Share News

పొగాకు కొనుగోళ్లపై కదలిక

ABN , Publish Date - May 27 , 2025 | 12:33 AM

కొనుగోళ్లు జరగక నైరాశ్యంలో ఉన్న పొగాకు రైతులను ఆదుకొనేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

పొగాకు కొనుగోళ్లపై కదలిక

పర్చూరు, మే 26 (ఆంధ్రజ్యోతి) : కొనుగోళ్లు జరగక నైరాశ్యంలో ఉన్న పొగాకు రైతులను ఆదుకొనేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలతో రాష్ట్ర వ్యవసాయశాఖ, విద్యుత్‌శాఖ మంత్రులు స్ధానిక ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు నేతృత్వంలో ఇటు పొగాకు కంపెనీల ప్రతినిధులు, రైతులతో ముఖాముఖి నిర్వహించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, కంపెనీ ప్రతినిధుల ఆధ్వర్యంలో ధరను కూడా నిర్ణయించి సమగ్ర సమాచారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకుపోయారు. దీంతో త్వరిత గతిన కొనుగోలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. దీంతో పొగాకు కొనుగోళ్లపై అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే వ్యవసాయశాఖ అధ్వర్యంలో రైతుల వద్ద ఉన్న నిల్వల వివరాలను ప్రభుత్వ ప్రత్యేక యాఫ్‌లో రైతు భరోసా కేంద్రం సిబ్బంది నమోదు చేశారు. బ్లాక్‌ బర్లీ పొగాకు పంట వేగవంతంగా కంపెనీలు కొనుగోలు చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీచేశారు. కొనుగోళ్ల విషయంలో వ్యవసాయశాఖ, మార్క్‌ఫెడ్‌ను భాగస్వామ్యం చేస్తూ కలెక్టర్‌ బాధ్యతలు అప్పగించారు. కంపెనీలు కొనుగోలు చేసిన పొగాకును నిల్వచేసుకునే విధంగా గోడౌన్‌లను కూడా గుర్తించాలన్నారు. దీనికి సంబంధించి పర్చూరులో కంట్రోల్‌ రూంతోపాటు, టోల్‌ఫ్రీ నెంబరు రైతుల కొరకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. పొగాకు కొనుగోళ్లపై ప్రజా ప్రతినిధులు, అధికారుల పర్యవేక్షణ ఉంటుందన్నారు.

Updated Date - May 27 , 2025 | 12:33 AM