం నడుంబిగించింది. చీమకుర్తి ఎన్‌ఎ్‌సపీ డివిజన్ పరిధిలో ఉన్న పలు మేజర్లు, మైనర్ కాలువల అభివృద్ధిపై దృష్టిసారించింది.
నత్తనడకన సాగర్ కాలువల అభివృద్ధి పనులు
చీమకుర్తి ఎన్‌ఎ్‌సపీ డివిజన్ పరిధిలో రూ.5కోట్లు మంజూరు
పలు మేజర్లలో ప్రారంభం కాని పనులు.. ఓబీసీపై ఆక్రమణలతో ముందుకుసాగని వైనం
చేష్టలుడిగి చూస్తున్న నీటిపారుదలశాఖ అధికారులు
చేతిచమురు వదిలించుకుంటున్నామంటున్న నీటిసంఘాల బాధ్యులు
చీమకుర్తి, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి) : గత వైసీపీ ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన సాగర్ కాలువల ఆధునికీకరణకు ప్రస్తుత ప్రజా ప్రభుత్వం నడుంబిగించింది. చీమకుర్తి ఎన్‌ఎ్‌సపీ డివిజన్ పరిధిలో ఉన్న పలు మేజర్లు, మైనర్ కాలువల అభివృద్ధిపై దృష్టిసారించింది. కాలువల్లో పూడికలు, ఏపుగా పెరిగిన చిల్లచెట్లు, ద్విచక్రవాహనం కూడా వెళ్లలేని దయనీయస్థితిలో ఉన్న కట్టల మరమ్మతులకు నిధులు మంజూరు చేసింది. మొత్తం 87 రకాల పనుల నిర్వహణకు రూ.5.12కోట్లు నిధులు మంజూరయ్యాయి. తదుపరి టెక్నికల్, పరిపాలన అనుమతుల్లో నెలకొన్న జాప్యం, నీటిసంఘాల అధ్యక్షుల మధ్య పనుల పంపకం తదితర విషయాల్లో నెలకొన్న సందిగ్ధతతో విలువైన సమయం వృథా అయింది. ఈలోపు ముందస్తు వర్షాలతో సాగర్, శ్రీశైలం జలాశయాలు నిండటం, అనుకున్న సమయం కన్నా ముందుగానే జలాశయాల నుంచి నీరు విడుదలయ్యాయి. తీరా పుణ్యకాలం ముంచుకొచ్చిన తర్వాత తీరిగ్గా పనులు ప్రారంభించిన నీటిసంఘాల అధ్యక్షులకు ఫీల్డ్ లెవెల్లో ఎదురవుతున్న ఆటంకాలతో చుక్కలు కనిపిస్తున్నాయి. ఇంకా కొన్ని మేజర్లలో ఇంకా పనులు ప్రారంభంకాకపోవటం రైతులను ఆందోళనకు గురిచేస్తుంది.
ఒకవైపు పనులు.. మరోవైపు నీటి కోసం ఎదురుచూపులు
చీమకుర్తి డివిజన్ పరిధిలో పలు మేజర్ల కింద ఉన్న ఆయకట్టు రైతులు సాగునీటి కోసం ఎదురుచూస్తున్నారు. తీరా పుణ్యకాలం ముగిసిన తర్వాత పనులు ప్రారంభించటంతో రామతీర్థం జలాశయం నిండుగా జలాలున్నా దిగువకు నీటిని విడుదల చేయటంలో అధికారులు మిన్నకుండిపోయారు. లేటుగా ప్రారంభించిన పనులు, పనుల నిర్వహణలో నెలకొంటున్న ఆటంకాలతో పనులు ఎప్పటికి పూర్తవుతాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది.
ఓబీసీపై ఆక్రమణల పర్వం
రామతీర్థం జలాశయం నుంచి ఒంగోలు వరకు తాగు, సాగునీరు అందించే కీలకమైన ఒంగోలు బ్రాంచ్ కెనాల్‌పై ఆక్రమణలు చోటుచేసుకోవటం పనుల నిర్వహణకు ప్రధాన ఆటంకంగా మారింది. ఇదిలా ఉంటే కెనాల్ గట్టులపై భారీస్థాయిలో చిల్లచెట్లు పెరగడం ప్రధాన సమస్యగా మారింది. వీటి తొలగింపునకు ప్రభుత్వం మంజూరు చేసిన నిఽధులు ఏపాటికి సరిపోవని పనులు నిర్వహిస్తున్న నీటిసంఘాల బాధ్యులు వాపోతున్నారు. కెనాల్‌పై చోటుచేసుకున్న గ్రానైట్ వ్యర్థాల తొలగింపు పెద్ద సమస్యగా మారింది. కాలువ కట్టలపై యథేచ్ఛగా గ్రానైట్ ఫ్యాక్టరీ ఓనర్లు వ్యర్థాల రాళ్లను డంప్ చేస్తున్నా కూతవేటు దూరంలో నీటిపారుదలశాఖ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు. దీంతో కాలువ మరమ్మతులు నత్తనడకన నడుస్తున్నాయి.