డిమాండ్ కాదు.. డౌట్‌తోనే!
ABN , Publish Date - Aug 31 , 2025 | 02:46 AM
జిల్లాలో ఎరువుల కొరత లేదు.. ప్రస్తుతం అంత డిమాండ్ కూడా లేదు. పంటల సాగుకు అనుగుణంగా చూస్తే ఇప్పుడు ఎరువుల వాడకం పెద్దగా అవసరం ఉండదు. జిల్లాలో రబీ సాగులో యూరియా వాడకం ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. నిరంతరం ఎరువుల దుకాణాలపై దాడులు కొనసాగిస్తూ నియంత్రణ చర్యలు చేపడతాం.
ఎరువులు పుష్కలం.. సరిపడా యూరియా నిల్వలు
నిరంతర తనిఖీలతో మరింతగా నియంత్రణ
తాజా దాడుల్లో గుర్తించిన అక్రమాలపై చర్యలు
నెలవారీ అవసరాలకు అనుగుణంగా సరఫరా
రబీలో ఎలాంటి కొరత రాకుండా చర్యలు
జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు
ఒంగోలు, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి) : ‘జిల్లాలో ఎరువుల కొరత లేదు.. ప్రస్తుతం అంత డిమాండ్ కూడా లేదు. పంటల సాగుకు అనుగుణంగా చూస్తే ఇప్పుడు ఎరువుల వాడకం పెద్దగా అవసరం ఉండదు. జిల్లాలో రబీ సాగులో యూరియా వాడకం ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటాం. నిరంతరం ఎరువుల దుకాణాలపై దాడులు కొనసాగిస్తూ నియంత్రణ చర్యలు చేపడతాం. ఇటీవల జిల్లాలో నిర్వహించిన దాడులలో గుర్తించిన అక్రమాలపై చర్యలు తీసుకున్నాం. ఇదే తరహాలో తనిఖీలు కొనసాగుతాయి’ అని జిల్లా వ్యవసాయాధికారి (డీఏవో) సీహెచ్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎరువులు.. ప్రత్యేకించి యూరియా కొరత, రైతుల ఆందోళన, ప్రభుత్వ చర్యల నేపథ్యంలో జిల్లాలో పరిస్థితిని ఆయన ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు. ఆవివరాలు ఆయన మాటల్లోనే..
జిల్లాలో వ్యవసాయశాఖ పరిధిలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్ సాధారణ సాగు విస్తీర్ణం లక్షా 29వేల హెక్టార్లు. అందులో అత్యధికంగా 68,287 హెక్టార్లలో కంది, 26,981 హెక్టార్లలో పత్తి, 12,826 హెక్టార్లలో వరిసాగు చేస్తారు. ఈ సీజన్‌లో పంటల సాగు విస్తీర్ణం చూస్తే ఇప్పటివరకు 41,607 హెక్టార్లలో సాగైంది. కంది 17,450 హెక్టార్లు, పత్తి 10,206 హెక్టార్లలో వేశారు. వరి నాట్లు ఇప్పుడిప్పుడే వేస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 2,253 హెక్టార్లలో నాట్లు వేశారు. ఖరీఫ్ సీజన్‌లో 54,468 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరంగా వ్యవసాయశాఖ అంచనా వేసింది. తదనుగుణంగా ఎరువులు ఎప్పటికప్పుడు తెప్పిస్తున్నారు. నెలవారీ ఆయా రకాల ఎరువుల అవసరాన్ని పరిశీలించి తదనుగుణంగా జిల్లాకు ఎరువులు వచ్చేలా అలాగే వచ్చిన వాటిని అన్ని ప్రాంతాలకు చేర్చి రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాం.
- యూరియాకు ఎలాంటి కొరత లేదు. సాధారణంగా ఖరీఫ్ కన్నా రబీలో వాడకం ఎక్కువగా ఉంటుంది. ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు జిల్లాలో ప్రతినెల యూరియా నిల్వలు భారీగానే ఉంటున్నాయి. ఏప్రిల్ ఆరంభం నాటికి జిల్లాలో 9,725 టన్నులు నిల్వ ఉంది. తర్వాత ఇప్పటివరకు 10,995 టన్నులు జిల్లాకు వచ్చింది. ఈ ఐదు నెలల్లో 15,455 మెట్రిక్ టన్నులను రైతులు కొనుగోలు చేశారు. 5,295 మెట్రిక్ టన్నులు యూరియా నిల్వలు ఉన్నాయి. సెప్టెంబరు కోటా ప్రకారం మళ్లీ తెప్పించే చర్యలు చేపట్టాం.
- ఎరువులు పుష్కలంగా ఉన్నాయి. ఈ సీజన్‌కు 54,468 మెట్రిక్ టన్నులు అవసరమని గుర్తించాం. ఏప్రిల్ 1 నాటికి జిల్లాలో 27,111 టన్నుల నిల్వలు ఉన్నాయి. తర్వాత ఇప్పటివరకు మరో 41,367 మెట్రిక్ టన్నులు జిల్లాకు వచ్చాయి. మొత్తం 68,478 మెట్రిక్ టన్నులు చేరుకోగా 36,856 మెట్రిక్ టన్నులను రైతులు కొనుగోలు చేశారు. మరో 31,622 టన్నుల నిల్వలు ప్రస్తుతం ఉన్నాయి.
- వాస్తవానికి జిల్లాలో ఎరువులు ప్రత్యేకించి యూరియాకు ఎలాంటి కొరత రాదు. డిమాండ్ కూడా అంతగా లేదు. ఇతర ప్రాంతాల్లో యూరియా సమస్య విని దొరకదమోనన్న ఆందోళన చెందుతున్న రైతులు కొందరు ముందుగా కొనే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనివల్ల కొంత ఇబ్బందికరంగా కనిపిస్తుంది. సాగర్ ఆయకట్టులో వరినాట్లు ప్రారంభంతో ఆ ప్రాంతంలో ఈ తరహా పరిస్థితి ఉంది. అలాగే బోర్ల కింద పంటలు వేసిన ప్రాంతాల్లో కూడా ఉంది.
- కొన్నిచోట్ల వ్యాపారులు కూడా పరిస్థితిని అనుకూలంగా మల్చుకునే ప్రయత్నం చేస్తున్నట్లు వ్యవసాయశాఖ సాధారణంగా చేసే తనిఖీల సమయంలో గుర్తించి మొత్తం అధికారులను అప్రమత్తం చేశాం. ప్రభుత్వ ఆదేశాలతో ఇటీవల జిల్లాలో రెవెన్యూ, విజిలెన్స్ వ్యవసాయశాఖ అధికారులు పెద్దఎత్తున దాడులు చేశారు.
- తాజాగా చేసిన దాడులు పరిశీలిస్తే.. ఈనెల 25 నుంచి 29 వరకు 112 దుకాణాల్లో వివిధ ప్రాంతాల్లో దాడులు చేయగా రూ.34.25 లక్షల విలువైన 187.27 మెట్రిక్ టన్నుల ఎరువులు సీజ్ చేశారు. అలాగే పది దుకాణాలపై 6(ఏ) కేసులు నమోదు. ఒకచోట క్రిమినల్ కేసు నమోదు జరిగింది. స్వయంగా జేసీ గోపాలకృష్ణ దుకాణాల్లో దాడుల్లో పాల్గొన్నారు.
- ఈ తరహా దాడులు నిరంతరం కొనసాగుతాయి. రైతులకు ఇబ్బంది లేకుండా కలెక్టర్ ఆదేశాలతో చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాకు వచ్చే ఎరువులో 50శాతం వ్యాపారులు, 50శాతం సహకార రంగం ద్వారా విక్రయాలకు ఇస్తాం. తాజా పరిస్థితి నేపథ్యంలో కలెక్టర్ ఆదేశాలతో సహకార సంస్థలకు 70 శాతం ఇచ్చి డీలర్లకు 30శాతం మాత్రమే కేటాయిస్తున్నాం.
- యూరియాతో సహా ఏ ఎరువు కోరత లేకుండా రైతులందరికీ సక్రమంగా అందేలా చూస్తాం. రబీపై మరింత దృష్టిపెడతాం. రైతులెవ్వరు ఆందోళన చెందవద్దు. దొరకవేమోనన్న ఆందోళనతో అవసరం లేకపోయినా కొనుగోలు చేసే పరిస్థితికి రావద్దు. అలా చేయడం వల్ల సమస్య పెరుగుతుందని రైతులు గుర్తించాలి.