Share News

మోటార్‌ బైక్‌ దొంగలు దొరికారు

ABN , Publish Date - Sep 25 , 2025 | 11:02 PM

ఇద్దరు నిందితులతోపాటు మైనర్‌ బాలుడిని అదుపులోకి తీసుకొని 19 మోటార్‌ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఒంగోలు డీఎస్పీ ఆర్‌ శ్రీనివాసరావు తెలిపారు.

మోటార్‌ బైక్‌ దొంగలు దొరికారు
స్వాధీనం చేసుకున్న బైక్‌లను పరిశీలిస్తున్న డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐలు

నిందితుల్లో ఒకరు బాలుడు

అదుపులోకి తీసుకున్న పోలీసులు

19 మోటార్‌ సైకిళ్లు స్వాధీనం

వివరాలు వెల్లడించిన ఒంగోలు డీఎస్పీ

ఒంగోలుక్రైం, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి) : ఇద్దరు నిందితులతోపాటు మైనర్‌ బాలుడిని అదుపులోకి తీసుకొని 19 మోటార్‌ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు ఒంగోలు డీఎస్పీ ఆర్‌ శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక సీసీఎస్‌ పోలీసు స్టేషన్‌లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీఎస్పీ ఆ కేసు వివరాలు వెల్లడించారు. పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం గురవాయపాలేనికి చెందిన తాళ్లూరి గాబ్రియల్‌, బండారు నవీన్‌తోపాటు మైనర్‌ బాలుడిని ఒంగోలు నగర శివారు ప్రాంతమైన నేతాజీనగర్‌ సమీపంలో అదుపులోకి తీసుకొని విచారించారు. వారు దొంగిలించిన 19 మోటార్‌సైకిళ్లను స్వాధీనం(వాటివిలువ రూ.13,50,000) చేసుకున్నామన్నారు. తాళం వేయకుండా ఉన్న వాటిని లక్ష్యంగా చేసుకొని ఒంగోలు, టంగుటూరు ప్రాంతాలలో 19 మోటార్‌ సైకిళ్లను ముగ్గురు కలిసి దొంగిలించారని చెప్పారు. వీరిపై నరసరావుపేటలో కేసులు నమోదయ్యాయన్నారు. సులభంగా డబ్బు సంపాదించి జల్సాలు చేయడం అలావాటు పడ్డారని చెప్పారు.

సిబ్బందికి ఎస్పీ అభినందనలు

మోటార్‌ బైక్‌ దొంగలను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సీసీఎస్‌ పోలీసులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించినట్లు డీఎస్పీ తెలిపారు. సీసీఎస్‌ సీఐ జగదీష్‌, తాలుకా సీఐ టి.విజయకృష్ణ, ఎస్సైలు హరిబాబు, వి.వెంకటేశ్వర్లు, సిబ్బంది హెడ్‌కానిస్టేబుళ్లు ఖాజావలి, కానిస్టేబుల్‌ కే రవి, సీహెచ్‌ అంజిబాబు, పి.రఘులను ఎస్పీ హర్షవర్ధనరాజు అభినందించారని డీఎస్పీ తెలిపారు.

కేటీఎం డ్యూక్‌ బైక్‌పై చోరీలు

ఒంగోలు తాలుకా పోలీసు స్టేషన్‌ పరిధిలో కేటీఎం డ్యూక్‌ బైక్‌ను దొంగిలించిన దొంగలు ముగ్గురు అదే బైక్‌పై ఒంగోలు, టంగుటూరు, అద్దంకిలలో చోరీలకు పాల్పడ్డారు. సుమారు ఆరునెలలుగా వీరు ఒంగోలు పరిసర ప్రాంతాలలో 18 బైక్‌లు దొంగిలించిన మోటర్‌ సైకిల్‌పై వచ్చి చోరీలకు పాల్పడటం గమనార్హం.

Updated Date - Sep 25 , 2025 | 11:02 PM