కె.ఉప్పలపాడుపై చిన్నచూపులేదు
ABN , Publish Date - Jun 01 , 2025 | 10:48 PM
కె.ఉప్పలపాడు గ్రామంపై తనకు ఎప్పుడూ చిన్నచూపులేదని, దివంగత మంత్రి దామచర్ల ఆంజనేయులు హయంలో గ్రామంలో శివాలయం నిర్మించడంతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, తర్వాత తన హయంలోనే సీసీరోడ్లు, తారురోడ్లు వేశామని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖామంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి అన్నారు.
మాజీ ఎమ్మెల్యేతో మంత్రి స్వామి సంభాషణ
కొండపి, జూన్1 (ఆంధ్రజ్యోతి): కె.ఉప్పలపాడు గ్రామంపై తనకు ఎప్పుడూ చిన్నచూపులేదని, దివంగత మంత్రి దామచర్ల ఆంజనేయులు హయంలో గ్రామంలో శివాలయం నిర్మించడంతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, తర్వాత తన హయంలోనే సీసీరోడ్లు, తారురోడ్లు వేశామని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖామంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి అన్నారు. ఆదివారం గ్రామంలో రేషన్ షాపు ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన సభలో మాజీ ఎమ్మెల్యే గుండపనేని అచ్యుత్‌కుమార్ గ్రామంలోని పలు సమస్యలను ప్రస్తావించి పరిష్కరించాలని సూచించారు. గ్రామంలో ఎప్పుడూ టీడీపీకి మెజార్టీ రావడం లేదని అందువల్లనే మంత్రి గ్రామాన్ని చిన్నచూపు చూస్తున్నారని అచ్యుత్‌కుమార్ సభలో అన్నారు. అనంతరం మంత్రి స్వామి మాట్లాడుతూ 2014-19లో గ్రామం నుంచి రెండు కోట్ల రూపాయలతో చిర్రికూరపాడు గ్రామానికి తారురోడ్డు వేశామన్నారు. అయినా తర్వాత ఎన్నికల్లో రెండు గ్రామాల్లో మెజార్టీ రాలేదని గుర్తు చేశారు. అదేకాలంలో గ్రామంలో లక్షల రూపాయలతో సిమెంటు రోడ్డు శ్మశానవాటికలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేశామన్నారు. దివంగత మంత్రి దామచర్ల ఆంజనేయులు హయంలో, తర్వాత తన హయంలో గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని గుర్తు చేశారు. వైసీపీ పాలనలో గ్రామంలో ఏ పనీ జరగలేదని మంత్రి అన్నారు. పార్టీకి, తనకు మెజార్టీలు రాకపోయినా తనకు ఓటు వేసిన వారికైనా న్యాయం చేయాలి కదా? రోడ్లపై ఓట్లు వేయనివారు ఎక్కువ మంది నడిచినా, తక్కువ మంది తనకు ఓటు వేసినవారు నడిచినా తాను ఆ విషయాన్ని పట్టించుకోనన్నారు. గ్రామంలో సీసీరోడ్లు వేస్తానని మంత్రి అన్నారు. గ్రామంలోని ఎస్సీ కాలనీకి 20 లక్షల రూపాయలు తాగునీటి ట్యాంకు నిర్మాణానికి మంజూరు చేశానని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. రాబోయే రోజుల్లో కూడా అచ్యుత్‌కుమార్ ప్రస్తావించిన అన్ని సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తానని మంత్రి హామీనిచ్చారు. గ్రామంలోని ప్రధానమైన ఆర్‌అండ్‌బీ రోడ్డుకు ఇరువైపులా సైడు కాల్వలు నిర్మించాలని, గ్రామం నుంచి పందలపాడుకు వెళ్లే డొంకరోడ్డును, నల్లవాగు మీదగుండా వెళ్లే గురవారెడ్డి డొంకను బాగు చేయాలని, గ్రామంలోని పలు వీధుల్లో విద్యుత్ తీగలు తక్కువ ఎత్తులో ఉన్నాయని, ఎత్తైన స్తంభాలు వేసి తీగలు వాహనాలకు తగలకుండా చూడాలని అచ్యుత్‌కుమార్ మంత్రికి సూచించారు.