Share News

వైభవంగా నిర్మమహేశ్వరుని తెప్పోత్సవం

ABN , Publish Date - Mar 13 , 2025 | 11:49 PM

దక్షిణకాశీగా పేరొందిన పొదిలిలోని పార్వతీ సమేత నిర్మమహేశ్వరస్వామి తెప్పోత్సవం గురువారం రాత్రి కన్నుల పండువగా జరిగింది. దేవాలయ అధికారులు భారీ ఏర్పాట్ల మధ్య తెప్పోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.

వైభవంగా నిర్మమహేశ్వరుని తెప్పోత్సవం
తెప్పోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే నారాయణరెడ్డి

పొదిలి, మార్చి 13 (ఆంధ్రజ్యోతి) : దక్షిణకాశీగా పేరొందిన పొదిలిలోని పార్వతీ సమేత నిర్మమహేశ్వరస్వామి తెప్పోత్సవం గురువారం రాత్రి కన్నుల పండువగా జరిగింది. దేవాలయ అధికారులు భారీ ఏర్పాట్ల మధ్య తెప్పోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి దేవస్థాన చైర్మన్‌ ఒగ్గు వెంకటరామయ్య, ఆలయ ఈవో నర్రా నారాయణరెడ్డిల ఆధ్వర్యంలో తొలిసారిగా అంగరంగ వైభవంగా తెప్పోత్సవం నిర్వహించారు. ఉభయదాతలుగా గునుపూడి భాస్కర్‌, గునుపూడి చెంచుసుబ్బారావు, గునుపూడి మధుసుధనరావు, పేర్ల శ్రీనివాసరావు బ్రదర్స్‌ ఆధ్వర్యంలో పుష్కరిణిలో మాహాసంప్రోక్షణ చేశారు. పుష్కరిణిని ఎంతో అందంగా అలంకరించి విద్యుత్‌ దీపాల అలంకరణలో పార్వతీ సమేత నిర్మమహేశ్వరస్వామి వార్లను ప్రత్యేకంగా అలంకరించి తెప్పపై ఉంచారు.

50 ఏళ్ల తరువాత నిర్వహణ

50 ఏళ్ల తరువాత నిర్వహిస్తున్నపార్వతీ సమేత నిర్మమహేశ్వరస్వామి అమ్మవార్లతో తెప్పోత్సవాన్ని చూడటానికి పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో కోనేరు దగ్గరకు వచ్చి స్వామిని దర్శించుకొని తెప్పోత్సవాన్ని తిలకించారు. పుష్కరిణిలో మోటార్లద్వారా నీటిని నింపి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పగటిపూట ట్రయిల్‌ వేశారు. 50ఏళ్లలో తెప్పోత్సవాన్ని నిర్వహించిన దాఖలు లేకపోవడం ఈఏడాది నిర్వహించడంతో ప్రజలు, భక్తులు ఆనందం వెలిబుచ్చుతున్నారు. తెప్పపై ఉంచిన స్వామివార్లకు ఎమ్మెల్యే నారాయణరెడ్డి పూజలు చేసి తెప్పోత్సవాన్ని ప్రారంభించారు.

Updated Date - Mar 13 , 2025 | 11:49 PM