కొత్త గురువు.. విద్యాభివృద్ధికి ఆదరువు
ABN , Publish Date - Oct 12 , 2025 | 10:57 PM
గ్రామీణ విద్యకు ప్రజా ప్రభుత్వం పునరుజ్జీవం తెచ్చింది. ఇప్పటివరకు మారుమూల గ్రామాల్లో ఉపాధ్యాయుల కొరత కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఆ సమయంలో ప్రజాప్రభుత్వం ఏర్పడగానే చెప్పిన మాట ప్రకా రం మెగా డీఎస్సీని ప్రకటించి ఉద్యోగాలు ఇవ్వడం, జిల్లా కు వచ్చిన ఉపాధ్యాయుల్లో మూడోవంతు మందిని వెనుకబడిన ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి కేటాయించడం విశేషం. దీంతో ఈ ప్రాంతంలో నేటి నుంచి కొత్తగా వచ్చే గురువులతో గ్రామీణ విద్యా వికాసానికి నాంది పలికినట్టయింది.
ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి 184 మంది కొత్త ఉపాధ్యాయులు
గురుకులాలకు అదనంగా మరికొందరు
నేటి నుంచి పాఠశాలలకు హాజరు
చాలావరకు తీరనున్న టీచర్ల కొరత
గ్రామీణ విద్యలో వికాసానికి నాంది
త్రిపురాంతకం, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి) : గ్రామీణ విద్యకు ప్రజా ప్రభుత్వం పునరుజ్జీవం తెచ్చింది. ఇప్పటివరకు మారుమూల గ్రామాల్లో ఉపాధ్యాయుల కొరత కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఆ సమయంలో ప్రజాప్రభుత్వం ఏర్పడగానే చెప్పిన మాట ప్రకా రం మెగా డీఎస్సీని ప్రకటించి ఉద్యోగాలు ఇవ్వడం, జిల్లా కు వచ్చిన ఉపాధ్యాయుల్లో మూడోవంతు మందిని వెనుకబడిన ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి కేటాయించడం విశేషం. దీంతో ఈ ప్రాంతంలో నేటి నుంచి కొత్తగా వచ్చే గురువులతో గ్రామీణ విద్యా వికాసానికి నాంది పలికినట్టయింది.
ఉదాహరణకు పుల్లలచెరువు ఉన్నత పాఠశాలలో దాదాపు 500 మంది విద్యార్థులుండగా, ఇక్కడ 24 మంది ఉపాధ్యాయులు ఉండాలి. కానీ ఇప్పటివరకు కేవలం ముగ్గురు మాత్రమే ఉన్నారు. కొత్తగా వచ్చే ఉపాధ్యాయుల కోటాలో ఈ పాఠశాలకు సబ్జెక్ట్ బోధించే ఉపాధ్యాయులు ఏడుగురు వస్తున్నారు. లెక్కలు, ఫిజికల్ సైన్స్, సోషల్, ఇంగ్లీష్, హిందీ. ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులు వస్తున్నారు. సబ్జెక్ట్ బోధనకు ఉపాధ్యాయులు రావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తప్పనిసరి పోస్టులన్నీ భర్తీ...
కొత్తగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ నియామకాలు పొందిన వారంతా సోమవారం విధుల్లో చేరనున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 657 మంది ఉపాధ్యాయులు వెబ్ కౌన్సెలింగ్ ద్వారా పాఠశాలల ఎంపిక పూర్తయి వారివారి పాఠశాలల్లో చేరుతున్నారు. జిల్లాలో వెనుకబడిన ప్రాంతం ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో అత్యధికంగా ఖాళీలు ఉండడంతో అక్కడకు ఉపాధ్యాయులు వస్తారో, రారోనన్న ఆందోళనకు జిల్లా విద్యాశాఖ అధికారులు నిర్ణయం ద్వారా తెరపడింది. అత్యధికంగా ఖాళీలు ఉండడం, కొన్ని పాఠశాలల్లో ఒక్క ఉపాధ్యాయుడు కూడా లేకుండా ఉండడంతో తప్పనిసరి ఖాళీలను మాత్రమే ఉన్నతాధికారులు కౌన్సెలింగ్ సమయంలో చూపారు. దీంతో ఉపాధ్యాయులు కూడా అధికారికంగా చూపిన ఖాళీల్లో ఏదో ఒక పాఠశాలను ఎంపిక చేసుకున్నారు. దీంతో నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 45 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు(ఎస్జీటీలు), 139 మంది స్కూల్ అసిస్టెంట్ల (ఎస్‌ఏ) ఖాళీలు భర్తీ అవుతున్నాయి. అంటే నియోజకవర్గానికి కొత్తగా 184 మంది ఉపాధ్యాయులు వచ్చారు. వీరితోపాటు గురుకుల పాఠశాలలకు, ఆశ్రమ పాఠశాలలకు అదనంగా మరో 20 మంది వస్తున్నారు. అంటే నియోజకవర్గానికి 200 మందికి పైగా కొత్త ఉపాధ్యాయులు వచ్చారు. ఈ నియామకాలను బట్టి జిల్లాకు వచ్చిన ఉపాధ్యాయ పోస్టుల్లో మూడోవంతు పోస్టులను నియోజకవర్గానికి కేటాయించడం విశేషం. విద్యా వికాసానికి పునాదులు వేస్తూ ప్రభుత్వ విద్యకు పెద్దపీట వేసే దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వానికి ప్రజలు కృతజ్ఞతలు చెబుతున్నారు.
ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం
పి.ఆంజనేయులు, ఎంఈవో, ఎర్రగొండపాలెం
మారుమూల ప్రాంతాల్లో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయం. ఖాళీలు చూపడంలోనే అధికారుల నిర్ణయం ద్వారా ఎర్రగొండపాలెం వంటి పాఠశాలలకు నేడు అధికభాగం ఉపాధ్యాయులు వచ్చారు. మొత్తానికి ఇక్కడి సమస్య చాలావరకు పరిష్కారమైనట్టే.
నియోజకవర్గంలో భర్తీ అవుతున్న పోస్టులు
మండలం ఎస్జీటీలు ఎస్‌ఏలు
ఎర్రగొండపాలెం 13 35
పుల్లలచెరువు 12 30
దోర్నాల 11 20
పెద్దారవీడు 5 24
త్రిపురాంతకం 4 30