Share News

తప్పులు వెంటాడుతున్నాయ్‌!

ABN , Publish Date - Dec 03 , 2025 | 02:41 AM

‘తప్పుచేసిన వారు ఎక్కడున్నా తప్పించుకోలేరు. ఉద్యోగ విరమణ చేసి వెళ్లినా వదిలి పెట్టేది లేదు. అక్రమాలకు పాల్పడిన వారు ఎప్పుడైనా సరే దానికి బాధ్యత వహించాల్సిందే’! ఇదీ ప్రస్తుతం రెవెన్యూ శాఖలో సరికొత్త మార్పు. గతంలో అక్రమాలకు పాల్పడి ఉద్యోగ విరమణ చేసిన పలువురు తహసీల్దార్‌లకు ఇటీవల వరుసగా ఉన్నతాధికారుల నుంచి నోటీసులు అందుతున్నాయి.

తప్పులు వెంటాడుతున్నాయ్‌!
దోర్నాల మండలం ఐనముక్కల గ్రామంలో ఫ్రీహోల్డ్‌ చేసిన అసైన్డ్‌ భూమి

ఉద్యోగ విరమణ చేసినా వదిలేది లేదు

వరుసగా తాఖీదులు అందుకుంటున్న పూర్వ తహసీల్దార్‌లు

మొన్న పుల్లలచెరువు, నిన్న దోర్నాల, తాజాగా సీఎస్‌పురం అధికారులు

వారిపై వేటుకు రంగం సిద్ధం

సహకరించిన సిబ్బందిపైనా చర్యలు

‘తప్పుచేసిన వారు ఎక్కడున్నా తప్పించుకోలేరు. ఉద్యోగ విరమణ చేసి వెళ్లినా వదిలి పెట్టేది లేదు. అక్రమాలకు పాల్పడిన వారు ఎప్పుడైనా సరే దానికి బాధ్యత వహించాల్సిందే’! ఇదీ ప్రస్తుతం రెవెన్యూ శాఖలో సరికొత్త మార్పు. గతంలో అక్రమాలకు పాల్పడి ఉద్యోగ విరమణ చేసిన పలువురు తహసీల్దార్‌లకు ఇటీవల వరుసగా ఉన్నతాధికారుల నుంచి నోటీసులు అందుతున్నాయి. వారికి సహకరించిన ఆర్‌ఐలు, వీఆర్వోలు, సర్వేయర్లు సైతం ఇప్పుడు ఏ కార్యాలయంలో పనిచేస్తున్నా తాఖీదులు వెళుతున్నాయి. మొన్న పుల్లలచెరువు పూర్వ తహసీల్దార్‌ గంగాధర్‌, నిన్న దోర్నాల తహసీల్దార్‌గా పనిచేసిన వేణుగోపాలరావు, తాజాగా సీఎస్‌పురం తహసీల్దార్‌గా గతంలో పనిచేసిన మెర్సీకుమారికి నోటీసులు వచ్చాయి. దీంతో ఆ శాఖలో కలకలం నెలకొంది.

త్రిపురాంతకం, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి) : రెవెన్యూ వ్యవస్థలో అధికారులు అవలీలగా తప్పులు చేస్తున్నారు. కొందరు ఉద్యోగ విరమణకు ముందు అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడుతున్నారు. రిటైరైన తర్వాత పట్టించుకోరన్న ధీమాతో ఇలా వ్యవహరిస్తున్నారు. అలాంటి వారందరికీ ప్రజా ప్రభుత్వం షాక్‌ ఇస్తోంది. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలపై రెవెన్యూ శాఖ రాష్ట్ర కార్యాలయానికి అందుతున్న ఫిర్యాదులపై విచారణ చేపట్టి చర్యలకు సిద్ధమవుతోంది. ఆ మేరకు ఉన్నతాధికారులు అక్రమాలకు పాల్పడ్డ అధికారులకు నోటీసులు ఇస్తున్నారు. వారు ఉద్యోగ విరమణ చేసినా సరే వదలడం లేదు. వారితో అంటకాగి వారు చెప్పినట్లు పనిచేసిన కిందిస్థాయి అధికారులు, సిబ్బందిపై సైతం చర్యలకు సిద్ధమవుతుండటం రెవెన్యూ శాఖలో చర్చనీయాంశమైంది. విధి నిర్వహణలో నిబంధనలకు వ్యతిరేకంగా చేసిన తప్పిదాలపై వివరణ ఇవ్వాలంటూ రెవెన్యూ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సాయిప్రసాద్‌ నుంచి వరుసగా పూర్వ తహసీల్దార్లు తాఖీదులు అందుకుంటున్నారు.

ఫ్రీహోల్డ్‌ పేరుతో దోర్నాల తహసీల్దార్‌ ఇష్టారాజ్యం

దోర్నాల తహసీల్దార్‌గా పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన ఎ.వేణుగోపాలరావు మండలంలోని ఐనముక్కల గ్రామంలో 778, 779, 780, 781, 782, 783, 784, 785 సర్వే నెంబర్లలో ఉన్న భూమి వాస్తవం దాచి ఫ్రీహోల్డ్‌ భూములుగా చూపారు. ఈ మేరకు 2024 ఫిబ్రవరి 12న వాటిని నిషేధిత భూములు జాబితా నుంచి తొలగించారు. తరువాత యాత వీరప్రసాద్‌, నరసింహారావు, సత్యదీప్తి పేర్లతో నకిలీ ఆధార్‌ కార్డులు సృష్టించి వారి పేర్లతో మార్కాపురం సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ జరిగాయి. తరువాత ఈ ముగ్గురు వ్యక్తులు ఎస్‌పీపీ ఫార్మాల్యాండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ విజయవాడ పేరుతో ఎనీవేర్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేశారు. వాస్తవానికి గ్రామంలో భూమిలేని 16 మంది పేదలకు 778/1, 778/2, 779/1, 779/2, 780/1, 780/2, 781/1, 781/2, 782/1, 782/2, 783/1, 783/2, 784/1, 784/2, 785/1, 785/2లలో మొత్తం దాదాపు 73.59 ఎకరాలు 1985లో అసైన్‌ చేశారు.

మంత్రి ఆదేశాలతో విచారణ

ఈ మొత్తం వ్యవహారంపై రెవెన్యూ శాఖ మంత్రికి ఫిర్యాదు వెళ్లడంతో మార్కాపురం సబ్‌కలెక్టర్‌ నేతృత్వంలో మార్కాపురం తహసీల్దార్‌, డీఐ, దోర్నాల సర్వేయర్‌లతో విచారణ కమిటీ వేసి నివేదిక తెప్పించుకున్నారు. ఆ వివరాల ప్రకారం తహసీల్దార్‌ వేణుగోపాలరావుతోపాటు అప్పటి రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌, ఇప్పుడు సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో ఎన్నికల విభాగం సీనియర్‌ అసిస్టెంట్‌గా ఉన్న వి.నాగేశ్వరరావు, అప్పటి ఐనముక్కల వీఆర్వో ప్రస్తుతం దోర్నాల-2 వీఆర్వోగా ఉన్న పి.రవికుమార్‌లను బాధ్యులనుగా పేర్కొంటూ రెవెన్యూ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జి.సాయిప్రసాద్‌ 10రోజుల్లోపు వివరణ కోరారు. వారిపై వచ్చిన అభియోగాలను అంగీకరిస్తున్నారా? లేదా? అని లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలని పేర్కొన్నారు. గడువులోపు వివరణ ఇవ్వకపోతే వచ్చిన అభియోగాలపై ఉన్న ఆధారాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తహసీల్దార్‌ వేణుగోపాలరావు ఉద్యోగ విమరణ చేసినప్పటికీ సర్వీస్‌ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా అధికారికంగా ఆయనపై శాఖాపరమైన విచారణ మొదలుపెట్టాలని ప్రతిపాదిస్తామని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

తాజాగా సీఎస్‌పురం పూర్వ తహసీల్దార్‌కు నోటీసులు

రెండు రోజుల క్రితం సీఎస్‌పురం పూర్వ తహసీల్దార్‌ మెర్సీకుమారి, డిప్యూటీ తహసీల్దార్‌ వెంకటేశ్వర్లుకు నోటీసులు జారీ అయ్యాయి. 2016 నుంచి 2017 సెప్టెంబరు వరకు పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన తహసీల్దార్‌, 2018 జూన్‌ 30 వరకు పనిచేసి ఉద్యోగ విరమణ చేసిన డిప్యూటీ తహసీల్దార్‌ ఇద్దరిపై వచ్చిన అభియోగాలపై వివరణ కోరారు. వారు పనిచేసిన సమయంలో ఉద్యోగులపై పర్యవేక్షణలోపం, విచ్చలవిడిగా అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. అప్పట్లో ఒక వీఆర్వో కూడా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. వీటితోపాటు పలు అభియోగాలపై విచారణ ముగిసిన అనంతరం వారి నుంచి 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని, లేకుంటే తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇలా పలువురు పూర్వ తహసీల్దార్‌లకు ఇటీవల వరుసగా వస్తున్న తాఖీదులతో రెవెన్యూ ఉద్యోగుల్లో కలకలం మొదలైంది. తప్పుచేసిన వారు ఎప్పటికైనా తప్పించుకోలేరనే సంగతి ఈ ఘటనల ద్వారా రుజువవుతోంది. ఇంకా కొందరిపై విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం.

Updated Date - Dec 03 , 2025 | 02:41 AM