మొంథా ఫైటర్స్
ABN , Publish Date - Nov 02 , 2025 | 01:20 AM
జిల్లాపై మొంథా తుఫాన్ విరుచుకుపడి అల్లకల్లోలం చేయగా అప్రమత్తమైన అధికారులు, ప్రజాప్రతినిధులు బాగా పనిచేశారని సీఎం చంద్రబాబు నాయుడు కొనియాడారు. యంత్రాంగాన్ని పార్టీ కేడర్‌ను సమన్వయం చేసి గణ నీయంగా నష్టాన్ని తగ్గించడంలో క్రియాశీలకంగా వ్యవహరించారని కితాబిచ్చారు. జిల్లాకు చెందిన ముగ్గురు కీలక ప్రజాప్రతినిధులను ఆయన అభినందించారు.
తుఫాన్ తీవ్రతను ఎదుర్కొన్నారని ప్రజాప్రతినిధులు, అధికారులకు కితాబు
మంత్రి డాక్టర్ స్వామి, ఎమ్మెల్యేలు దామచర్ల, బీఎన్, అధికారులకు ముఖ్యమంత్రి అవార్డులు
సమన్వయంతో పనిచేసి ప్రాణ, ఆస్తి నష్టాలు వాటిల్లకుండా కాపాడారని అభినందన
ఒంగోలు, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి) : జిల్లాపై మొంథా తుఫాన్ విరుచుకుపడి అల్లకల్లోలం చేయగా అప్రమత్తమైన అధికారులు, ప్రజాప్రతినిధులు బాగా పనిచేశారని సీఎం చంద్రబాబు నాయుడు కొనియాడారు. యంత్రాంగాన్ని పార్టీ కేడర్‌ను సమన్వయం చేసి గణ నీయంగా నష్టాన్ని తగ్గించడంలో క్రియాశీలకంగా వ్యవహరించారని కితాబిచ్చారు. జిల్లాకు చెందిన ముగ్గురు కీలక ప్రజాప్రతినిధులను ఆయన అభినందించారు. తుఫాన్ సమయంలో వారు అందించిన సేవలను ప్రశంసిస్తూ మంత్రి డాక్టర్ స్వామి, ఒంగోలు, ఎస్‌ఎన్‌పాడు ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బీఎన్.విజయకుమార్‌లకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవార్డులను అందజేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావంతో గత నెల 27 నుంచి 29 వరకు కురిసిన భారీ వర్షాలు, తీవ్రగాలులతో రాష్ట్రం మొత్తం అతలాకుతలమైన విషయం విదితమే. జిల్లాపై ఆ ప్రభావం అత్యధికంగా కనిపించింది. తూర్పుప్రాంతంలోని ఒంగోలు, ఎస్‌ఎన్‌పాడు, కొండపి నియోజకవర్గాల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా అతి భారీ వర్షాలు కురిశాయి. గుండ్లకమ్మ ప్రాజెక్టుతోపాటు ఈ మూడు నియోజకవర్గాల్లోని వాగులు, వంకలు పొంగిపొర్లాయి. ఒంగోలులోని పలు కాలనీలతోపాటు అనేక గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. రోజుల తరబడి రవాణా నిలిచిపోయింది. ఇంతటి భీభత్సం జరిగినా ఎక్కడా ప్రానష్టం చోటుచేసుకోలేదు. రోడ్లు, కరెంటు, ఇరిగేషన్, ఆర్‌డబ్ల్యూఎస్ తదితర శాఖల వనరులకు పరిమితంగానే దెబ్బ తగిలింది. ఇక ప్రజల వ్యక్తిగత ఆస్తులకు పెద్దగా ఎక్కడా నష్టం జరిగిన దాఖలాలు లేవు. అదే సమయంలో జలదిగ్బంధంలో చిక్కుకున్న, ఇతర కారణాలతో ఇబ్బందులు ఎదుర్కొన్న బాధితులకు అండగా నిలవడం, పుననరావాస కేంద్రాల ఏర్పాటు, ఇతర సహాయక చర్యలు, వచ్చిన వరదనీరు ఆగకుండా పోయేలా చేయడం, వర్షం వెలిశాక స్థానికంగా వ్యాధులు, ఇతర సమస్యలు ప్రబలకుండా పారిశుధ్యం, క్లోరినేషన్ బ్లీచింగ్ ఇతరత్రా చర్యలు వేగవంతంగా జిల్లాలో సాగాయి. ఈ మొత్తం వ్యవహారంలో జిల్లా యంత్రాంగం బాగా పనిచేయగా వారికి నిరంతరం అందుబాటులో ఉండటం, అర్ధరాత్రి వేళల్లో కూడా అప్రమత్తంగా ఉండి స్వయంగా సహాయక కార్యక్రమాల్లో పాల్గొనడం, క్షేత్రస్థాయిలోని పార్టీ కేడర్‌ను సమన్వయం చేసి ప్రజలకు అండగా నిలవడంలో ఈ ప్రాంత అధికార పార్టీ ప్రజాప్రతినిధులు విశేషంగా కృషి చేశారు. తుఫాన్ వెలిసిన రెండు రోజుల్లోనే ప్రజలు సాధారణ స్థితిలోకి రాగలిగారు. ఇలా పలు జిల్లాల్లో జరిగింది. మొంథా తుఫాన్ సమయంలో అప్రమత్తంగా పనిచేసిన ప్రజాప్రతినిధులు, అధికారులకు అవార్డులు ఇచ్చి సత్కరించాలని సీఎం నిర్ణయించారు. తదనుగుణంగా శనివారం ఉదయం ఉండవల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన 175మంది ప్రజాప్రతినిధులు, అధికారులను మొంథా తుఫాన్ ఫైటర్స్ పేరుతో ప్రభుత్వం తరపున అవార్డులను అందజేశారు. అందులో జిల్లాకు చెందిన మంత్రి డాక్టర్ డీఎస్‌బీవీ స్వామి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బీఎన్.విజయకుమార్‌లకు ఈ అవార్డులు దక్కాయి. సీఎం చేతుల మీదుగా వారు అవార్డులను అందుకున్నారు. అలాగే ఉత్తమ సేవలు అందించిన జాబితాలో ఉన్న ఒంగోలు ఆర్డీవో లక్ష్మీప్రసన్న, ఒంగోలు కార్పొరేషన్ కమిషనర్ డాక్టర్ కోడూరి వెంకటేశ్వరరావులకూ కూడా సీఎం చంద్రబాబు అవార్డులను అందజేశారు.