Share News

వెలుగులోకి మరిన్ని అక్రమాలు

ABN , Publish Date - Dec 21 , 2025 | 02:14 AM

తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించి విలువైన భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేస్తున్న వ్యవహారంలో మరిన్ని అక్రమాలు వెలుగు చూస్తున్నాయి.

వెలుగులోకి మరిన్ని అక్రమాలు

మార్టూరు,డిసెంబరు20(ఆంధ్రజ్యోతి): తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించి విలువైన భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేస్తున్న వ్యవహారంలో మరిన్ని అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే వీఆర్‌వో నుంచి తీసుకున్న తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో పలు రిజిస్ట్రేషన్లు జరిగినట్లు తెలిసింది. ఈ క్రమంలో కేసుల భయంతో శనివారం మూడు పాత రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తున్నారు.

రేపల్లె నియోజకవర్గం చెరుకుపల్లి గ్రామాని కి చెందిన వంకాయల శ్రీనివాసరావు అనే వక్తి తన భార్యతో కలిసి శనివారం మార్టూరు సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వచ్చాడు. నెలరోజుల క్రితం తన భార్య పేరుమీద చేసిన మూడు రిజిస్ట్రర్‌ డాక్యుమెంట్లును రద్దు చేసుకున్నాడు.

మండలంలోని ఒక వీఆర్‌వో నార్నెవారి పాలేనికి చెందిన ఓ వ్యక్తి సూచన మేరకు మార్టూరులో, దాదాపుగా 22 సెంట్లు విస్థీర్ణంలోని ముగ్గురి ఆస్తులను వీఆర్‌వో శ్రీనివాసరావు ఇచ్చిన ధ్రువీకరణపత్రం ఆధారంగా తన భార్యకు రిజిస్ట్రేషన్‌ చేశారు. దాదాపుగా నెల రోజుల క్రితం ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలి సింది ఈ మూడు డాక్యుమెంట్లలో మండల కాంపెక్స్‌ వద్ద కేంద్రప్రభుత్వ ఆస్తి బిఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం, రాజుగారిపాలెం రోడ్డులో ఒక భవనం, అక్కడకు సమీపంలోని మరోస్థలం ఉన్నట్లు తెలిసింది. .అయితే గురువారం గట్టా హేమకుమార్‌ అనే వ్యక్తి జేష్టాద్రి వెంకట్రావు అనే వ్యక్తిపై మార్టూరు స్టేషన్‌ లో ఫిర్యాదు చేయడంతో ఒక్కో అక్రమం వెలుగు చూస్తోంది. అక్రమాలకు పాల్పడిన, సహకరించిన వ్యక్తులు వెలుగులోకి వస్తున్నారు. వాటిలో వీఆర్‌వో పాత్ర పధానంగా ఉన్నట్లు తెలసింది. ఇంకా దొంగ హక్కుపత్రాలను సృష్టించి మార్టూరు ప్రాంతంలో అక్రమాలు చేసిన ఈ ముఠా భాగోతాలు మరిన్ని వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. పోలీసులు పూర్తిస్థాయిలో విచారిస్తే బయటపడే అక్రమాలు కొన్నికాగా, తెలిసో, తెలియకో ఈ ముఠా ఉచ్చులో చిక్కుకున్న మరి కొంతమంది వ్యక్తులు బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం వారి సహకారం ఉండడంతోనే ఈ ముఠా అక్రమాలు జోరుగా సాగుతున్నాయని ప్రజానీకం భావిస్తున్నారు.

ఐదుగురికి 41 ఏ నోటీసులు

బోగస్‌ పత్రాలతో మార్టూరులో గట్టా హేమకుమార్‌ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేసేందుకు యత్నించిన కేసులో పోలీసులు ఐదుగురికి 41 నోటీసులు అందజేశారు. జేష్టాద్రి వెంకట్రావు(రాజంపల్లి) పాదర్తి శివశంకర్‌ (ఒంగోలు) కోనంకి వీఆర్‌వో సుబ్రహ్మణ్యం సందెపోగు రవీంద్ర (నార్నెవారిపాలెం) అట్లూరి జయపాల్‌ (మార్టూరు)లకు సీఐ శేషగిరిరావు శుక్రవారం రాత్రి నోటీసులు ఇచ్చారు.

Updated Date - Dec 21 , 2025 | 02:15 AM