Share News

పని లేదు.. పర్యవేక్షణ లేదు!

ABN , Publish Date - Nov 13 , 2025 | 02:27 AM

సచివాలయ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. ప్రజా ప్రభుత్వం లోటుపాట్లను సరిచేస్తూ మూడు కేటగిరీల్లోకి తెచ్చి సిబ్బందిని సర్దుబాటు చేసినా గాడిన పడలేదు. ఎవరు ఏ పని చేస్తున్నారో, ఏ పని మీద ఎక్కడికి వెళ్లారో, తిరిగి ఎప్పుడు కార్యాలయానికి వస్తారో తెలియని పరిస్థితి. అడ్మిన్‌ సెక్రటరీ, డిజిటల్‌ అసిస్టెంట్‌, వీఆర్వో, హెల్త్‌ అసిస్టెంట్‌ వంటి వారికి ఏదో ఒక పని ఉంటున్నప్పటికీ మహిళా పోలీస్‌, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ వంటి వారు నామమాత్రమే అయ్యారు.

పని లేదు.. పర్యవేక్షణ లేదు!

అస్తవ్యస్తంగా సచివాలయాలు

సిబ్బంది ఎక్కువ.. పని తక్కువ

ఎవరు ఏ పనిచేస్తున్నారో తెలియదు

ప్రభుత్వ సర్వేలన్నీ వారిపైనే.. ఆ పేరు చెప్పి కార్యక్రమాలకు దూరం

కనిపించని సమయపాలన

ప్రభుత్వ లక్ష్యానికి దూరంగా పనితీరు

సచివాలయ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. ప్రజా ప్రభుత్వం లోటుపాట్లను సరిచేస్తూ మూడు కేటగిరీల్లోకి తెచ్చి సిబ్బందిని సర్దుబాటు చేసినా గాడిన పడలేదు. ఎవరు ఏ పని చేస్తున్నారో, ఏ పని మీద ఎక్కడికి వెళ్లారో, తిరిగి ఎప్పుడు కార్యాలయానికి వస్తారో తెలియని పరిస్థితి. అడ్మిన్‌ సెక్రటరీ, డిజిటల్‌ అసిస్టెంట్‌, వీఆర్వో, హెల్త్‌ అసిస్టెంట్‌ వంటి వారికి ఏదో ఒక పని ఉంటున్నప్పటికీ మహిళా పోలీస్‌, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌ వంటి వారు నామమాత్రమే అయ్యారు. ఇతరులలో వ్యవసాయ, వెటర్నరీ, సర్వే అసిస్టెంట్లకు పరిమితంగా పనులు ఉంటున్నాయి. మొత్తంగా ఎక్కువ మందికి పనితోపాటు వారిపై పర్యవేక్షణ కూడా తక్కువగానే ఉంది. అదేసమయంలో సర్వేల పేరుతో జిల్లా యంత్రాంగం కూడా సచివాలయ సిబ్బందిని గందరగోళ పరుస్తోంది. కొందరు ఆ సాకు చూపి కార్యాలయాలకు దూరంగా ఉంటున్నారు. అత్యధిక శాతం సచివాలయాల్లో సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. ఎక్కువ చోట్ల ఇద్దరు, ముగ్గురు మించి కనిపించకపోవడం అందుకు నిదర్శనం.

ఒంగోలు, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి) : సచివాలయ వ్యవస్థ అంతా గందరగోళం, అస్తవ్యస్తంగా ఉంది. పని తక్కువ, సిబ్బంది ఎక్కువ అన్నట్లు పరిస్థితి తయారైంది. వీరిపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. కొందరు సిబ్బందికి పనిభారం ఉంటే మరికొందరికి కనీస పని కూడా ఉండని స్థితి. జిల్లాలోని సచివాలయాల పనితీరుపై ఆంధ్రజ్యోతి బృందం పరిశీలన చేసింది. అత్యధిక శాతం సచివాలయాల్లో అరకొర సిబ్బంది మాత్రమే కనిపించారు. అంతా గందరగోళంగా ఉన్న విషయం స్పషమైంది. గత వైసీపీ ప్రభుత్వం హడావుడిగా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించింది. కొత్త వ్యవస్థను తెచ్చామని ఆర్భాటపు ప్రచారం తప్ప అవి సజావుగా నడిచేలా అవసరమైన ఏర్పాట్లు చేయలేదు. పర్యవేక్షణ సక్రమంగా ఉండేలా నిబంధనలు, సిబ్బందికి శిక్షణ, వారిలో జవాబుదారీతనం ఉండే చర్యలు చేపట్టలేదు. రాజకీయ అవసరాల కోసం వలంటీర్ల వ్యవస్థను తెచ్చి సచివాలయాలకు అనుసంధానం చేయడంతో ప్రజల వద్దకు సచివాలయ సిబ్బంది వెళ్లలేని పరిస్థితి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సచివాలయ వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేపట్టింది.

మూడు కేటగిరీలు చేసి సర్దుబాటు

జనాభా ప్రాతిపదికన సచివాలయాలను మూడు కేటగిరీలుగా విభజించి ఒక్కో దానికి స్థాయిని బట్టి సిబ్బందిని సర్దుబాటు చేశారు. సవరించిన దాని ప్రకారం జిల్లాలో 2,500లోపు జనాభా ఉండే సచివాలయాలు 201 ఉండగా, 2,500 నుంచి 3,500 జనాభా ఉండే సచివాలయాలు 219, అంతకన్నా అధికంగా ఉండే సీ కేటగిరీ సచివాలయాలు 299 కలిపి మొత్తం 719 ఉన్నాయి. వాటిలో మొత్తం 6,122 మంది సిబ్బంది పని చేస్తున్నారు. కొన్ని ఖాళీలు ఉన్నాయి. ఏ కేటగిరి సచివాలయాల్లో ఆరుగురు, బీ కేటగిరిలో 8 మంది, సీ కేటగిరిలో పది మంది సిబ్బంది ఉండేలా ఏర్పాటు చేశారు. అయితే అన్ని సచివాలయాల్లో అడ్మిన్‌ సెక్రటరీ, మహిళా పోలీస్‌, వీఆర్వో, డిజిటల్‌ అసిస్టెంట్‌, వెల్ఫేర్‌ సెక్రటరీ, హెల్త్‌ అసిస్టెంట్‌ ఉంటుండగా పట్టణాల్లో శానిటేషన్‌, ప్లానింగ్‌ వంటి వారు గ్రామాల్లో వ్యవసాయ, విలేజ్‌ సర్వేయర్‌, వెటర్నరీ, ఎనర్జీ అసిస్టెంట్లు ఉంటున్నారు. అయితే ఆయా సచివాలయాల్లోని సిబ్బంది అడ్మిషన్‌ సెక్రటరీ, డిజిల్‌ అసిస్టెంట్‌, వీఆర్వో, హెల్త్‌ వంటి వారికి ఏదో ఒక పని ఉంటున్నా మిగతా సిబ్బందిలో ఎక్కువ మంది రోజువారీ సరిపడా పని కనిపించడం లేదు.

చాలామంది ఖాళీగానే..

మహిళా పోలీస్‌, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు దాదాపు ఖాళీగా ఉంటున్నారు. గ్రామాల్లో వ్యవసాయ, వెటర్నరీ, విద్యుత్‌, విలేజ్‌ సర్వేయర్‌ వంటి వారికి అప్పుడప్పుడూ పని ఉంటోంది. పట్టణాల్లో శానిటేషన్‌ ఇతర సిబ్బందికి పరిమితంగా పనులు ఉంటున్నాయి. దీంతో ఎక్కువ శాతం సచివాలయాల్లో సిబ్బంది సక్రమంగా విధులకు రావడం లేదు. ఇదే విషయం ఆంధ్రజ్యోతి బృందం పరిశీలన సందర్భంగా కనిపించింది. అనేక సచివాలయాలు అధ్వానంగా పనిచేస్తున్న తీరు బహిర్గతమైంది. చాలాచోట్ల సకాలంలో సచివాలయాలు తలుపులు కూడా తెరుచుకో లేదు. మధ్యాహ్నం వరకు కూడా కొన్నింటిలో ఒకరిద్దరు సిబ్బంది మాత్రమే కనిపించారు. మిగతా వారి గురించి అడిగినా ఉన్న సిబ్బంది సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది.

సర్వేల పేరుతో గెర్హాజరు..

ఎవరు ఎక్కడికి వెళ్తున్నారో ఎప్పుడు తిరిగి వస్తారో ఎవరికీ తెలియని పరిస్థితి సచివాలయాల్లో నెలకొంది. ఎక్కువ మంది సిబ్బంది సర్వేలు, ఇతర శాఖల పనులకు డిప్యుటేషన్లు పేరు చెప్పి సచివాలయాలకు సక్రమంగా హాజరు కావడం లేదు. ప్రభుత్వం కూడా ఏ శాఖకు సంబంధించిన పని అత్యవసరమైతే దానికి, ఏ సర్వేకి అవసరమైతే ఆ సర్వేలకు సచివాలయ సిబ్బందిని వాడుకొంటోంది. జిల్లా అధికారులు కూడా ఆ వ్యవస్థను మరింత గందరగోళం చేస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం వచ్చాక దాదాపు పది రకాల సర్వేలతోపాటు పలువురు సిబ్బందిని ఓటర్ల సవరణ కోసం బీఎల్వోలుగా నియమించింది. మొత్తంగా చూస్తే జిల్లాలో సచివాలయాల పనితీరు ప్రస్తుత ప్రభుత్వంలోనూ అవసరమైన మేర మెరుగుపడకుండా అస్తవ్యస్తంగానే సాగుతోంది.

Updated Date - Nov 13 , 2025 | 02:27 AM