స్త్రీ శక్తితో బస్టాండ్‌లకు కొత్త శోభ
ABN , Publish Date - Aug 12 , 2025 | 02:44 AM
మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకం (స్త్రీ శక్తి) ఈనెల 15న ప్రారంభం కానుంది. ఈమేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవోను జారీచేసింది. ఇప్పటికే జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్‌లు కొత్తశోభను సంతరించుకుం టున్నాయి. స్త్రీ శక్తి కోసం ప్రకాశం రీజియన్ నుంచి 316 బస్సులను సిద్ధం చేశారు.
పాడుబడిన వాటికి మరమ్మతులు.. రంగులు
ఫ్యాన్‌లు, తాగునీరు, సోఫాసెట్లు, మరుగుదొడ్లు ఏర్పాటు
మహిళల రక్షణ కోసం కండక్టర్లకు బాడీ కెమెరాలు
ఒంగోలు, కార్పొరేషన్, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి) : మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకం (స్త్రీ శక్తి) ఈనెల 15న ప్రారంభం కానుంది. ఈమేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవోను జారీచేసింది. ఇప్పటికే జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్‌లు కొత్తశోభను సంతరించుకుం టున్నాయి. స్త్రీ శక్తి కోసం ప్రకాశం రీజియన్ నుంచి 316 బస్సులను సిద్ధం చేశారు. వాటిలో పల్లె వెలుగులు 246, ఆల్ర్టా పల్లె వెలుగు 4, ఎక్స్‌ప్రెస్‌లు 74 ఉన్నాయి. వీటితోపాటు ఐదు ప్రధాన డిపోలు, 20 సాధారణ డిపోలలో అవసరమైన మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నారు. ప్రయాణికుల కోసం ఫ్యాన్లు, మరుగుదొడ్లు, వేచి ఉండేందుకు సీట్లు ఏర్పాటు చేస్తున్నారు. తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నారు. దీంతో నిన్నమొన్నటి వరకు కనీస ఆదరణకు నోచు కోని పలు ఆర్టీసీ బస్టాండ్‌లు ఇప్పుడు కళకళలాడుతున్నాయి. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం పుణ్యమా అని అవి బాగుపడుతున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవమైన ఆగస్టు 15న స్త్రీశక్తి పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనుండగా, ప్రయాణ విషయంలో మహిళలకు అన్ని సౌకర్యాలు ఉండేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది.ఆర్‌ఎం సత్యనారాయణ ఆదేశాలతో ఆయా డిపోల మేనేజర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ప్రయాణ సమయంలో మహిళలకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని అన్ని డిపోలలో ప్లాట్‌ఫాంలు బాగుచేయిస్తున్నారు. విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తున్నారు. మరుగుదొడ్లు శుభ్రత, ఆర్టీసీ ప్రాంగణంలో పారిశుధ్యం మెరుగు, మంచినీటి వసతులు అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
మహిళ భద్రతకు బాడీ కెమెరాలు
మహిళలు ఎక్కువ సంఖ్యలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. వారి భద్రత, ఇతర ఇబ్బందులు తలెత్తకుండా ప్రతి మహిళా కండక్టర్ కచ్చితంగా బాడీ కెమెరాలు పెట్టుకోవాలని ఆదేశించింది. ఆ కెమెరాలను ఆయా డిపోలలో ఏర్పాటు చేసే కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేయనున్నారు. దీని ద్వారా మహిళలకు రక్షణ, భద్రతతోపాటు, సురక్షితమైన ప్రయాణ సౌకర్యం అందించవచ్చని ప్రభుత్వం భావిస్తుంది.
విధివిధానాలు ఇవీ..
జిల్లాలో సుమారు 60 శాతం మంది మహిళలకు స్త్రీశక్తి పథకం వర్తించనుంది. అయితే ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని పల్లె వెలుగు, ఆలా్ట్ర పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, మెట్రోఎక్స్‌ప్రెస్‌లలో అందుబాటులోకి తీసుకు వస్తోంది. ఈ ఐదురకాల బస్సుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసిన ఆధార్, ఓటర్, రేషన్ కార్డుల్లో ఏదైనా చూపించి ప్రయాణించవచ్చు. అలాగే పాఠశాలలో, కాలేజీలో చదువుకునే విద్యార్థినులకు ఇకపై బస్‌పాస్ అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. సూపర్ లగ్జరీ, ఏసీ, గరుడ, అమరావతి వంటి ప్రీమియం బస్సులకు ఈ పథకం వర్తించదు. దీంతోపాటుగా ఇతర రాష్ట్రాల సర్వీసులలో కూడా ఉచిత ప్రయాణం వర్తించదని ఆర్టీసీ అధికారులు వెల్లడిస్తున్నారు.