దీనస్థితిలో ముసి ఆయకట్టు
ABN , Publish Date - Oct 06 , 2025 | 11:11 PM
అన్నదాతల అమాయకత్వం.. అధికారుల నిర్లక్ష్యం.. ప్రజాప్రతినిధుల ఉదాసీన వైఖరితో ఆరు గ్రామాల ప్రజలకు, 1200 ఎకరాలకు శాపంగా మారింది. పుష్కలంగా నీటిని అందాల్సిన సాగునీటి పథకం ప్రస్తుతం నిరుపయోగంగా మారింది. రైతులకు ఎంతో ప్రయోజనం చేకూర్చాల్సిన మూసి ఆయకట్టు ప్రస్తుతం ఇసుక మేటలతో పూడిపోయి ఉంది.
ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోని పథకం
1200 ఎకరాలకు సాగునీటి సరఫరా లక్ష్యం
ఆరు గ్రామాల ప్రజలకు ప్రయోజనం
పొదిలి, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి) : అన్నదాతల అమాయకత్వం.. అధికారుల నిర్లక్ష్యం.. ప్రజాప్రతినిధుల ఉదాసీన వైఖరితో ఆరు గ్రామాల ప్రజలకు, 1200 ఎకరాలకు శాపంగా మారింది. పుష్కలంగా నీటిని అందాల్సిన సాగునీటి పథకం ప్రస్తుతం నిరుపయోగంగా మారింది. రైతులకు ఎంతో ప్రయోజనం చేకూర్చాల్సిన మూసి ఆయకట్టు ప్రస్తుతం ఇసుక మేటలతో పూడిపోయి ఉంది. దీంతో ఈ పథకం ఆయకట్టు భూముల సాగు ప్రశ్నార్థకంగా మారింది. మండంలోని తలమళ్ల గ్రామానికి ఉత్తరం వైపున ఉన్న ముసి సమీపంలో సుమారు 30 ఏళ్లకుపైగా రూ.1.2కోట్ల నాబార్డు నిధులతో ఆయకట్టను నిర్మించారు. 13 కిలోమీటర్ల దూరం ప్రధానకాలువను ఏర్పాటు చేశారు. అప్పట్లో పూర్తి స్థాయిలో పనులు చేపట్టకపోవడంతో పథక లక్ష్యం నీరుగారిపోయింది. మండలంలోని తలమళ్ల, గోగినేనిపాలెం, ఉప్పలపాడు, ఏలూరు, సల్లూరు, నల్లపురెడ్డిపాలెం, మర్రిపూడి మండలాల్లోని గ్రామాలకు చెందిన 1200 ఎకరాలకు సాగునీరు అందించాలన్నదే పథక ఉద్దే శం. ఆయకట్టు కాలక్రమేణా ఇసుక మేటలు వేయడంతో సాగునీటి సరఫరాకు వీలు లేకుండా పో యింది. మరమ్మతులకు కూడా నోచుకోక మూలనపడింది. అక్కడి మోటార్లు కూడా తుప్పుపట్టిపోయా యి. ప్రభుత్వాలు మారుతున్నా, పాలకులు మారుతున్నా ఆ పథకాన్ని వినియోగంలోకి తేవాలన్న ఆలోచనే చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం నివేదికలు తయారు చేయాలన్న ఆదేశాలు తప్ప పనులు జరిగిన పాపాన పోలేదని ప్రజలు విమర్శిస్తున్నారు. వెంటనే నాయకులు, అధికారులు ఆయకట్టును పరిశీలించి పథకాన్ని వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు, రైతులు కోరుతున్నారు.