Share News

పంచాయతీ నిధుల దుర్వినియోగంపై చర్యలు నిల్‌

ABN , Publish Date - May 22 , 2025 | 10:59 PM

మండలంలోని పలు పంచాయతీల్లో జరిగిన నిధుల దుర్వినియోగంపై ఏళ్లు గడుస్తున్నా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఏకారణం చేతనో ఉన్నతాధికారులు సైతం ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

పంచాయతీ నిధుల దుర్వినియోగంపై చర్యలు నిల్‌

ఉద్దేశపూర్వకంగా

జాప్యం చేస్తున్న అధికారులు

దర్శి, మే 22(ఆంధ్రజ్యోతి): మండలంలోని పలు పంచాయతీల్లో జరిగిన నిధుల దుర్వినియోగంపై ఏళ్లు గడుస్తున్నా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఏకారణం చేతనో ఉన్నతాధికారులు సైతం ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అనేక పంచాయతీల్లో ఎలాంటి పనులు చేయకుండానే అడ్డగోలుగా నిధుల డ్రా చేసుకున్నారు. చేపల చెరువుల పాటల ద్వారా వచ్చిన నిధులను కూడా స్వాహా చేశారు. అప్పటి వైసీపీ నాయకుల అండదండలతో స్థానిక అధికారులు అక్రమాలకు సహకరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్రమార్కులపై కొరడా జులిపిస్తారని భావించినప్పటికీ ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. గ్రామస్థుల ఫిర్యాదుల మేరకు రాజంపల్లి పంచాయతీలో నిధులు దుర్వినియోగమైనట్టు విచారణలో తేలటంతో సర్పంచ్‌ చెక్‌పవర్‌ రద్దు చేశారు. అయితే, అక్రమాల్లో కీలకపాత్ర పోషించిన పంచాయతీ కార్యదర్శులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

తూర్పువెంకటాపురం పంచాయతీలో రూ.25 లక్షల నిధులు ఎలాంటి పనులు చేయకుండా డ్రా చేసుకున్నారని కొంతమంది గ్రామస్థులు నేరుగా జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అనేకసార్లు మీ కోసం కార్యక్రమాల్లో వివరాలతో ఫిర్యాదులు అందజేశారు. జముకులదిన్నె, సామంతపూడి, తూర్పువీరాయపాలెం, కొత్తపల్లి తదితర పంచాయతీల్లోనూ నిధుల దుర్వినియోగమైనట్టు గతంలో ఫిర్యాదులు అందాయి. అప్పటి వైసీపీ నాయకులు ఒక పంచాయతీ కార్యదర్శిని నాలుగు పంచా యతీలకు ఇన్‌చార్జ్‌గా వేసుకొని పనులు చేయకుండా అడ్డగోలుగా నిఽధులను డ్రా చేసుకున్నట్లు విమర్శలు వచ్చాయి. గ్రామస్థుల ఫిర్యాదుల మేరకు కొన్ని పంచాయతీలకు అప్పటి డీఎల్‌పీవోను విచారణ అధికారిగా నియమించారు. ఆ అధికారి బదిలీ అయినప్పటికీ విచారణ నేటికీ పూర్తి కాలేదు. కొన్ని పంచాయతీల్లో జరిగిన అక్రమాలపై ఇప్పటివరకు విచారణ జరగలేదు. కాలం గడిచేకొద్దీ ఈ అక్రమాలు మరుగున పడిపోతున్నాయి.

పంచాయతీల్లో దుర్వినియోగమైన లక్షలాది రూపాయలు డ్రా చేసుకున్న అధికారులు హాయిగా ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇంత జరిగినా అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకపోవటం పట్ల ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినతర్వాత రాష్ట్రంలో అనేక కుంభకోణాలపై విచారణ కమిటీలు వేశారు. పంచాయతీల్లో జరిగిన అక్రమాలపై పట్టించుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి గతంలో జరిగిన లావాదేవీల రికార్డులను పరిశీలిస్తే అక్రమాలు వెలుగుచూసే అవకాశం ఉంటుంది. అక్రమార్కులపై చర్యలు తీసుకోకుండా వదిలేస్తే భవిష్యత్తులో ఇదే పరిస్థితి పునరావృతం అవుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. జిల్లా అధికారులు విచారణ కమిటీ వేసి అక్రమాలు నిగ్గుతేల్చి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - May 22 , 2025 | 10:59 PM