మలుపులు తిరుగుతున్న మున్సిపల్ రాజకీయం
ABN , Publish Date - Dec 18 , 2025 | 11:42 PM
మార్కాపురం మున్సిపల్ ఛైర్మన్ పీఠంపై నెలకొన్న సందిగ్ధం పలు రకాల మలుపులు తిరుగుతోంది. మున్సిపల్ ఛైర్మన్ చిర్లంచర్ల బాలమురళీకృష్ణపై ఈ సంవత్సరం జూన్ 11వ తేదీన ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సాంకేతికంగా చెల్లదని మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురే్‌షకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
విశ్వాస తీర్మానం చెల్లదన్న ప్రిన్సిపల్ సెక్రటరీ
కలెక్టర్‌కు చేరిన ఉత్తర్వులు
కోర్టును ఆశ్రయించిన 24 మంది కౌన్సిలర్లు
మార్కాపురం, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి) : మార్కాపురం మున్సిపల్ ఛైర్మన్ పీఠంపై నెలకొన్న సందిగ్ధం పలు రకాల మలుపులు తిరుగుతోంది. మున్సిపల్ ఛైర్మన్ చిర్లంచర్ల బాలమురళీకృష్ణపై ఈ సంవత్సరం జూన్ 11వ తేదీన ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం సాంకేతికంగా చెల్లదని మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురే్‌షకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అవిశ్వాస తీర్మానం చెల్లనందున తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి అయిన ప్రకాశం జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు ఇచ్చారు. ఇది ఇలా ఉంటే కౌన్సిల్ సమావేశంలో 2/3వ వంతు మంది కౌన్సిలర్‌లు పాల్గొన్నందున వారిలో ఎంతమంది ఓటింగ్‌లో పాల్గొన్నా మెజార్టీ సభ్యులనే ప్రామాణికంగా తీసుకోవాలని 24 మంది కౌన్సిలర్లు హైకోర్టును ఆశ్రయించారు.
సాంకేతిక అంశాలతో చెల్లని అవిశ్వాసం
మార్కాపురం మున్సిపల్ చైర్మన్ చిర్లంచర్ల బాలమురళీకృష్ణపై సొంత పార్టీ కౌన్సిలర్‌లే ఎదురు తిరిగారు. తమకు సరైన ప్రాధాన్యత ఇవ్వడంలేదని ఆరోపిస్తూ సుమారు 12 మంది కౌన్సిలర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. మొత్తం 35 మంది కౌన్సిలర్‌లలో ఒకరు చనిపోగా, 29 మంది వైసీపీ, 5 మంది టీడీపీ కౌన్సిలర్లు ఉన్నారు. పార్టీలో చేరిన వారితో కలుపుకుంటే టీడీపీ బలం 17కి చేరింది. దీంతో అవిశ్వాస తీర్మానం పెట్టి బాలమురళీకృష్ణను గద్దె దించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. అప్పటికి 17 మంది కౌన్సిలర్ల బలం ఉన్న వైసీపీలోని మరో 7 మంది అవిశ్వాసానికి మద్దతిస్తామన్నారు. అంతా అనుకున్నట్లుగా 24 మంది కౌన్సిల్ సభ్యులు ముందుగా కలెక్టర్‌కు అవిశ్వాసం తీర్మానం కోసం విన్నవించుకున్నారు. కలెక్టర్ ఆదేశాలతో అవిశ్వాస తీర్మానం కోసం సమావేశం జరిగింది. సమావేశానికి 24 మంది కౌన్సిలర్లు హాజరైనా అవిశ్వాసానికి మద్దతుగా 19 మంది మాత్రమే ఓట్లు వేశారు. అనంతరం నూతన చైర్మన్‌ను ఎన్నుకునే ప్రక్రియపై ఆదేశాలు ఇవ్వాలని 24 మంది కౌన్సిలర్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను కోరారు. ఈ విషయంలో ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అంతేకాక సాంకేతిక అంశాలను చూపుతూ అవిశ్వాస తీర్మానం చెల్లదని చైర్మన్‌గా బాలమురళీకృష్ణనే కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌శాఖను ఆదేశించారు. ఈ క్రమంలోనే మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గత నెలలోనే కలెక్టర్‌కు ఆదేశాలిచ్చారు.
హైకోర్టును ఆశ్రయించిన 24 మంది కౌన్సిలర్లు
తాము మున్సిపాలిటీ నిబంధనల మేరకే అవిశ్వాస తీర్మానంలో పాల్గొన్నామని మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తర్వులకు వ్యతిరేఖంగా 24 మంది కౌన్సిలర్లు తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. కలెక్టర్ నియమించిన ఎన్నికల అధికారి వచ్చి మరీ అవిశ్వాస తీర్మానం సమావేశంలో పాల్గొని అంతా సవ్యంగానే ప్రక్రియను నిర్వహించారని కౌన్సిలర్లు వాదిస్తున్నారు. ఈ నెలాఖరులోగా లేకుంటే జనవరిలోనైనా నూతన చైర్మన్ ఎన్నిక ప్రక్రియపై హైకోర్టు నుంచి ఆదేశాలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు కౌన్సిలర్లు చెప్తుతున్నారు.