Share News

ఎంపీడీవోలు వస్తున్నారు!

ABN , Publish Date - Sep 06 , 2025 | 02:35 AM

మండల స్థాయిలో కీలకంగా పనిచేసే మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) పోస్టులను పూర్తిస్థాయిలో భర్తీ చేసేందుకు ప్రజాప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా జడ్పీ, పంచాయతీ శాఖల్లో పనిచేస్తున్న పలువురికి ఎంపీడీవోలుగా ఉద్యోగోన్నతి కల్పించింది. జిల్లాకు 20 మందిని కేటాయించింది.

ఎంపీడీవోలు వస్తున్నారు!

ఉద్యోగోన్నతి పొందిన 20 మంది జిల్లాకు కేటాయింపు

ప్రస్తుతం 19 మండలాల్లో ఇన్‌చార్జిలు

వారిస్థానంలో త్వరలో పూర్తి బాధ్యతలతో కొత్తవారు

వేగవంతం కానున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు

ఒంగోలు కలెక్టరేట్‌, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి) : మండల స్థాయిలో కీలకంగా పనిచేసే మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) పోస్టులను పూర్తిస్థాయిలో భర్తీ చేసేందుకు ప్రజాప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా జడ్పీ, పంచాయతీ శాఖల్లో పనిచేస్తున్న పలువురికి ఎంపీడీవోలుగా ఉద్యోగోన్నతి కల్పించింది. జిల్లాకు 20 మందిని కేటాయించింది. వారికి త్వరలో పోస్టింగ్‌లు ఇవ్వనుంది. దీంతో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు వేగవంతం కానుంది.

వైసీపీ హయాంలో పట్టించుకోని వైనం

గత వైసీపీ ప్రభుత్వ హయాం నుంచి జిల్లాలో ఎంపీడీవోల కొరత వేధిస్తోంది. కొత్త నియామకాలు చేపట్టకపోవడం, ఉద్యోగోన్నతులు సకాలంలో కల్పించకపోవడంతో ఇన్‌చార్జిలతోనే నెట్టుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మండల స్థాయిలో ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలలో ఎంపీడీవోలే కీలకమన్న విషయాన్ని గుర్తించిన ప్రస్తుత ప్రజాప్రభుత్వం నియామకాలపై ప్రత్యేక దృష్టి సారించింది. గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగోన్నతులకు మోక్షం కల్పించింది. జిల్లా పరిషత్‌ పరిధిలో పనిచేస్తున్న పరిపాలనాధికారులు (ఏవో), పంచాయతీ పరిధిలో పనిచేస్తున్న డిప్యూటీ ఎంపీడీవో (ఈవోపీఆర్‌డీ)ల సీనియారిటీ జాబితాలను పీఆర్‌ కమిషనర్‌ తెప్పించుకున్నారు. అర్హత ఉన్న వారందరికీ ఉద్యోగోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వారిలో మన జిల్లాకు 20 మందిని కేటాయించారు.

త్వరలోనే కొత్తవారు నియామకం

ఉమ్మడి జిల్లాలోని 19 మండలాల్లో ఎంపీడీవోల కొరత ఉంది. ఆ మండలాల్లో డిప్యూటీ ఎంపీడీవోలు లేదా పరిపాలనాధికారులు ఇన్‌చార్జి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అనేక కార్యక్రమాలన్నీ ఎంపీడీవోల పర్యవేక్షణలోనే కొనసాగుతాయి. ప్రధానంగా గ్రామాల్లో కీలకమైన ఉపాధి హామీ పథకం పనుల కేటాయింపు, కూలీలకు వేతనాల చెల్లింపు, నెలవారీ ఇచ్చే సామాజిక పింఛన్లు, వివిధ పథకాల కింద లబ్ధిదారుల ఎంపిక వంటి కార్యక్రమాలన్నీ ఎంపీడీవోల పర్యవేక్షణలో జరుగుతాయి. అయితే ఎంపీడీవోల కొరత కారణంగా ఆయా పనుల నిర్వహణలో జాప్యం జరుగుతోంది. ఈనేపథ్యంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మండల స్థాయిలో కీలకంగా పనిచేసే ఎంపీడీవోల కొరత తీరడమే కాకుండా సంక్షేమ పథకాల అమలు కూడా వేగవంతం కానుంది. ఎంపీడీవోలుగా ఉద్యోగోన్నతులు పొందిన వారికి త్వరలోనే పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు.

Updated Date - Sep 06 , 2025 | 02:35 AM