Share News

వైసీపీలో కొత్త జిల్లా చిచ్చు

ABN , Publish Date - Dec 14 , 2025 | 01:46 AM

ఇచ్చిన హామీ మేరకు మార్కాపురం జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విపక్ష వైసీపీ నేతలు వేసిన ఎత్తుగడ వికటిస్తోంది. వారి మధ్య అంతర్గత కలహాలకు దారితీసింది.

వైసీపీలో కొత్త జిల్లా చిచ్చు

మాట నిలుపుకొన్న ప్రభుత్వం పట్ల ప్రజల్లో సానుకూలత

దర్శి పేరుతో దెబ్బకొట్టాలని వైసీపీ యత్నం

ఆ విషయంలో ఆపార్టీ నేతల మధ్య విభేదాలు

ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న అక్కడి ప్రజలు

ఇరకాటంలో ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి

ఇచ్చిన హామీ మేరకు మార్కాపురం జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విపక్ష వైసీపీ నేతలు వేసిన ఎత్తుగడ వికటిస్తోంది. వారి మధ్య అంతర్గత కలహాలకు దారితీసింది. ఒకవైపు మార్కాపురం జిల్లా ఏర్పాటుతోపాటు అద్దంకి, కందుకూరు నియోజకవర్గాలను ప్రకాశంలో కలిపే నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. ప్రజా ప్రభుత్వానికి జేజేలు పలుకుతున్నారు. అదేసమయంలో తమ వ్యూహం బెడిసికొట్టడంతో వైసీపీ నేతలు డీలా పడ్డారు. దర్శి నియోజకవర్గ అంశాన్ని సాకుగా తీసుకొని మార్కాపురం జిల్లా ఏర్పాటు విషయంలో ప్రభుత్వానికి సానుకూలత రాకుండా దెబ్బతీయాలనే వైసీపీ నేతల వ్యవహారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డిని ఇరకాటంలో పడేసింది. దీంతో కొత్త జిల్లా ఏర్పాటును స్వాగతించలేక, అలాగని వ్యతిరేకించలేక వైసీపీ నేతలు కకావికలమవుతున్నారు.

ఆంధ్రజ్యోతి, ఒంగోలు

గత వైసీపీ ప్రభుత్వంలో కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో మార్కాపురం కేంద్రంగా జిల్లా కావాలని ప్రజలు పెద్దఎత్తున నినదించారు. బాపట్లలో కలిపిన అద్దంకి, నెల్లూరులో కలిపిన కందుకూరు నియోజకవర్గాల ప్రజలు తమ నియో జకవర్గాలను ప్రకాశం జిల్లాలోనే ఉంచాలని ఉద్యమాలు చేశారు. అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు కానీ, నాయకులు కానీ ప్రజల డిమాండ్ల పట్ల సానుభూతి వ్యక్తం చేశారే తప్ప ఆపార్టీ అధినేత, అప్పటి ముఖ్యమంత్రి జగన్‌ వద్దకు వెళ్లి కనీసం చెప్పలేకపోయారు. బాపట్ల లోక్‌సభలోని ఎస్‌ఎన్‌పాడు నియోజకవర్గాన్ని ఒంగోలు లోక్‌సభ పరిధిలోని ప్రకాశంలో కలపగా తమ డిమాండ్లు ఎందుకు పట్టించుకోలేదంటూ ప్రజలు ఆక్రోశం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు చంద్రబాబునాయుడు, పవన్‌కల్యాణ్‌, నారా లోకేష్‌ మార్కాపురం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేస్తామని.. కందుకూరు, అద్దంకిని ప్రకాశం జిల్లాలో కలుపుతామని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఆ మేరకు ఇటీవల ప్రాథమిక నోటిఫికేషన్‌ కూడా జారీ అయింది. ఈనెల 28, 29 తేదీల్లో తుది నోటిఫికేషన్‌ వెల్లడికానుంది. దీంతో ప్రజల నుంచి ప్రభుత్వ నిర్ణయం పట్ల పూర్తిస్థాయి మద్దతు లభించింది.

లోపాల వెతుకులాటలో వైసీపీ నేతలు

జిల్లాల పునర్‌వ్యవస్థీకరణకు సంబంధించి ప్రజా ప్రభుత్వం తీసుకున్న నిర్ణ యం పట్ల ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతుండటాన్ని వైసీపీ నేతలు జీర్ణించు కోలేకపోయారు. ఏవైనా లోపాలు వెతికి పట్టుకొని మొత్తం వ్యవహారాన్ని వివా దాస్పదం చేయాలని భావించారు. ఆ మేరకు తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి కూడా ఆదేశాలు అందినట్లు సమాచారం. ఈ విషయంలో కందుకూరు, అద్దంకి నియో జకవర్గాల్లోని వైసీపీ నాయకులు ఎంత అన్వేషించినా ప్రశ్నించేందుకు చిన్నపాటి సమస్య కూడా దొరకలేదు. అద్దంకిని తిరిగి ప్రకాశంలో కలపడంతోపాటు అద్దంకి కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయడంతో ప్రజలు అటు ప్రభుత్వాన్ని, ఆ విషయంలో కీలకంగా వ్యవహరించిన మంత్రి రవికుమార్‌ను అభినందించడం ప్రారంభించారు. కందుకూరును కూడా ప్రకాశం జిల్లాలో కలపడంతోపాటు డివిజన్‌ కేంద్రంగా కొనసాగించాలనే నిర్ణయంతో అక్కడి వైసీపీ నాయకులు మాట్లాడేందుకు అవకాశం లభించలేదు. తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి ఎన్ని ఆదేశాలు అందినా స్థానికంగా ప్రజల నుంచి వచ్చే సానుకూలతను గుర్తించి ఆ రెండు నియోజకవర్గాల వైసీపీ నేతలు కిమ్మనకుండా ఉండిపోయారు.

అయోమయంలో పశ్చిమ నేతలు

మార్కాపురం జిల్లా ఏర్పాటును కాదనలేకపోతున్న పశ్చిమ ప్రాంత వైసీపీ నాయకులు దర్శి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలోనే కొనసాగించడాన్ని ప్రశ్నిస్తూ ఉద్యమించాలని భావించారు. దీనికితోడు శ్రీశైలంను కూడా మార్కాపురంలో కలపాలంటూ పోరాడాలన్న ప్రతిపాదన కూడా వచ్చింది. అదే ఆ పార్టీ నాయకుల మధ్య అంతర్గత విభేదాలను పెంచింది. శ్రీశైలం విషయంలో నంద్యాల జిల్లా నేతల నుంచి హెచ్చరి కలు వచ్చినట్లు కూడా తెలిసింది. ఈ నేపథ్యంలో దాన్ని పట్టించుకోకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అదేస మయంలో దర్శి విషయంలో మాత్రం ఇరకాటంలో పడ్డారు.

90శాతానికిపైగా ప్రజలు సానుకూలం

నిజానికి దర్శి నియోజకవర్గంలోని 90శాతానికిపైగా గ్రామాల వారు తమను ఒంగోలు కేంద్రంగా ఉన్న ప్రకాశం జిల్లాలో ఉంచాలని కోరుతున్నారు. అద్దంకి రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు, అందులో దర్శి నియోజకవర్గాన్ని కలపడాన్ని సానుకూల పరిణామంగా చూస్తున్నారు. సాగునీటి వనరులు, రవాణా సౌకర్యం, కొత్తగా ఏర్పడే అద్దంకి రెవెన్యూ డివిజన్‌ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రకాశం జిల్లాలోనే తమను కొనసాగించడం పట్ల దర్శి నియోజకవర్గ ప్రజల నుంచి పూర్తి సానుకూలత వ్యక్తమైంది. మండల కేంద్రమై దొనకొండకు పశ్చిమాన ఉన్న కొన్ని గ్రామాల వారే మార్కాపురం జిల్లాలో ఉంటే బాగుంటుందన్న అభిప్రాయంతో ఉన్నారు. దీంతో వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి కూడా సైలెంట్‌ అయ్యారు. మనం ఒంగోలు జిల్లాలోనే ఉండటం సమంజసం కదా అని ఆపార్టీ నియోజకవర్గ నాయకులు అంటే సానుకూలత వ్యక్తం చేశారే తప్ప ఇతరత్రా సమస్యలు ప్రస్తావించలేదని ఆపార్టీ నాయకులు చెప్తున్నారు.

ఉద్యమంపై రాని ఏకాభిప్రాయం

దొనకొండలోని కొన్ని గ్రామాల వారు తప్ప దర్శి నియోజకవర్గంలోని మిగిలిన ప్రాంతాల ప్రజలు తమను మార్కాపురం జిల్లాకు మార్చాలని ఇప్పటి వరకూ బహిరంగంగా కోరలేదు. దీంతో దర్శిని మార్కాపురం జిల్లాలో కలపాలన్న పేరుతో ఉద్యమించాలని వచ్చిన తాడేపల్లి ప్యాలెస్‌ ఆదేశాలను అమలు చేయడంలో వైసీపీ నేతల్లో ఏకాభిప్రాయం వ్యక్తం కాలేదు. ఆ పార్టీకి చెందిన వైపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్‌ శ్రీశైలంను మార్కాపురంలో కలపాలని ట్విట్టర్‌లో ప్రభుత్వాన్ని కోరారు. కానీ దర్శి విషయాన్ని ప్రస్తావించలేదు. మార్కాపురం నుంచి గత ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఇటీవల మార్కాపురంలో జిల్లా సాధన కోసం ఉద్యమించిన తటస్థవాదులకు దర్శిని మార్కాపురం జిల్లాలోనే కలపాలన్న డిమాండ్‌తో ఉద్యమించాలని సూచించినట్లు తెలిసింది. గతంలో మార్కాపురం ఎమ్మెల్యేగా పనిచేసి గత ఎన్నికల్లో గిద్దలూరు నుంచి పోటీచేసి ఓడిన నాగార్జునరెడ్డి కానీ, కనిగిరి నియోజకవర్గ వైసీపీ నేతలు కానీ ఈ విషయంలో నేటి వరకూ బహిరంగంగా స్పందించలేదు. అయితే వారంతా దర్శిని మార్కాపురంలో కలపాలన్న డిమాండ్‌తో ఉద్యమించాలంటూ కులసంఘాలు, ప్రజాసంఘాల వారిని రెచ్చగొట్టే ప్రయత్నం ముమ్మరంగా చేస్తున్నారు. వారు అలా వ్యవహరించడానికి ఆ పార్టీ జిల్లా అద్యక్షుడిగా ఉన్న దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి వైఖరి కారణంగా చెబుతున్నారు.

ఇరకాటంలో బూచేపల్లి

నియోజకవర్గంలో మెజారిటీ ప్రజల అభిప్రాయాన్ని వ్యతిరేకించలేక, పార్టీ అధిష్ఠానం సూచన, ఇతర నియోజకవర్గాల నాయకుల డిమాండ్‌లకు మద్దతు చెప్పలేక బూచేపల్లి ఇరకాటంలో ఉన్నట్లు తెలిసింది. ఈనేపథ్యంలో మార్కాపురం మాజీ ఎమ్మెల్యే గత ప్రభుత్వంలో ఏపీఐఐసీ చైర్మన్‌గా పనిచేసిన జంకె వెంకటరెడ్డి జిల్లా, స్థానిక వైసీపీ నాయకులతో సంబంధం లేకుండా నేరుగా జిల్లా అధికారులను కలిసి దర్శి నియోజకవర్గాన్ని మార్కాపురంలో కలపాలని కోరుతూ వినతిపత్రం అందించారు. అందుకోసం వైసీపీ నాయకుడిగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతానని ప్రకటించారు. ఎలాగైనా ప్రభుత్వానికి వచ్చిన సానుకూలతను దెబ్బతీయాలని చూస్తున్న వైసీపీ అధిష్ఠానం ఆపార్టీలోని స్థానిక నేతల మధ్య ఉన్న అభిప్రాయభేదాలను పరిగణనలోకి తీసుకుంటుందా? లేక ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా వైసీపీ నాయకులను ఉద్యమించాలని రెచ్చగొడుతుందా? అనేది వేచిచూడాల్సిందే.

Updated Date - Dec 14 , 2025 | 01:46 AM