పట్టణాభివృద్ధి ధ్యేయంగానే ముందుకు
ABN , Publish Date - Aug 08 , 2025 | 11:21 PM
భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నూతన మాస్టర్ ప్లాన్‌ను రూపొందించామని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి అన్నారు. స్థానిక కాలేజీ రోడ్డులోని శుభం కన్వెన్షన్ హాలులో శుక్రవారం మార్కాపురం మున్సిపాలిటీ పట్టణ ప్రణాళిక విభాగం, ఒంగోలు అర్బన్ డెవల్‌పమెంట్ అఽథారిటీ(ఒడా)లు రూపొందించిన డ్రాఫ్ట్ మాస్లర్ ప్లాన్‌పై అవగాహన కార్యక్రమం జరిగింది.
భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నూతన మాస్టర్ ప్లాన్
మార్కాపురం, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నూతన మాస్టర్ ప్లాన్‌ను రూపొందించామని మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి అన్నారు. స్థానిక కాలేజీ రోడ్డులోని శుభం కన్వెన్షన్ హాలులో శుక్రవారం మార్కాపురం మున్సిపాలిటీ పట్టణ ప్రణాళిక విభాగం, ఒంగోలు అర్బన్ డెవల్‌పమెంట్ అఽథారిటీ(ఒడా)లు రూపొందించిన డ్రాఫ్ట్ మాస్లర్ ప్లాన్‌పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నారాయణరెడ్డి మాట్లాడుతూ 2002వ సంవత్సరంలో మాస్టర్ ప్లాన్‌ను రూపొందించారన్నారు. మళ్లీ 20 సంవత్సరాలకు నూతన ప్లాన్‌ను తయారు చేయాల్సివున్నా అప్పట్లో కరోనా పరిస్థితుల వలన వాయిదా పడిందన్నారు. 23 సంవత్సరాల తర్వాత మళ్లీ మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేసకుంటున్నామన్నారు. ఈ ప్లాన్ 2041 వరకు భవిష్యత్తు అవసరాల దృష్ట్యా రూపొందించడం జరిగిందన్నారు. ముఖ్యంగా త్వరలో మార్కాపురం జిల్లా కాబోతుందన్నారు. ఈ నేపథ్యంలో రహదారులు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. పెరుగుతున్న వాహనాల సంఖ్య, ట్రాఫిక్ ఇబ్బందుల నేపథ్యంలో ప్రధాన రహదారులు ఎక్కడా 60 అడుగులకు లోపు ఉండే అవకాశం లేదన్నారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చేయాలంటే రహదారులను విస్తరించాల్సి ఉందన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. పట్టణ అభివృద్ధే ముఖ్యమని రాజకీయాలకు తాము ఎక్కడా చోటు ఇచ్చే ప్రసక్తేలేదని అన్నారు. ఆక్రమణల విషయంలో స్వపక్షానికి చెందిన వారైనా ఉపేక్షించేదిలేదన్నారు. అన్ని ప్రాంతాల్లోనూ అప్రూవల్ లేని నిర్మాణాలు ఉండకూడదన్నారు. అనుమతులు లేని లేఅవుట్‌లు ఉంటే ఎల్‌ఆర్‌ఎస్ పథకం ద్వారా క్రమబద్ధీకరించుకోవాలన్నారు. ప్రస్తుతం తయారు చేసిన మాస్టర్ ప్లాన్‌లో మార్కాపురం, తర్లుపాడు, పెద్దారవీడు మండలాల్లోని పలు గ్రామాలు ఉన్నాయన్నారు. కానీ ఆయా గ్రామాల ప్రజల అభిప్రాయాలను సేకరించిన తరువాతే వాటిని పట్టణంలో కలిపేందుకు నిర్ణయిస్తారన్నారు. ఎక్కడా బలవంతంగా గ్రామాలను కలిపే చర్యలు ఉండవన్నారు. మాస్టర్ ప్లాన్‌పై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు అర్బన్ డెవల్‌పమెంట్ అఽథారిటీ (ఒడా) ప్లానింగ్ అధికారి బాబూరావు, మున్సిపల్ కమిషనర్ డీవీఎస్ నారాయణరావు, తహసీల్దార్ కె.చిరంజీవి, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.