Share News

ధర తగ్గించినా ఆగని నోబిడ్లు

ABN , Publish Date - Aug 10 , 2025 | 01:44 AM

పొగాకు మార్కెట్‌లో నోబిడ్‌ బేళ్లను తగ్గించేందుకు బోర్డు అధికారులు తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం ఉపకరించడం లేదు. దాదాపు నెలన్నరగా కిలో కనిష్ఠ ధర రూ.150తో వేలం నడుపుతున్న అధికారులు, నోబిడ్‌లను ఆపడం కోసం ఆ ధరలను తగ్గించారు.

ధర తగ్గించినా ఆగని నోబిడ్లు

కనిష్ఠ ధర కిలో రూ.140.. గతం కన్నా రూ.10 తగ్గింపు

అయినా లోగ్రేడ్‌ల కొనుగోలుకు ముందుకు రాని వ్యాపారులు

ఒంగోలు, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): పొగాకు మార్కెట్‌లో నోబిడ్‌ బేళ్లను తగ్గించేందుకు బోర్డు అధికారులు తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం ఉపకరించడం లేదు. దాదాపు నెలన్నరగా కిలో కనిష్ఠ ధర రూ.150తో వేలం నడుపుతున్న అధికారులు, నోబిడ్‌లను ఆపడం కోసం ఆ ధరలను తగ్గించారు. శుక్ర, శనివారాలలో కనిష్ఠ ధర రూ.140గా పెట్టారు. అలా కిలోకు రూ.10 తగ్గించినా ఆ బేళ్లను కొనేందుకు వ్యాపారులు ముందుకు రాక నోబిడ్‌లు గణనీయంగా ఉంటున్నాయి. కనిష్ఠ ధరలు తగ్గించినప్పటికీ శుక్ర, శనివారాల్లో సగటున ఇంచుమించు 26శాతం బేళ్లు నోబిడ్‌ అయ్యాయి. శుక్రవారం దక్షిణాదిలోని 11 వేలం కేంద్రాలకు 7,349 బేళ్లను అమ్మకానికి రైతులు తీసుకురాగా 4,873 కొనుగోలు చేశారు. సుమారు 33.70 శాతం బేళ్లు తిరస్కరణలు జరిగాయి. శనివారం 6,877 బేళ్లు తీసుకురాగా 4,534ను కొనుగోలు చేశారు. అంటే ఈసారి కూడా దాదాపు 34శాతం బేళ్లు తిరస్కరణలు జరిగాయి. అదేసమయంలో శుక్రవారం నోబిడ్‌ బేళ్లు 26.29 శాతంగా ఉండగా శనివారం 25.70శాతం ఉన్నాయి. దీన్నిబట్టి చూస్తే కనిష్ఠ ధరలను బోర్డు అధికారులు తగ్గించినా నోబిడ్‌ బేళ్లు మాత్రం తగ్గడం లేదు. కాగా శనివారం మార్కెట్‌లో అత్యధికంగా కలిగిరి కేంద్రంలో 46.43 శాతం బేళ్లు నోబిడ్‌ అయ్యాయి. అలాగే పొదిలిలో 37.16 శాతం, ఒంగోలు-1లో 32.02 శాతం, కనిగిరిలో 31.27 శాతం, కందుకూరు-2లో 31.22 శాతం బేళ్లు నోబిడ్‌ అయ్యాయి.

Updated Date - Aug 10 , 2025 | 01:44 AM