నేడు కొత్త కలెక్టర్ బాధ్యతల స్వీకరణ
ABN , Publish Date - Sep 13 , 2025 | 01:20 AM
జిల్లాకు 39వ కలెక్టర్‌గా నియమితులైన రాజాబాబు శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీగా పనిచేస్తున్న ఆయన్ను ఇక్కడ కలెక్టర్‌గా నియమిస్తూ గురువారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
స్థానిక పరిస్థితులకు అనుగుణంగా ప్రాధాన్యతలు ఉంటాయని వెల్లడి
15, 16 తేదీల్లో కలెక్టర్ల సదస్సుకు హాజరు
ఒంగోలు, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి) : జిల్లాకు 39వ కలెక్టర్‌గా నియమితులైన రాజాబాబు శనివారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సెక్రటరీగా పనిచేస్తున్న ఆయన్ను ఇక్కడ కలెక్టర్‌గా నియమిస్తూ గురువారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మొత్తం 12 జిల్లాలకు కలెక్టర్ల నియామకం చేసిన ప్రభుత్వం ఈ నెల 15, 16తేదీల్లో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహిస్తున్న నేపథ్యంలో తక్షణం విధుల్లో చేరాలని ఆదేశించింది. దీంతో జిల్లాకు కలెక్టర్‌గా నియమితులైన రాజాబాబు శనివారం ఉదయం 11 గంటలకు ఒంగోలు ప్రకాశం భవనంలోని చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతరం జిల్లాలోని ముఖ్య అధికారులతో ఈనెల 15, 16 తేదీల్లో ప్రభుత్వం నిర్వహించనున్న రాష్ట్రస్థాయి కలెక్టర్ల సదస్సు అజెండా అంశాలపై సమీక్ష చేయనున్నట్లు సమాచారం. ఇదిలాఉండగా విధి నిర్వహణలో తన ప్రాధాన్యతలు ఉంటాయని రాజాబాబు చెప్పారు. ఇక్కడి ‘ఆంధ్రజ్యోతి’తో శుక్రవారం ఆయన ఫోన్‌లో మాట్లాడారు. రాష్ట్రప్రభుత్వ సర్వీసులో వివిధ హోదాల్లో పనిచేసిన తనకు జిల్లా గురించి కూడా కొంత అవగాహన ఉందన్నారు. బాధ్యతలు స్వీకరించాక అక్కడి పరిస్థితులు, ప్రజల అవసరాలు పరిశీలించి ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా దృష్టి సారిస్తామన్నారు. ప్రజల నుంచి వచ్చే వినతుల పరిష్కారానికి అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. ప్రభుత్వ పథకాలు సంబంధిత వర్గాలకు పారదర్శకంగా, త్వరితగతిన అందేలా చర్యలు తీసుకుంటానని ఆయన చెప్పారు. ప్రభుత్వ ఆలోచనలు, లక్ష్యాలకు అనుగుణంగా ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యంతో పనిచేస్తానన్నారు. ఇక్కడి నుంచి గుంటూరు జిల్లాకు బదిలీ అయిన కలెక్టర్ తమీమ్ అన్సారియా కూడా శనివారం అక్కడ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.