Share News

ఆక్రమణదారులకు నోటీసులు

ABN , Publish Date - Nov 26 , 2025 | 11:03 PM

వాడరేడు - పిడుగురాళ్ల జాతీయ రహదారి(167ఏ)కి ఇరువైపులా ఉన్న ఆక్రమణలు తొలగించి కాలువలను ఏర్పాటు చేసేందుకు అధికారులు సంసిద్ధమయ్యారు. ఇటీవల సంభవించిన మొంథా తుఫాన్‌ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో కాలువలు పొంగిపోయి పర్చూరు ప్రాంతాన్ని వరద నీరు ముంచెత్తింది. దీంతో ఆయా గ్రామాలతోపాటు పంట పొలాలు సైతం ముంపునకు గురయ్యాయి. వరద పోటెత్తడంతో భారీ నష్టం కలిగింది.

ఆక్రమణదారులకు నోటీసులు
పర్చూరు వాగు సమీపంలో కొలతలు వేసి హద్దులు నిర్ణయిస్తున్న అధికారులు(ఫైల్‌)

వాడరేవు-పిడుగురాళ్ల హైవేకి ఇరువైపులా ఆక్రమణలు తొలగించి కాలువల ఏర్పాటుకు చర్యలు

కలెక్టర్‌ ఆదేశాలతో కదలిన యంత్రాంగం

ఇటీవల తుఫాన్‌ పూడ్చిన నష్టం మళ్లీ కలగకుండా చర్యలు

నేడు విచారణ

పర్చూరు, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి) : వాడరేడు - పిడుగురాళ్ల జాతీయ రహదారి(167ఏ)కి ఇరువైపులా ఉన్న ఆక్రమణలు తొలగించి కాలువలను ఏర్పాటు చేసేందుకు అధికారులు సంసిద్ధమయ్యారు. ఇటీవల సంభవించిన మొంథా తుఫాన్‌ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో కాలువలు పొంగిపోయి పర్చూరు ప్రాంతాన్ని వరద నీరు ముంచెత్తింది. దీంతో ఆయా గ్రామాలతోపాటు పంట పొలాలు సైతం ముంపునకు గురయ్యాయి. వరద పోటెత్తడంతో భారీ నష్టం కలిగింది.

నూతనంగా ఏర్పాటు చేస్తున్న వాడరేడు - పిడుగురాళ్ల జాతీయ రహదారి నిర్మాణంలో ఇరువైపులా డ్రైనేజ్‌ కాలువలు ఏర్పాటు చేయకపోవటం వల్ల భవిష్యత్‌లో వరద వస్తే భారీ నష్టం వాటిల్లుతుందని అధికారులు గుర్తించారు. ఇలాంటి దుస్థితి పునరావృతం కాకుండా ఉండాలంటే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అందులో భాగంగా పర్చూరు వాగు నుంచి వై జంక్షన్‌ వరకు జాతీయ రహదారికి ఇరువైపులా కాలువలు తవ్వేందుకు హద్దులు వేయాలని జాతీయ రహదారుల సంస్థ ఈఈ ఈనెల 1న లేఖ రాశారు. జిల్లా కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ ఆదేశాల నేపథ్యంలో పర్చూరు పంచాయతీ, ఆర్‌అండ్‌బీ, రెవెన్యూ శాఖల అధికారుల ఆధ్వర్యంలో ఇటీవల కొలతలు వేసి హద్దులు నిర్ణయించి సంబంధిత ఆక్రమణదారుల వివరాలు సేకరించారు. ఆక్రమణలు ఎందుకు తొలగించకూడదో ఈనెల 27వ తేదీన వివరణ ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శి నోటీసులు జారీచేశారు. విచారణ అనంతరం ఆక్రమణలు తొలగించి కాలువలను అభివృద్ధి చేస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే అక్రమణలు తొలగింపు అనివార్యమని ఉన్నతాధికారులు సైతం స్పష్టం చేశారు.

Updated Date - Nov 26 , 2025 | 11:04 PM