నల్లమలలో నెట్‌వర్క్
ABN , Publish Date - Aug 11 , 2025 | 01:54 AM
నల్లమల అటవీ ప్రాంత ప్రజలకు ముఖ్యంగా గిరిజన గూడెంలలో చెంచులు నివాసముండే ప్రాంతాలకు వెళితే బాహ్య ప్రపంచంతో సంబంధాలు ఉండవు. మారిన పరిస్థితులకు తగ్గట్టు టెక్నాలజీ ఎంత అందుబాటులోకి వచ్చినా వారికి మాత్రం అవన్నీ దూరమే అని చెప్పొచ్చు. కారణం అటవీ ప్రాంతం కావడం. మరీ ముఖ్యంగా నల్లమల అభయారణ్యం (టైగర్ రిజర్వ్ జోన్) కావడమే.
గిరిజన గూడేల వద్ద సెల్ టవర్లు
నాలుగు చోట్ల నిర్మాణం
త్వరలోనే పూర్తయ్యేలా చర్యలు
త్రిపురాంతకం, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి) : నల్లమల అటవీ ప్రాంత ప్రజలకు ముఖ్యంగా గిరిజన గూడెంలలో చెంచులు నివాసముండే ప్రాంతాలకు వెళితే బాహ్య ప్రపంచంతో సంబంధాలు ఉండవు. మారిన పరిస్థితులకు తగ్గట్టు టెక్నాలజీ ఎంత అందుబాటులోకి వచ్చినా వారికి మాత్రం అవన్నీ దూరమే అని చెప్పొచ్చు. కారణం అటవీ ప్రాంతం కావడం. మరీ ముఖ్యంగా నల్లమల అభయారణ్యం (టైగర్ రిజర్వ్ జోన్) కావడమే. అలాంటి చోట సాంకేతికత వినియోగానికి ఎన్నో ఏళ్లుగా వాళ్లు చేస్తున్న ప్రయత్నానికి ప్రస్తుతం ఫలితం దక్కింది. దీంతో నల్లమలలో కూడా సెల్‌ఫోన్ సిగ్నల్స్ రాబోతున్నాయి. ప్రభుత్వం ఎర్రగొండపాలెం, పుల్లలచెరువు, దోర్నాల మండలాల్లోని నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న నాలుగు గిరిజన గూడేల్లో సెల్ టవర్ల నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందులో ఎర్రగొండపాలెం మండలంలోని బిళ్లగొందిపెంట, పుల్లలచెరువు మండలంలోని గారపెంట, చెన్నపాలెం, దోర్నాల మండలంలోని పెద్దమంతనాల చెంచుగూడేలు ఉన్నాయి. ఇందులో గారపెంటగూడెంలో ఎయిర్‌టెల్ కంపెనీ టవర్ నిర్మిస్తుండగా, మిగిలిన మూడుచోట్ల బీఎ్‌సఎన్‌ఎల్ టవర్ల నిర్మాణం జరుగుతున్నాయి. ఇందుకోసం మంజూరు ఉత్తర్వులు 2024 డిసెంబరులోనే వచ్చాయి. వెంటనే కలెక్టర్ తమీమ్ అన్సారియా అటవీ శాఖ అధికారులతో సమావేశమై ఆశాఖాపరంగా అడ్డంకులు తొలగి నిర్మాణాలకు అవసరమైన క్లియరెన్స్‌లు ఇచ్చేలా చర్యలు చేపట్టారు. నల్లమల అటవీ ప్రాంతంలో ఈ పనులను ఆర్‌వోఎ్‌ఫఆర్ చట్టానికి లోబడి చేయాల్సి ఉంది. దీంతో పాటు వైల్డ్‌లైఫ్ ఏరియా ఉన్నచోట అదనంగా పలు అనుమతులు తీసుకోవాల్సి ఉండడంతో పనుల్లో కాస్త జాప్యం కనిపించింది. ఇప్పుడిప్పుడే బీఎ్‌సఎన్‌ఎల్ అధికారుల చొరవతో పనుల్లో వేగం పుంజుకుంది. బిళ్లగొందిపెంట, పెద్దమంతనాల గూడేలు వైల్డ్‌లైఫ్ పరిధిలో ఉండడంతో ఉన్న అవాంతరాలు అధిగమించేందుకు స్థలం కోసం అటవీశాఖకు చెల్లించాల్సిన డబ్బు కూడా చెల్లించారు. ఇప్పటికే సైట్ క్లియరెన్స్ తీసుకున్నారు. టవర్ నిర్మాణానికి తీసుకున్న స్థలాల్లో హద్దులను కూడా ఏర్పాటు చేసుకున్నారు. స్టేజ్-1 ప్రక్రియ పూర్తి చేసుకున్న ఈ రెండు టవర్ల నిర్మాణ పనులు త్వరలోనే పూర్తి చేస్తామని అధికారులు చెప్తున్నారు. ఇక చెన్నపాలెం గూడెంలో స్టేజ్-1 ప్రక్రియ పూర్తి కాలేదని, స్థల సేకరణ జరిగిన తరువాత పనులు ప్రారంభించాల్సి ఉందంటున్నారు. గార్లపెంట గిరిజన గూడెంలో ఎయిర్‌టెల్ సెల్ టవర్ నిర్మాణం కూడా త్వరలోనే ప్రారంభం కానుంది. ఇలా కొద్దిరోజుల్లో నల్లమల గిరిజన గూడేలలో కూడా సెల్‌సిగ్నల్స్ అందుబాటులోకి రానుండటంతో గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇక వెంటనే సమాచారం
గతంలో నల్లమల అటవీ ప్రాంతంలోని గ్రామాల్లో ఏదైనా ఘటన జరిగితే అక్కడ నుంచి ఎవరైనా వచ్చి చెబితేనే తెలిసే పరిస్థితి. అధికారుల పర్యటల్లో కానీ, చివరకు ఎన్నికల సమయంలో కూడా అధికారులు ఆ ప్రాంతం నుంచి సమాచారం సేకరించుకునేందుకు అష్టకష్టాలు పడేవారు. ఇప్పటికీ పలు గూడేలలో సెల్ సిగ్నల్స్ వచ్చే ప్రాంతాలకు కొందరు యువకులు వచ్చి గుట్టలు, కొండలు ఎక్కి ఫోన్‌లు మాట్లాడుకున్న తరువాత ఇళ్లకు వెళుతున్నారు. ఇక ఈ టవర్ల నిర్మాణం జరిగితే సమాచార కష్టాలు తొలగిపోయినట్టేనని నల్లమలలో కూడా నెట్‌వర్స్ రాబోతుందని ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.