నోబిడ్ సంకటం
ABN , Publish Date - Nov 26 , 2025 | 02:42 AM
ఈ సీజన్ పొగాకు కొనుగోళ్లు పూర్తికావస్తున్న సమయంలో రైతులకు సంకట పరిస్థితి నెలకొంది. భారీగా బేళ్లను నోబిడ్ చేస్తుండటంతో ఏం చేయాలో తెలియక అల్లాడుతున్నారు. వేలానికి చివరి రెండుమూడు రోజులు కావడంతో రైతులు పొదిలి పొగాకు కేంద్రానికి చెక్కులతో చేరుకొని నిరీక్షిస్తున్నారు.
రోడ్లపై పొగాకు రైతుల నిరీక్షణ
సీజన్ ముగిసే సమయం కావడంతో పడిగాపులు
పొదిలి, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి) : ఈ సీజన్ పొగాకు కొనుగోళ్లు పూర్తికావస్తున్న సమయంలో రైతులకు సంకట పరిస్థితి నెలకొంది. భారీగా బేళ్లను నోబిడ్ చేస్తుండటంతో ఏం చేయాలో తెలియక అల్లాడుతున్నారు. వేలానికి చివరి రెండుమూడు రోజులు కావడంతో రైతులు పొదిలి పొగాకు కేంద్రానికి చెక్కులతో చేరుకొని నిరీక్షిస్తున్నారు. ఈనెల 27వ తేదీతో కొనుగోళ్లు ముగుస్తుండటంతో రెండు రోజులుగా వేలం కేంద్రం కిటకిటలాడుతోంది. ట్రాక్టర్లు నిలుపుకోవడానికి వీలులేకపోవడంతో రైతులు రోడ్లపైనే ఆపి చెక్కులపైనే నిద్రిస్తున్నారు. బోర్డు అధికారులు రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారు. బయ్యర్లంతా సిండికేటై 80శాతానికిపైగా నోబిడ్ అంటూ చెక్కులను కొనుగోలు చేయడం లేదు. సీజన్ కొనుగోళ్లు ముగిసే సమయం కావడంతో రైతులలో ఆందోళన నెలకొంది. పంట పండించడానికి అధిక మొత్తంలో ఖర్చుచేశామని, తీరా బోర్డుకు వస్తే నాణ్యత లేదనే కారణంతో వ్యాపారులు నోబిడ్ అని కొనడం లేదని వాపోతున్నారు. సోమవారం 1,600 బేళ్లు వేలానికి వస్తే వాటిలో 999 అధికారులు నోబిడ్‌గా ప్రకటించారు. దీంతో ఏం చేయాలో తెలియక రైతులు అయోమయంలో పడ్డారు. చెక్కులను ఇంటికి తీసుకెళ్ల లేక కొంతమంది క్వింటా రూ.1000కి బయట దళారులకు అమ్ముకున్నారు. సోమవారం ఒక్కరోజే సుమారు 400 చెక్కులు ఇలా అమ్ముకున్నారంటే రైతుల దయనీయ పరిస్థితి అర్థమవుతోంది. బోర్డు ఉన్నతాధికారులు స్పందించి వేలంను మరికొద్దిరోజులు పొడిగించాలని రైతులు కోరుతున్నారు.