వరికపూడిశెల ఎత్తిపోతల పనుల్లో కదలిక
ABN , Publish Date - Jul 30 , 2025 | 10:47 PM
వరికపూడిశెల ఎత్తిపోతల పథక పనులకు ఉన్న అడ్డంకులు తొలగిపోతున్నాయి. పల్నాడు జిల్లా రైతుల దశాబ్ధాల కలయైున ఈ ప్రాజెక్ట్ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని పుల్లలచెరువు మండల రైతులకు వెలిగొండ ప్రాజెక్ట్ పరిధిలోని తీగలేరు-5 కాలువ తరువాత పల్నాడు జిల్లాలో నిర్మితమవుతున్న ఈ వరికపూడిశెల ఎత్తిపోతల పథకం ప్రధానమైనది.
అటవీశాఖకు రూ.14.5 కోట్లు చెల్లించిన ప్రభుత్వం
తొలిదశ పనుల ప్రారంభానికి తొలగిన అడ్డంకి
త్రిపురాంతకం, జూలై 30 (ఆంధ్రజ్యోతి) : వరికపూడిశెల ఎత్తిపోతల పథక పనులకు ఉన్న అడ్డంకులు తొలగిపోతున్నాయి. పల్నాడు జిల్లా రైతుల దశాబ్ధాల కలయైున ఈ ప్రాజెక్ట్ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని పుల్లలచెరువు మండల రైతులకు వెలిగొండ ప్రాజెక్ట్ పరిధిలోని తీగలేరు-5 కాలువ తరువాత పల్నాడు జిల్లాలో నిర్మితమవుతున్న ఈ వరికపూడిశెల ఎత్తిపోతల పథకం ప్రధానమైనది.
నాగార్జునసాగర్ బ్యాక్‌వాటర్‌ను వెల్దుర్తి మండలం గంగలకుంట వద్ద ఎత్తిపోతల పథకాన్ని రెండు దశల్లో పూర్తిచేయనున్నారు. మొదటి దశలో పల్నాడు జిల్లాలోని మాచర్ల, వినుకొండ నియోజకవర్గాలకు నీరిచ్చేలా.. రెండో దశలో పనులు చేపట్టి పుల్లలచెరువు మండలంలోని కొన్ని గ్రామాలకు సాగు, తాగు నీరు ఇచ్చేలా పథకం రూపకల్పన చేశారు. ఈ పథకాన్ని ఎన్నికల ముందు గత ప్రభుత్వం హడావుడిగా శంకుస్థాపన చేసింది. అంతకుమించి రూపాయి ఇవ్వలేదు. పనులు అడుగు ముందకు పడలేదు.
యువగళంలో లోకేష్ ఇచ్చిన హామీ మేరకు...
ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ పనుల ప్రారంభానికి ఉన్న అడ్డంకులు తొలగించేలా చర్యలు చేపట్టింది. ముఖ్యంగా ప్రాజెక్ట్ కోసం నీళ్లు ప్రారంభమయ్యే ప్రాంతం నల్లమల అటవీ ప్రాంతం పరిధిలో ఉండగా అటవీశాఖ అనుమతులు అవసరమయ్యాయి. ఇందులో భాగంగా ప్రభుత్వం నుంచి రెండు రోజుల క్రితం అటవీశాఖకు 14.5కోట్ల రూపాయలను చెల్లించటంతో అడ్డంకి తొలగిపోయింది. ముఖ్యంగా మంత్రి లోకేష్ యువగళం పాదయాత్రలో పల్నాడు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామన్నారు. ఆ మేరకు అధికార యంత్రాంగం పనులు చేపట్టేందుకు సిద్ధమవుతోంది.
రెండోదశ పనులతో పుల్లలచెరువు రైతులకు లబ్ధి
ప్రాజెక్ట్ పనులు ప్రారంభమైతే రెండో విడత పనులు పూర్తి ద్వారా పుల్లలచెరువు మండలంలోని 10,456 ఎకరాలకు సాగునీరు అందనుంది. అంతేకాకుండా మూడు గ్రామ పంచాయతీల్లోని 14 చెరువులను నింపటం ద్వారా తాగునీటి ఇబ్బందులు కూడా తొలగేలా రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా మర్రివేముల గ్రామంలో 2,476.74 ఎకరాలు, శతకోడులో 1,338.36 ఎకరాలు, ముటుకుల గ్రామంలో 6,641.96 ఎకరాలకు సాగునీరు అందనుంది. పలు గ్రామాల రైతులు వెలిగొండ ప్రాజెక్ట్ పరిదిలోని తీగలేరు-5 కాలువ ద్వారా జరిగే మేలుకోసం ఎదురు చూసినట్టే ఈ గ్రామాల రైతులు కూడా వరికపూడిశెల ప్రాజెక్ట్‌కోసం ఆశతో ఉన్నారు. ఇప్పుడు తొలిదశ పనులు ప్రారంభమవుతున్నాయన్న సమాచారంతో ఈ ప్రాంత రైతుల ఆశలు చిగురించాయి.