వెలిగొండకు మరోసారి మంత్రి నిమ్మల
ABN , Publish Date - Dec 09 , 2025 | 02:13 AM
రాష్ట్ర జలవ నరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మరోసారి వెలిగొండ ప్రాజెక్టు సందర్శనకు వస్తున్నారు. మంగళవారం రాత్రికి దోర్నాల చేరుకుని బుధవారం ఉదయం ప్రాజెక్టు పనులు పరిశీలించడంతోపాటు అధికారులు, పనులు చేస్తున్న ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్ష చేస్తారు.
నేటి రాత్రి దోర్నాలకు వచ్చి బస
రేపు పనుల పరిశీలన, అధికారులతో సమీక్ష
నెలలో మూడోసారి రాక
ప్రాజెక్టు తొలిదశ పూర్తిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
ఒంగోలు, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర జలవ నరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మరోసారి వెలిగొండ ప్రాజెక్టు సందర్శనకు వస్తున్నారు. మంగళవారం రాత్రికి దోర్నాల చేరుకుని బుధవారం ఉదయం ప్రాజెక్టు పనులు పరిశీలించడంతోపాటు అధికారులు, పనులు చేస్తున్న ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్ష చేస్తారు. ఆమేరకు సంబంధిత అధికారులకు సమాచారం అందింది. వెలిగొండ తొలిదశను వచ్చే ఏడాది జూన్ నాటికి ఎట్టి పరిస్థితుల్లో పూర్తిచేయాలన్న సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రి నిమ్మల ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించారు. గత నెలలో వరుసగా రెండుసార్లు ప్రాజెక్టును సందర్శించారు. అంతకుముందు సీఎం ఉన్నత స్థాయి సమీక్షలలో చేసిన నిర్ణయాలకు అనుగుణంగా పనుల పురోగతిపై నిరంతరం ఇక్కడి అధికారులతో ఆయన పర్యవేక్షిస్తున్నారు.
మొంథాతో నిలిచిన పనులు
అక్టోబరు ఆఖరులో జిల్లాలో జలప్రళయం సృష్టించిన మొంథా తుఫాన్ కారణంగా వెలిగొండ పనులు కూడా నిలిచిపోయాయి. లైనింగ్ జరుగుతున్న రెండో టన్నెల్‌లోకి భారీగా వరదనీరు చేరింది. అలాగే కీలకమైన ఫీడర్ కాలువకు అనేకచోట్ల భారీగా గండ్లుపడ్డాయి. ఈ నేపథ్యంలో నవంబరు 7న వెలిగొండను సందర్శించిన మంత్రి నిమ్మల సంబంధిత ఆటంకాలను పరిశీలించి తక్షణ చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. మళ్లీ వచ్చి పరిశీలిస్తానని, ఆలోపు తిరిగి పనులు ప్రారంభించాలని ఆదేశించారు. దీంతో అధికారులు, ఉరుకులు పరుగులతో అత్యవసర పనులు చేపట్టి టన్నెల్‌లో నీటి తొలగింపు, ఫీడర్ కాలువ గండ్లు పూడ్చివేత, మేట వేసిన మట్టి తొలగింపు తదితర పనులను కొలిక్కి తెచ్చారు. చెప్పినట్లు తిరిగి నవంబరు 12న మంత్రి నిమ్మల వెలిగొండ పనుల పరిశీలన కోసం వచ్చారు. తాను ఆశించిన విధంగా పనులు పూర్తికాలేదని అసహనం వ్యక్తం చేసి మరికొన్ని సూచనలు ప్రాజెక్టు అధికారులకు చేశారు. తదనుగుణంగా చర్యలను వారు తీసుకొన్నారు. ప్రస్తుతం టన్నెల్-2లో లైనింగ్ పనులు సాగుతున్నాయి.
రేపు మరోసారి పరిశీలన
ఫీడర్ కాలువ ఆధునికీకరణకు సంబంధించి టెండరు ప్రక్రియ పూర్తయి పనులు చేపట్టేందుకు ఏజెన్సీ ప్రతినిధులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈనేపథ్యంలో మంత్రి నిమ్మల రామానాయుడు మరోసారి వెలిగొండకు వస్తున్నారు. అందిన సమాచారం మేరకు ఆయన మంగళవారం సాయంత్రం విజయవాడలో బయల్దేరి రాత్రికి దోర్నాల చేరుకొని బస చేస్తారు. బుధవారం ఉదయం వెలిగొండ పనులను పరిశీలిస్తారు. అధికారుల, ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహిస్తారు. తిరిగి విజయవాడ వెళ్తారు. ఆ మేరకు సమాచారం అందుకున్న జలవనరుల శాఖ అధికారులు తదనుగుణ ఏర్పాట్లపై దృష్టిసారించారు.