అవసరం ఇక్కడ.. ఆఫీసు అక్కడ!
ABN , Publish Date - Nov 05 , 2025 | 11:06 PM
: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచి శ్రీశైలంలో కొనసాగుతున్న సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) ప్రాజెక్ట్ కార్యాలయాన్ని దోర్నాలలో ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన బలంగా వినిపిస్తోంది. చెంచులు అధికంగా ఉన్న ప్రకాశం, గుంటూరు జిల్లా ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించేలా సౌకర్యవంతంగా ఉంటుందనే ప్రతిపాదన ఇప్పుడు తాజాగా కొత్తగా ఏర్పడే మార్కాపురం జిల్లా నేపథ్యంలో తెరమీదికి వచ్చింది
ఉమ్మడి రాష్ట్రం నుంచి శ్రీశైలంలోనే ఐటీడీఏ ప్రాజెక్ట్
ప్రకాశం, గుంటూరు జిల్లాల పరిధిలోనే అధికంగా చెంచులు
అందుబాటులో ఉండేలా చూడాలంటున్న గిరిజనులు
కొత్త జిల్లాల ప్రతిపాదన నేపథ్యంలో దోర్నాలలో ఏర్పాటుకు వినతి
మంత్రుల కమిటీ ముందుకు ప్రతిపాదన
త్రిపురాంతకం, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచి శ్రీశైలంలో కొనసాగుతున్న సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ(ఐటీడీఏ) ప్రాజెక్ట్ కార్యాలయాన్ని దోర్నాలలో ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన బలంగా వినిపిస్తోంది. చెంచులు అధికంగా ఉన్న ప్రకాశం, గుంటూరు జిల్లా ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించేలా సౌకర్యవంతంగా ఉంటుందనే ప్రతిపాదన ఇప్పుడు తాజాగా కొత్తగా ఏర్పడే మార్కాపురం జిల్లా నేపథ్యంలో తెరమీదికి వచ్చింది. ఇదే విషయాన్ని జిల్లా ఏర్పాటు కోసం ఏర్పాటైన మంత్రుల కమిటీ దృష్టికి కూడా తీసుకెళుతున్నట్లు స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు తెలియజేస్తున్నారు.
గిరిజన తెగలో ఒకటైన చెంచు కుటుంబాల అభివృద్ధి కోసం 1970లో ఏర్పాటైన ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవల్‌పమెంట్ ఏజెన్సీ(ఐటీడీఏ) ప్రధాన కార్యాలయం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శ్రీశైలంలో ఏర్పాటైంది. ఈ ప్రాజెక్ట్ పరిధిలో నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాలు ఉండేవి. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలోని ఉమ్మడి మూడు జిల్లాలు నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ విడిపోగా ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు సంబంధించి అప్పుడు శ్రీశైలంలోని ఐటీడీఏ కార్యాలయంలో కొనసాగుతోంది. ఐటీడీఏ ద్వారా చెంచుల కోసం పలు కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. ప్రత్యేక బడ్జెట్‌ను వారికోసం రూపొందించి అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోంది. ముఖ్యంగా చెంచు గిరిజనుల విద్య, వైద్యం, ఉపాధి కోసం ప్రత్యేకంగా ఈ ప్రాజెక్ట్ ద్వారానే పనులు చేపడతారు. అటువంటి ప్రాజెక్ట్ శ్రీశైలంలో ఉండడం వల్ల ప్రకాశం, గుంటూరు జిల్లా గిరిజనులు ఏదైనా అవసరాల నిమిత్తం లేదా గ్రీవెన్స్ కోసం కార్యాలయానికి వెళ్లాలంటే చాలా దూరంతోపాటు వ్యయంతో ఇబ్బందులు పడుతున్నారు.
మర్కాపురం జిల్లాతో మళ్లీ తెరపైకి...
ప్రస్తుతం ప్రభుత్వం కొత్త జిల్లాల ప్రతిపాదన తీసుకురావడం, అందులో మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించడంతో మళ్లీ ఐటీడీఏ కార్యాలయ మార్పు అంశం తెరమీదికి వచ్చింది. గిరిజనులు అధికంగా ఉన్న ప్రకాశం, గుంటూరు జిల్లాల వారికి అందుబాటులో ఉండేలా దోర్నాల కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఇదే విషయాన్ని ప్రజాప్రతినిధులు కూడా ఇటీవల జిల్లా ఏర్పాటు కోసం ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు తెలిసింది. గతంలోనే ఈ ప్రతిపాదన రావడంతో ఇక్కడి గిరిజనుల నుంచి గ్రీవెన్స్ తీసుకునేందుకు దోర్నాలలోని వెలిగొండ గెస్ట్‌హౌ్‌సలో ఒక గదిని అందుకోసం తాత్కాలిక కార్యాలయంగా వినియోగించుకుంటున్నారు. ఇప్పుడు మార్కాపురం జిల్లా కానున్న క్రమంలో ఐటీడీఏ కార్యాలయాన్ని దోర్నాలలో ఏర్పాటు చేయాలని అందరూ బలంగా కోరుకుంటున్నారు.
రాష్ట్రంలోని చెంచు కుటుంబాల్లో 59శాతం ఇక్కడే
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని గిరిజన కుటుంబాలు కొద్దిగానే ఉండగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మొత్తం చెంచు కుటుంబాల్లో 59శాతం కుటుంబాలు ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోనే ఉన్నాయని అధికారిక లెక్కలు చెప్తున్నాయి. అందులో కూడా ప్రకాశం జిల్లాలోనే అధికం. ముఖ్యంగా నల్లమల పరిధిలో గూడేలన్నీ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో మరీ ముఖ్యంగా ఎర్రగొండపాలెం, దోర్నాల, పుల్లలచెరువు మండలాల పరిధిలోనే ఉన్నాయి. మరికొన్ని మార్కాపురం, గిద్దలూరు నియోజకవర్గాల్లో ఉన్నాయి. అంటే మొత్తంగా పశ్చిమ ప్రకాశంలోనే అత్యధికంగా చెంచు కుటుంబాలు నివాసముంటున్నాయి. వారి అభివృద్ధి కోసం ఉన్న ఐటీడీఏ కార్యాలయం మాత్రం శ్రీశైలంలో కొనసాగడం ద్వారా గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారని వారి ప్రతినిధులు ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్తూనే ఉన్నారు. రాష్ట్ర విభజన తరువాతైనా మారుస్తారని భావించినా అది జరగలేదని నిరాశతో ఉన్నారు.
కమిటీ దృష్టికి తీసుకెళతా
ఎరిక్షన్‌బాబు, టీడీపీ వైపాలెం ఇన్‌చార్జి
ఐటీడీఏ కార్యాలయ ఏర్పాటు విషయాన్ని చెంచు గిరిజన నాయకులు నా దృష్టికి తీసుకొచ్చారు. చెంచులు అధికంగా ఉన్న ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో అందుబాటులో ఉండేలా దోర్నాలలో ఏర్పాటు చేయడం సరియైునదే. మార్కాపురం జిల్లా ఏర్పాటుకు సరిహద్దులు, ఇతర అంశాలపై అధ్యయనం చేయడానికి నియమించబడిన మంత్రుల కమిటీ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లి పరిశీలించాలని కోరతా.