Share News

వెనక్కి పంపినవే అధికం

ABN , Publish Date - Aug 09 , 2025 | 01:20 AM

దక్షిణాది పొగాకు మార్కెట్లో విచిత్ర పరి స్థితి నెలకొంది. నిత్యం పెద్దసంఖ్యలో బేళ్ల తిరస్కరణలు, వాటిలో 90శాతానికిపైగా నోబిడ్‌లు ఉంటున్నాయి. శుక్రవారం ఒక వేలం కేంద్రంలో ఏకంగా 56.85శాతం బేళ్లు వెనక్కి వెళ్లాయి.

వెనక్కి పంపినవే అధికం

దక్షిణాది పొగాకు మార్కెట్లో విచిత్ర పరిస్థితి

కలిగిరిలో 56.85శాతం బేళ్ల తిరస్కరణ

పలు కేంద్రాల్లో భారీగానే..

ఒంగోలు, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి) : దక్షిణాది పొగాకు మార్కెట్లో విచిత్ర పరి స్థితి నెలకొంది. నిత్యం పెద్దసంఖ్యలో బేళ్ల తిరస్కరణలు, వాటిలో 90శాతానికిపైగా నోబిడ్‌లు ఉంటున్నాయి. శుక్రవారం ఒక వేలం కేంద్రంలో ఏకంగా 56.85శాతం బేళ్లు వెనక్కి వెళ్లాయి. అంటే రైతులు తెచ్చిన బేళ్లలో కేవలం 43.15శాతం మాత్రమే అమ్ముడుపోయాయి. వివిధ కారణాలతో 56.85శాతం తిరస్కరణకు గురయ్యాయి. వాటిలో నోబిడ్‌లు 51.11శాతం వరకు ఉన్నాయి. ఈపరిస్థితి ఎస్‌ఎల్‌ఎస్‌ రీజియన్‌లోని కలిగిరి వేలం కేంద్రంలో చోటుచేసుకొంది. ఆ కేంద్రానికి శుక్రవారం 540 బేళ్లను రైతులు అమ్మకానికి తీసుకురాగా 233 (43.15శాతం) మాత్రమే అమ్ముడుపోయాయి. వివిధ కారణాలతో 307 బేళ్లను(56.89శాతం) వ్యాపారులు తిరస్కరించారు. వాటిలో 276 బేళ్లు (51.11శాతం) నోబిడ్‌ అయ్యాయి. ఇతర పలుకేంద్రాల్లోనూ శుక్రవారం భారీగానే బేళ్ల తిరస్కరణలు జరిగాయి. రెండు రీజియన్లలోని 11 వేలం కేంద్రాల్లో 7,349 బేళ్లను అమ్మకానికి తీసుకురాగా 4,873 బేళ్లను మాత్రమే కొనుగోలు చేశారు. అదేసమయంలో 1,896 బేళ్లు (26.29శాతం) అధికారులు సూచించిన ధరలకు బయ్యర్లు కొనుగోలు చేయక నోబిడ్‌ అయ్యాయి. మరో 580 బేళ్లను వివిధ కారణాలతో రైతులు (ఆర్‌ఆర్‌), కంపెనీలు (సీఆర్‌) తిరస్కరించారు. ఆయా వేలం కేంద్రాలలో పరిశీలిస్తే అత్యధికంగా కలిగిరిలో ఏకంగా 51.11శాతం నోబిడ్‌లు ఉన్నాయి. ఒంగోలు-1 కేంద్రంలో 34.87శాతం, కనిగిరిలో 32.02శాతం, వెల్లంపల్లిలో 31.82శాతం, పొదిలిలో 28.49శాతం, డీసీ పల్లిలో 29.47వాతం నోబిడ్‌ అయ్యాయి. ఇతర కేంద్రాల్లో 25శాతానికి పైగా ఉన్నాయి.

Updated Date - Aug 09 , 2025 | 01:20 AM