రేపు అమ్మనబ్రోలుకు మంత్రి లోకేష్
ABN , Publish Date - May 14 , 2025 | 01:10 AM
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గురువారం నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలుకు రానున్నారు. ఇటీవల దారుణ హత్యకు గురైన టీడీపీ నేత, మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి కుటుంబాన్ని పరామర్శించనున్నారు.
వీరయ్యచౌదరి కుటుంబానికి పరామర్శ
ఒంగోలు, మే 13 (ఆంధ్రజ్యోతి) : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గురువారం నాగులుప్పలపాడు మండలం అమ్మనబ్రోలుకు రానున్నారు. ఇటీవల దారుణ హత్యకు గురైన టీడీపీ నేత, మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి కుటుంబాన్ని పరామర్శించనున్నారు. గతనెల 22వ తేదీ రాత్రి వీరయ్య చౌదరి ఒంగోలులోని తన కార్యాలయంలో హత్యకు గురైన విషయం విదితమే. ఆమరుసటి రోజున స్వగ్రామమైన అమ్మనబ్రోలులో అంత్యక్రియలు జరగ్గా టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వచ్చి వీరయ్య చౌదరికి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈనెల 8న నిర్వహించిన వీరయ్యచౌదరి దశదిన కర్మకు మంత్రి నారా లోకేష్ వస్తారని ప్రచారం జరిగింది. ఆరోజున రాష్ట్రమంత్రి వర్గసమావేశం ఉండటంతో రాలేకపోయారని సమాచారం. ఈనేపథ్యంలో గురువారం ఆయన వీరయ్యచౌదరి కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తున్నారు. ఆ మేరకు అధికారికంగా ఇటు పార్టీ నేతలకు, అటు అధికార యంత్రాంగానికి సమాచారం అందింది. లోకేష్ గురువారం ఉదయం 8గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయల్దేరి 8.45 గంటలకు నాగులుప్పలపాడు మండలం చదలవాడ వద్ద ఉన్న హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి 9 గంటలకు బయల్దేరి 9.20 గంటలకు అమ్మనబ్రోలుకు వెళ్తారు. 9.30 నుంచి 10 గంటల వరకూ వీరయ్య చౌదరి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. తిరిగి 10.50 గంటలకు చదలవాడ హెలిప్యాడ్‌కు చేరుకొని 11 గంటలకు హెలికాప్టర్‌లో అనంతపురం జిల్లా గుత్తికి వెళ్తారు.