అద్దెల వసూళ్లలో నిర్లక్ష్యం
ABN , Publish Date - Oct 09 , 2025 | 01:26 AM
‘మునిసిపాలిటీలు స్వయం సమృద్ధి సాధించాలి. ఎక్కడికక్కడ ఆదాయ వనరులను మెరుగుపర్చు కోవాలి. ఆయా మునిసిపాలిటీల అభివృద్ధికి నిధు లు సమీకరించుకోవాలి.’ ఇవీ పురపాలకశాఖ ఉన్నతాధికారులు పలు సమీక్షల్లో ఇస్తున్న ఆదే శాలు. కానీ మార్కాపురం మునిసిపాలిటీలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది.
భారీగా బకాయిలు
గడువు దాటిన దుకాణాలకు వేలం నిర్వహించని వైనం
పాత యజమానుల నుంచి అనధికార వసూళ్లు
మార్కాపురం మునిసిపల్ అధికారుల తీరుపై అనుమానాలు
మార్కాపురం, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): ‘మునిసిపాలిటీలు స్వయం సమృద్ధి సాధించాలి. ఎక్కడికక్కడ ఆదాయ వనరులను మెరుగుపర్చు కోవాలి. ఆయా మునిసిపాలిటీల అభివృద్ధికి నిధు లు సమీకరించుకోవాలి.’ ఇవీ పురపాలకశాఖ ఉన్నతాధికారులు పలు సమీక్షల్లో ఇస్తున్న ఆదే శాలు. కానీ మార్కాపురం మునిసిపాలిటీలో మాత్రం పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. బకాయిల వసూళ్ల విషయంలో మునిసిపల్ రెవెన్యూ విభాగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. రూ.లక్షల్లో రావాల్సి ఉన్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు పనిచేస్తున్నారు. ఇప్పటికే గడువు తీరి పోయిన కొన్ని అద్దె దుకాణాల విషయంలో ఆ విభాగం అధికారులు, సిబ్బంది కొందరు చేతివా టం చూపుతున్నట్లు తెలుస్తోంది. కొన్ని దుకాణా లకు వేలం నిర్వహించకుండా అనధికారిక వసూ ళ్లకు పాల్పడుతున్నట్లు విమర్శలు ఉన్నాయి.
పేరుకుపోయిన బకాయిలు
మార్కాపురం పురపాలక సంఘంలో మొత్తం 47 అద్దె దుకాణాలు ఉన్నాయి. వాటికి వేలం పాట నిర్వహించి అద్దెలు నిర్ణయించారు. వీటి ద్వారా మునిసిపాలిటీకి ప్రతి సంవత్సరం రూ.48.35 లక్షల మేర ఆదాయం రావాలి. కానీ ప్రతి సంవత్సరం బకాయిలు పేరుకుపోతున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే సమయానికి రూ.13 లక్షల మేర బకాయిలు దుకాణదారుల నుంచి రావాల్సి ఉంది. సుమారు ఆరు నెలలు కావస్తున్నా వాటిలో 50శాతానికి మంచి వసూలు చేయలేదు. ప్రస్తుతానికి బకాయిలకు సంబంధించి రూ.6 లక్షలు ఇంకా వసూలు చేయాల్సి ఉంది. బకాయిలు, ప్రస్తుత డిమాండ్ మొత్తం కలిపి రూ.61.14 లక్షలు వసూలు చేయాల్సి ఉన్నా 40 శాతం మేర మాత్రమే లక్ష్యాన్ని చేరుకోగలిగారు. దుకాణాలకు సంబంధించి అద్దెలను ఎప్పటికప్పుడు ఏ నెలకు ఆనెల వసూలు చేయాలి. మొత్తం 47 దుకాణాల్లో మునిసిపాలిటీ కార్యాలయం చుట్టే 40 వరకు ఉన్నాయి. రెవెన్యూ విభాగంలో తగినంత మంది సిబ్బంది ఉన్నా నెలనెలా అద్దెలు వసూలు కావడం లేదు. ఆర్థిక సంవత్సరం చివర్లో హడావుడి చేసి మమ అన్పిస్తున్నారు.
గడువు దాటిన దుకాణాలకు వేలం ఎప్పుడు..?
మునిసిపాలిటీ పరిధిలోని 47 దుకాణాల్లో ఈ మధ్యనే తొమ్మిదింటికి గడువు దాటింది. వాటికి బహిరంగ వేలం నిర్వహించి కేటాయించాల్సి ఉంది. కానీ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. కొందరు సిబ్బంది పాత యజమానుల నుంచి అనధికార వసూళ్లకు పాల్పడుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. వాటికి వేలం నిర్వహించకుంటే చేతివాటం చూపుకునేందుకు అవకాశం ఉంటుంది కాబట్టే ఈ విధంగా వ్యవహరిస్తున్నారని నెలనెలా అద్దెలు చెల్లించే దుకాణ యజమానులు చర్చించుకుంటున్నారు. అంతేకాక కొందరు తాము అధికారపార్టీకి చెందిన వాళ్లము కాబట్టి మా ఇష్టం వచ్చినప్పుడు ఇస్తామని అద్దెలు చెల్లించకుండా తప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. మరికొందరు వేలంలో దుకాణాలు దక్కించుకుని సబ్ లీజుకు ఇచ్చుకుని నెలనెలా అద్దెలు తీసుకుంటున్నా మునిసిపాలిటీకి మాత్రం సక్రమంగా చెల్లించడం లేనట్లు సమాచారం. అద్దెల వసూళ్లపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తేనే బకాయిలు తగ్గే అవకాశం ఉంది.