మొక్కుబడి
ABN , Publish Date - Sep 13 , 2025 | 01:24 AM
ప్రజా సమస్యలపై చర్చించి ప్రభుత్వంతోపాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం మొక్కుబడిగా సాగింది. ఈ సమావేశాన్ని వేదికగా చేసుకొని ఆయా సమస్యలపై విస్తృతంగా చర్చించాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులు తూతూమంత్రంగా ముగించారు. అధికార పార్టీకి చెందిన కీలక ప్రజాప్రతినిధులతోపాటు ఉన్నతాధికారులు హాజరు కాలేదు.
ఏడు అంశాలపై చర్చ జరిగినా నామమాత్రమే
హాజరు కాని టీడీపీ ప్రజాప్రతినిధులు, కలెక్టర్
నెల్లూరు, బాపట్ల అధికారులు కూడా గైర్హాజరు
కేవలం పింఛన్లపైనే కొంతసేపు చర్చ
మూడు గంటల్లోనే ముగింపు
ఒంగోలు కలెక్టరేట్, సెప్టెంబరు 12 (ఆంఽధ్రజ్యోతి) : ప్రజా సమస్యలపై చర్చించి ప్రభుత్వంతోపాటు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం మొక్కుబడిగా సాగింది. ఈ సమావేశాన్ని వేదికగా చేసుకొని ఆయా సమస్యలపై విస్తృతంగా చర్చించాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులు తూతూమంత్రంగా ముగించారు. అధికార పార్టీకి చెందిన కీలక ప్రజాప్రతినిధులతోపాటు ఉన్నతాధికారులు హాజరు కాలేదు. నెల్లూరు, బాపట్ల జిల్లాల అధికారులు నామమాత్రంగా పాల్గొన్నారు. అజెండాలో పదికిపైగా అంశాలు ఉంచినప్పటికీ కేవలం కొద్ది శాఖలపైనే చర్చ సాగింది. పింఛన్లపై వైసీపీ ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు కాసేపు హడావుడి చేశారు. మూడు గంటల్లోనే సమావేశాన్ని ముగించి మమ అనిపించారు. ఒంగోలులోని జిల్లా పరిషత్ సమావేశపు హాలులో శుక్రవారం చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ అధ్యక్షతన జడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఉదయం పదిన్నర గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా 11.10 గంటలకు మొదలై మధ్యాహ్నం రెండు గంటలకు ముగిసింది. అజెండాలోని అంశాలపై సుదీర్ఘంగా చర్చించి ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. కానీ అందుకు భిన్నంగా సమావేశానికి వచ్చామంటే వచ్చామన్నట్లుగా ఏదో కొంత మంది సభ్యులు మొక్కుబడిగా మాట్లాడారే తప్ప క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించలేదు. ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లాకు చెందిన అధికార పార్టీకి చెందిన మంత్రులు, శాసనసభ్యులు గైర్హాజరయ్యారు. వైసీపీకి చెందిన దర్శి, వైపాలెం ఎమ్మెల్యేలు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్ తప్ప ఆపార్టీకి చెందిన చెందిన శాసనమండలి సభ్యులు కూడా హాజరు కాలేదు. మరోవైపు ఈ సమాశానికి ప్రకాశం, బాపట్ల జిల్లాలకు చెందిన ఉన్నతాధికారులు కూడా రాలేదు. కేవలం ప్రకాశం జిల్లాకు చెందిన జిల్లా రెవెన్యూ అధికారి చినఒబులేషు, బాపట్ల జిల్లాకు చెందిన రెవెన్యూ అధికారి గంగాధర్‌గౌడ్ మాత్రమే హాజరు కాగా నెల్లూరు జిల్లా నుంచి జిల్లా స్థాయి అధికారి ఒక్కరు కూడా పాల్గొన లేదు.
నామమాత్రంగా చర్చ
సమావేశంలో తొలుత పంచాయతీరాజ్‌కు సంబంధించిన చర్చ ప్రారంభమైనప్పటికీ కేవలం పది నిమిషాల్లోనే ముగిసింది. అనంతరం డీఆర్‌డీఏపై చర్చ జరిగింది. ఎమ్మెల్యేలు శివప్రసాద్‌రెడ్డి, చంద్రశేఖర్‌తోపాటు పలు మండలాలకు చెందిన జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు మాట్లాడారు. ఏప్రాతిపదికన దివ్యాంగ పింఛన్లను తొలగిస్తారని ప్రశ్నించడమే తప్ప పూర్తిస్థాయిలో సమగ్రంగా చర్చించిన పరిస్థితి లేకుండాపోయింది. ఇలా వైద్యారోగ్య, విద్యుత్, వ్యవసాయ, అనుబంధ శాఖలు, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్ శాఖలపై చర్చ జరిగినా నామమాత్రంగానే ముగిసింది. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు హాజరు కాకపోవడం వల్లనే ఆయా సమస్యలపై చర్చ జరగలేదనేది స్పష్టమైంది. గతంలో జరిగిన జడ్పీ సమావేశంలో ఇరువురు రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డాక్టర్ స్వామి పాల్గొని అటు సభ్యులు అడిగిన ప్రశ్నలతోపాటు వారి దృష్టికి వచ్చిన ఆయా సమస్యలపై చర్చించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. కానీ ఈసారి సాదాసీదాగా ముగిసింది.
ఏ ప్రాతిపదికన తొలగిస్తారు
జిల్లాలో దివ్యాంగుల పింఛన్ల తొలగింపుపై పలు ప్రాంతాలకు చెందిన సభ్యులు సమావేశంలో ప్రశ్నించారు. ఽథర్డ్ పార్టీతో విచారణ చేయించి ఏవిధంగా నోటీసులు ఇస్తారని నిలదీశారు. దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ తన నియోజకవర్గంలో 3వేల మంది పింఛన్లను ఏప్రాతిపదికన తొలగించారని ప్రశ్నించారు. ఒకసారి సదరం సర్టిఫికెట్ తీసుకున్న తర్వాత థర్డ్‌పార్టీతో విచారణ చేయించి తక్కువశాతం ఉందని ఎలా నిర్ధారించారని ప్రశ్నించారు. ఈ విధంగా ఫించన్లు తొలగించడం సరికాదన్నారు. దర్శి నియోజకవర్గంలో రైతులు ట్రాన్స్‌ఫార్మన్ల కోసం డీడీలు చెల్లించినా ఇంతవరకూ వాటిని బిగించిన పరిస్థితి లేదన్నారు. వెంటనే వాటిని ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
పింఛన్లపై ధర్నా చేస్తాం
వైపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మాట్లాడుతూ తన నియోజకవర్గంలో 2,896 మంది ఫించన్లు తొలగించేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారు. వారందరికీ న్యాయం చేయకపోతే వారితో కలిసి ధర్నా చేపట్టాల్సి వస్తోందని హెచ్చరించారు. కనీసం సమావేశంలో ఆయా అంశాలపై సమాధానం చెప్పేందుకు మంత్రులు రాకపోవడం దారుణంగా ఉందన్నారు. దోర్నాల వైద్యశాలలో సివిల్ సర్జన్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆ వైద్యశాలలో కనీస మౌలిక సదుపాయాలు కూడా లేవని వెంటనే సదుపాయాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
రైతులను ఆదుకోవాలి
జడ్పీటీసీ, ఎంపీపీలు తిరుపతిరెడ్డి, జి.లక్ష్మి, వేమా శ్రీనివాసరావుతోపాటు పలువురు మాట్లాడారు. రైతులు కష్టకాలంలో ఉన్నందున వారు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించడంతోపాటు సక్రమంగా ఎరువులు అందించేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అలా కొంతమంది సభ్యులు మాత్రమే ఒకటి ఆరా ఆ ప్రాంతాలకు సంబంధించిన సమస్యలను ప్రస్తావించారే తప్ప ఇతరత్రా ప్రధానమైన వాటిపై మాట్లాడిన పరిస్థితి లేదు. సమావేశంలో జడ్పీ సీఈవో చిరంజీవితోపాటు ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు.