సమ్మెపై కదలిక
ABN , Publish Date - Oct 12 , 2025 | 01:37 AM
చీమకుర్తి ప్రాంత గ్రానైట్ ఫ్యాక్టరీల యజమానుల సమ్మెపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఫ్యాక్టరీల యజమానుల ఆవేదనను సానుకూలంగా అర్థం చేసుకొని వారికి వెసులుబాటు కలిగేలా తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వ పెద్దలు కదిలారు.
గ్రానైట్ సమస్య తీవ్రతపై చర్చించుకున్న మంత్రులు కొల్లు రవీంద్ర, డాక్టర్ స్వామి
వారివురినీ కలిసి ఆవేదన వెలిబుచ్చిన అసోసియేషన్ ప్రతినిధులు
మరోవైపు స్వామి, జనార్దన్, కలెక్టర్ భేటీ
స్థానికంగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చ
సానుకూల పరిష్కారం వైపు అందరి దృష్టి
చీమకుర్తి ప్రాంత గ్రానైట్ ఫ్యాక్టరీల యజమానుల సమ్మెపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఫ్యాక్టరీల యజమానుల ఆవేదనను సానుకూలంగా అర్థం చేసుకొని వారికి వెసులుబాటు కలిగేలా తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వ పెద్దలు కదిలారు. ఇందుకు సంబంధించి శనివారం పలు పరిణామాలు చోటుచేసుకున్నాయి. జిల్లాకు చెందిన మంత్రి డాక్టర్ డీఎస్‌బీవీ స్వామి, రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్రలు ఈ అంశంపై ఫోన్‌లో మాట్లాడుకున్నారు. సమస్యకు పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయానికి వచ్చారు. మంత్రి స్వామి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, కలెక్టర్ రాజాబాబు సమావేశమై స్థానికంగా చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.
ఒంగోలు, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): గ్రానైట్ పరిశ్రమలో నెలకొన్న అనిశ్చితిపై ప్రభుత్వంలో కదలిక వచ్చింది. ఆ మేరకు ఇద్దరు మంత్రులు ఈ విషయంపై దృష్టిపెట్టి చర్చలు జరిపారు. అలాగే స్థానికంగానూ ప్రభుత్వ పెద్దలు సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మైనింగ్ రాయల్టీ వసూళ్లను ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు అప్పగించడంతో గ్రానైట్ పరిశ్రమలో కలకలం రేగింది. అలాగే ఇక్కడ కాంట్రాక్టు పొందిన ఏఎంఆర్ సంస్థ పోకడపై చీమకుర్తి ప్రాంత ఫ్యాక్టరీల యజమానులు తీవ్ర అభ్యంతరం, ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు. ప్రస్తుత విధానంతో ఫ్యాక్టరీల భవిష్యత్ ఆందోళనకరమని, పరిశ్రమల మనుగడే కష్టమని వారు భావిస్తున్నారు. ప్రధానంగా ప్రస్తుతం కట్టర్‌కు రూ.35వేలు రాయల్టీగా ప్రభుత్వానికి చెల్లిస్తుండగా దానితోపాటు అదనంగా మరో రూ.30వేల నుంచి 35వేలు ఆ సంస్థ కోరుతున్నదని చెప్తున్నారు. అలా అయితే తాము తీవ్రంగా నష్టపోతామని, పరిశ్రమలు మూసివేయాల్సి వస్తుందని వాపోతున్నారు. గ్రానైట్ క్వారీల్లో జరిగే చిన్నచిన్న లోపాలను హేతుబద్ధంగా పరిశీలించకుండా వాటిని ఆసరా చేసుకొని తమపై భారం మోపుతున్నారన్న ఆందోళనతో చీమకుర్తి ప్రాంతంలోని 800 ఫ్యాక్టరీల యాజమనులు ఈనెల 1 నుంచి సమ్మెబాట పట్టారు.
ఉపాధిపై దెబ్బ.. అంతా వెలవెల
సమ్మెతో ఫ్యాక్టరీలలో పనులు నిలిచిపోయాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా 25వేల మంది ఉపాధిపై దెబ్బపడింది. వలస కూలీల్లో ఎక్కువ మంది సొంత రాష్ట్రానికి వ్లెలపోయారు. వెళ్లిపోయారు. దీంతో నిత్యం రద్దీగా ఉండే చీమకుర్తి ప్రాంతంలోని రామతీర్థం, మర్రిచెట్లపాలెం సెంటర్లు వెలవెలబోతున్నాయి. పదిరోజులుగా పెద్దగా ప్రభుత్వ పరంగా స్పందన కనిపించకపోగా శనివారం పలు పరిణామాలు చోటుచేసుకున్నాయి. గ్రానైట్ ఫ్యాక్టరీల అసోసియేషన్ ప్రతినిధులు శనివారం ఉదయం జిల్లాకు చెందిన మంత్రి డాక్టర్ స్వామిని తూర్పునాయుడుపాలెంలోని ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. అఽధికారికంగా ప్రభుత్వం వసూలు చేసే రూ.31వేల రాయల్టీకి అదనంగా మరో రూ.35వేలు వసూలుకు సిద్ధపడటం దారుణమన్నారు. ప్రస్తుతం తమకు ఇస్తున్న 22 మీటర్ల అనుమతికి బదులు 35 మీటర్లు ఇవ్వాలని కోరారు. వాటితోపాటు మరికొన్ని విషయాలను వారు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
మంత్రి కొల్లుతో ఫోన్‌లో మాట్లాడిన స్వామి
మంత్రి స్వామి ఈ విషయమై రాష్ట్ర గనులశాఖ మంత్రి కొల్లు రవీంద్రకు ఫోన్ చేసి మాట్లాడారు. సమస్య తీవ్రత, కీలకమైన గ్రానైట్ పరిశ్రమ మూత, దీంతో నెలకొన్న పరిణామాలపై వారిద్దరు చర్చించుకొని సానుకూల పరిష్కారం చూపాలన్న నిర్ణయానికి వచ్చారు. మంత్రి స్వామి సూచనల మేరకు ఫ్యాక్టరీల యజమానుల అసోసియేషన్ ప్రతినిధులు శనివారం మధ్యాహ్నం విజయవాడ వెళ్లి గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్రను కలిసి తమ ఆవేదనను వివరించారు. అసోసియేషన్ ప్రతినిధులు యర్రగుంట్ల శ్రీనివాసరావు, కాట్రగడ్డ రమణయ్య, లగడపాటి శ్రీనివాసరావు, మలినేని వెంకటేశ్వర్లు, కన్నూరి సుబ్బారావు తదితరులు మంత్రులను కలిసిన వారిలో ఉన్నారు. ఉన్నతాధికారులు, ప్రైవేటు ఏజెన్సీ ప్రతినిధులను పిలిచి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి రవీంద్ర అసోసియేషన్ ప్రతినిధులకు హామీ ఇచ్చారు.
కలెక్టర్ చాంబర్‌లో సమావేశం
ఇదే విషయమై శనివారం ఒంగోలులోని కలెక్టరేట్‌లో మంత్రి డాక్టర్ స్వామి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, కలెక్టర్ రాజాబాబులు భేటీ అయి చర్చించారు. ప్రకాశం భవనంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న వారు.. ముందుగా అరగంటపాటు కలెక్టర్ చాంబర్‌లో సమావేశమయ్యారు. పలు అంశాలపై వారి మధ్య చర్చ జరిగింది. ప్రధానంగా గ్రానైట్ పరిశ్రమ సమ్మె, ఇతర మైనింగ్ అంశాలు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. ఫ్యాక్టరీ యజమానుల ఆవేదనను అర్థం చేసుకొని పరిశ్రమకు ఇబ్బంది కలుగకుండా స్థానికంగా చర్యలు తీసుకోవాల్సి ఉందని, ఆ వైపు దృష్టిపెట్టాలని మంత్రి స్వామి, ఎమ్మెల్యే జనార్దన్‌లు ఆ సందర్భంగా కలెక్టర్ రాజాబాబుకు సూచించారు. ఇసుక విషయంలో కొందరు గనుల అధికారుల తీరును ఎమ్మెల్యే తప్పుబడుతూ చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరినట్లు సమాచారం.