హత్య కేసులో నిందితుడిపై బస్టాండ్‌లో దాడి
ABN , Publish Date - Aug 11 , 2025 | 11:34 PM
హత్య కేసులో నిందితుడు కోర్టులో వాయిదాకు హాజరై తిరిగి వెళ్తుండగా ప్రత్యర్థులు కంట్లో కారంచల్లి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన సోమవారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద చోటుచేసుకుంది.
మార్కాపురం కోర్టులో విచారణకు హాజరు
తిరిగి కడప జిల్లా వెళ్లేందుకు బస్ ఎక్కగా ఘటన
కంట్లో కారం చల్లి ఇనుపరాడ్‌తో దాడికి యత్నం
ప్రత్యర్థిని అడ్డుకున్న తోటి ప్రయాణికులు
మార్కాపురం, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి) : హత్య కేసులో నిందితుడు కోర్టులో వాయిదాకు హాజరై తిరిగి వెళ్తుండగా ప్రత్యర్థులు కంట్లో కారంచల్లి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన సోమవారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద చోటుచేసుకుంది. టౌన్ ఎస్సై ఎం.సైదుబాబు కథనం మేరకు.. ముండ్లమూరు మండలం ఈదర గ్రామానికి చెందిన బండి బాపిరెడ్డికి అదే గ్రామంలో ప్రత్యర్థి వర్గంతో 1997లో బాంబులు వేసుకున్న కేసు ఉంది. ఈ కేసులో బాపిరెడ్డి వర్గానికి వ్యతిరేకంగా కిష్టిపాటి వెంగళరెడ్డి సాక్ష్యం చెప్పారు. ఈ విషయాన్ని మనసులో పెట్టుకున్న బాపిరెడ్డి వర్గం 2018లో వెంగళరెడ్డి కుటుంబంపై హత్యాయత్నానికి పాల్పడింది. ఈ క్రమంలో వెంగళరెడ్డి ప్రాణాపాయం నుంచి బయటపడినా అతని కుమారుడు మృతి చెందాడు. కుమారుడు మృతి చెందిన కేసు అప్పటి నుంచి మార్కాపురం ఆరో అదనపు జిల్లా కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ హత్య కేసులో వాయిదా నిమిత్తం సోమవారం మార్కాపురం ఆరో అదనపు జిల్లా కోర్టుకు నిందితుడు బాపిరెడ్డి హాజరయ్యాడు. తిరిగి ప్రస్తుతం అతను నివాసముంటున్న కడప జిల్లా బి.మఠం గ్రామానికి వెళ్లేందుకు మార్కాపురం బస్టాండ్‌కు చేరుకున్నాడు. అక్కడ కడప బస్సు ఎక్కాక ఈదర గ్రామానికి చెందిన ప్రత్యర్థి కిష్టిపాటి వెంగళరెడ్డి అదే బస్సులో ఎక్కి బాపిరెడ్డి కంట్లో కారంచల్లి ఇనుప రాడ్డుతో దాడి చేయబోయాడు. సహచర ప్రయాణికులు కేకలు వేసి అడ్డుకోవడంతో వెంగళరెడ్డి పారిపోయాడు. వెంటనే బాపిరెడ్డి కోర్టుకు వెళ్లి తనపై జరిగిన దాడిని వివరించారు. న్యాయమూర్తి సూచన మేరకు పట్టణ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే అప్రమత్తమైన సీఐ పి.సుబ్బారావు, ఎస్సైలు సైదుబాబు, రాజమోహన్‌లు ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రయాణికులను విచారించారు. అంతేకాక సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సైదుబాబు తెలిపారు.