‘దొంగాట’పై కదలిక
ABN , Publish Date - Dec 20 , 2025 | 01:43 AM
క్రీడా సంఘాల ముసుగులో అక్రమాలకు పాల్పడిన వారిపై ఎట్టకేలకు చర్యలకు రంగం సిద్ధమైంది. నకిలీ సర్టిఫికెట్లు జారీచేసి అర్హులకు అన్యాయం చేసిన వారిపై కేసులు నమోదు చేస్తామని శాప్ చైర్మన్ రవినాయుడు ప్రకటించారు. రాష్ట్రంలోనే ఒంగోలులో ఈ అక్రమాలు ఎక్కువ జరిగినట్లు గుర్తించామని ఆయన చెప్పారు.
సాఫ్ట్‌బాల్ సంఘం పేరుతో ఒంగోలు కేంద్రంగా మోసాలు
ఏడాదైనా దోషులపై చర్యలు శూన్యం
ఉద్యోగాల్లోనే కొనసాగుతున్న అనర్హులు
నకిలీ సర్టిఫికెట్ల మంజూరుపై సంవత్సరం క్రితం విచారణ పూర్తి
అంతా వాస్తవమేనని తేల్చిన విచారణాధికారి
ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారి తొలగింపులో జాప్యం
కఠిన చర్యలు తీసుకుంటామని శాప్ చైర్మన్ ప్రకటన
అర్హులైన క్రీడాకారులలో చిగురించిన ఆశలు
క్రీడా సంఘాల ముసుగులో అర్హులకు అన్యాయం చేస్తూ ఆటలు ఆడని వారికి లబ్ధి చేకూర్చారు. నకిలీ సర్టిఫికెట్లు జారీ చేసి భారీగా దండుకున్నారు. ఈ వ్యవహారం సాఫ్ట్‌బాల్ సంఘంలో చోటుచేసుకుంది. ఆ అక్రమాలు ఏడాది క్రితమే వెలుగులోకి వచ్చాయి. ‘ఆంధ్రజ్యోతి’లో వరుస కథనాలతో అప్పటి కలెక్టర్ తమీమ్ అన్సారియా విచారణకు ఆదేశించారు. అయితే నేటికీ చర్యలు కరువయ్యాయి. నకిలీ సర్టిఫికెట్‌లతో ఉద్యోగాలు పొందిన వారు దర్జాగా జీతాలు తీసుకుంటున్నారు. ఈనేపథ్యంలో మూడు రోజుల క్రితం ఒంగోలు వచ్చిన శాప్ చైర్మన్ ఈ వ్యవహారంపై స్పందించారు. నకిలీల బాగోతంపై చర్యలు తీసుకుంటామని వెల్లడించడంతో ఇప్పటికైనా న్యాయం జరుగుతుందన్న ఆశ అర్హులైన క్రీడాకారులలో చిగురించింది.
ఒంగోలు, కార్పొరేషన్, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి) : క్రీడా సంఘాల ముసుగులో అక్రమాలకు పాల్పడిన వారిపై ఎట్టకేలకు చర్యలకు రంగం సిద్ధమైంది. నకిలీ సర్టిఫికెట్లు జారీచేసి అర్హులకు అన్యాయం చేసిన వారిపై కేసులు నమోదు చేస్తామని శాప్ చైర్మన్ రవినాయుడు ప్రకటించారు. రాష్ట్రంలోనే ఒంగోలులో ఈ అక్రమాలు ఎక్కువ జరిగినట్లు గుర్తించామని ఆయన చెప్పారు. సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ పేరుతో కొందరు వ్యక్తులు క్రీడా సర్టిఫికెట్‌లను మెడికల్ విద్యార్థులకు, ఇతర ప్రభుత్వ ఉద్యోగాల అభ్యర్థులకు అమ్ముకు న్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని గత బుధవారం ఒంగోలు వచ్చిన ఆయన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. దీంతో ఆ వ్యవహారం క్రీడావర్గాల్లో చర్చనీయాంశమైంది. క్రీడా సంఘం ముసుగులో కొందరు ఉద్యోగులు నకిలీ సర్టిఫికెట్‌లు మంజూరు చేయగా, వాటి సాయంతో అనర్హులైన వారు ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన విషయం తెలిసిందే. ఈ నకిలీ బాగోతాన్ని గత ఏడాది ఆగస్టు 8న ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చింది. అర్హుడైన తనకు అన్యాయం జరిగిందంటూగురవారెడ్డిపాలెంకు చెందిన అనిల్‌కుమార్ అనే క్రీడాకారుడు అప్పటి కలెక్టర్ తమీమ అన్సారియాకు ఫిర్యాదు చేయడంతో డొంక కదిలింది. అనిల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ద్వారా ప్రచురితమైన ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆ తర్వాత రాతపరీక్షలో పాసై స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్ సమర్పించారు. ఆన్‌లైన్‌లో పరిశీలించగా, ఆ వెబ్‌సైట్‌లో తనకన్నా ముందు చింపిరెడ్డి కొండారెడ్డి అనే వ్యక్తి నకిలీ సర్టిఫికెట్‌తో అర్హత పొంది ఉన్నారని అనిల్ గుర్తించారు. కొండారెడ్డి గురించి విచారణ చేయగా, సదరు వ్యక్తి సీనియర్స్ నేషనల్స్ పోటీలకు హాజరుకాకుండానే సర్టిఫికెట్ పొందినట్లు తేలింది. ప్రస్తుతం కొండారెడ్డి వలేటివారిపాలెం గ్రామసచివాలయంలో వెటర్నరీ అసిస్టెంట్‌గా కొనసాగుతున్నారు.ఇదిలా ఉండగా అనంతపురం జిల్లాకు చెందిన మిధున్‌కుమార్, సాయి, ప్రకాశం జిల్లాకు చెందిన కె.వంశీ తదితరులు నకిలీ సర్టిఫికెట్‌లు సమర్పించారని వ్యాయామోపాధ్యాయుల సంఘం ఆరోపించింది. దీనిపై విచారణ చేపట్టాలని అప్పట్లో ర్యాలీలు కూడా నిర్వహించింది. అంతేకాకుండా జాతీయ పోటీలలో దొంగాట జరిగినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. వాస్తవానికి జట్టులో పేరు ఉన్న వారే పోటీలో పాల్గొనాలి. అయితే సాఫ్ట్‌బాల్ పోటీలలో అలాకాకుండా పేరు ఒకరిది. ఆడేది ఒకరు ఉండటం వలన అర్హులకు అన్యాయం జరిగిందని పలువురు క్రీడాకారులు వాపోయారు.
విచారణలో విస్తుపోయే అంశాలు
అనిల్ ఫిర్యాదుపై స్పందించిన అప్పటి కలెక్టర్ నకిలీ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. విచారణ అధికారిగా పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు (భూసేకరణ) అప్పటి స్పెషల్ కలెక్టర్ కె.ఝాన్సీలక్ష్మిని నియమించారు. ఆమె జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ సెక్రటరీ, ప్రభుత్వ గురుకుల పాఠశాల వ్యాయామోపాధ్యాయుడు బొడ్డు సుబ్బారావు, అసోసియేషన్ రాష్ట్ర కమిటీ సెక్రటరీ, సీఈ సి.నాగేంద్ర, సి.వెంకటేశ్వర్లుతోపాటు నకిలీ సర్టిఫికెట్‌తో పశుసంవర్ధక శాఖలో ఉద్యోగం పొందిన చింపిరి కొండారెడ్డిని విచారించారు. అప్పట్లో 35 అంశాలపై రెండు నెలలపాటు జరిగిన విచారణలో అధికారులు విస్తుపోయే అంశాలను గుర్తించినట్లు సమాచారం. ప్రకాశం జిల్లాతోపాటు, గుంటూరు, అనంతపురం, ఇతర జిల్లాలలో నీట్ పరీక్ష పాసై, ఎంబీబీఎస్ సీటు కోసం రిజర్వేషన్ కోసం స్పోర్ట్స్ కోటా కింద కొందరు విద్యార్థులకు నకిలీ సర్టిఫికెట్‌లు ఇచ్చినట్లు తేలింది. దీనిపై సమగ్ర నివేదికను ఝాన్సీరాని కలెక్టర్‌కు నివేదించారు.దీంతో సాఫ్ట్‌బాల్ సంఘం పేరుతో అర్హులకు అన్యాయం జరిగిందని గుర్తించారు. ఈ మేరకు నకిలీ సర్టిఫికెట్‌లతో ఉద్యోగం పొందిన వారిని తొలగించడంతోపాటు, మంజూరు చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని అప్పటి కలెక్టర్ ఆదేశించినట్లు సమాచారం. అవసరమైతే సీఐడీ విచారణ చేయాలని సూచించినట్లు తెలిసింది. అయితే విచారణ పూర్తయిఏడాది దాటినా నేటికీ నకిలీ క్రీడా సర్టిఫికెట్‌ల ముఠాపై ఎలాంటి చర్యలు లేకపోవడంపై క్రీడాకారుల నుంచి విమర్శలొచ్చాయి. అయితే శాప్ చైర్మన్ ఈ వ్యవహారంపై సీరియస్‌గా స్పందించడంతో త్వరలో చర్యలు ఉంటాయని క్రీడాకారులు ఆశతో ఉన్నారు.