Share News

వైభవంగా పోలేరమ్మ నూతన విగ్రహ ప్రతిష్ఠ

ABN , Publish Date - Jun 09 , 2025 | 12:00 AM

మండలంలోని మున్నంవారిపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన దేవస్థానంలో పోలేరమ్మ నూతన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు.

వైభవంగా పోలేరమ్మ నూతన విగ్రహ ప్రతిష్ఠ

చినగంజాం, జూన్‌ 8(ఆంధ్రజ్యోతి) : మండలంలోని మున్నంవారిపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన దేవస్థానంలో పోలేరమ్మ నూతన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు. దేవస్థానం ప్రాంగణంలో విగ్రహ ప్రతిష్ఠ పూజ కార్యక్రమాలు ఈ నెల 6వ తేదీ నుండి నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం 5.30గంటల నుండి వేదపండితులు సకల దేవత ఆవాహిత పూజ, హోమాలు, రత్నాన్యాసం, ఽధాతున్యాసం, గత్తన్యాసం, యంత్రప్రతిష్ఠ, అమ్మవారి, పోతురాజు, కలశ ప్రతిష్ఠ కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం గోదర్శనం, మహాకుంభాభిషేకం, ప్రాణప్రతిష్ఠ, మహాపుర్ణాహుతి కార్యక్రమాలను దంపతులతో నిర్వహించారు. దేవస్థానంలో పోలేరమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్ఠ అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. అమ్మవారిని భక్తులు దర్శించుకొని విశేష పూజలు చేశారు. దేవస్థానం ప్రాంగణంలో భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ పోలేరమ్మ తల్లి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాల్లో పరిసర గ్రామాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

హోరాహోరీగా ఎడ్ల పందేలు

పోలేరమ్మ నూతన విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎడ్ల పందేలు హోరాహోరీగా సాగాయి. మున్నం రామాంజనేయులురెడ్డి జ్ఞాపకార్థం, గ్రామ టైర్లబండి కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి నాటుబండి పోల్‌రాధా బలప్రదర్శన పోటీలలో సత్తా చాటేందుకు హోరాహోరీగా తలపడ్డాయి. రాష్ట్రస్థాయిలో జరిగిన ఈ పోటీలో (జూనియర్‌ విభాగం) పోటీలకు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, పల్నాడు, కృష్ణా జిల్లాలకు చెందిన చెందిన 15 ఎడ్ల జతలు వచ్చినట్లు నిర్వహకులు తెలిపారు. ఈ పోటీలను మంగళగిరి సీఐడీ సీఐ కుక్కల రామకృష్ణారెడ్డి, సైబరాబాద్‌ రిజర్వు ఆర్‌ఐ మారుబోయిన నాగరాజురెడ్డిలు గ్రామ పెద్దలతో కలిసి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి పోటీలు నిర్వహించడం వలన ప్రజల మధ్య స్నేహ సంబందాలు పెంపొందుతాయని రామకృష్ణారెడ్డి అన్నారు. రామకృష్ణారెడ్డి, నాగరాజురెడ్డిలను గ్రామపెద్దలు, నిర్వాహకులు సన్మానించారు. పోటీల్లో సోపిరాల గ్రామానికి చెందిన చెరుకూరి భాస్కరరావు ఎడ్ల జత నిర్ణీత పది నిమిషాల వ్యవధిలో 2743 అడుగులు, ప్రకాశం జిల్లా రాజుపాలేనికి చెందిన పగడం బ్రహ్మరెడ్డి ఎడ్డ జత 2697 అడుగులు, మున్నంవారిపాలెం గ్రామానికి చెందిన మున్నం రామాంజనేయులురెడ్డి ఎడ్లజత 2139 అడుగులు, బాపట్ల జిల్లా అద్దేపల్లికి చెందిన డొక్కు సుబ్బారావు ఎడ్ల జత 2227 అడుగులు, బాపట్ల, దుర్వాజ్‌ కొత్తపాలెంకు చెందిన ఎంకే బుల్స్‌ ఎడ్ల జత 2074 అడుగుల దూరం లాగినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పేక్షకుల ఈలలు, కేరింతలతో గ్రామంలో తిరునాళ్ల వాతావరణం నెలకొంది. ఎడ్ల పోటీలను తిలకించేందుకు పరిసర గ్రామాలకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో హాజరైనారు. పోటీలలో విజేతలైన ఎడ్ల జతల యజమానులకు సోమవారం బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. గ్రామ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌, గ్రామ పెద్దలు, గ్రామస్థుల సహకారంతో పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామ ఎడ్లబండి కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో పోటీలను నిర్వహించారు.

Updated Date - Jun 09 , 2025 | 12:01 AM