Share News

మినీబైపాస్‌ రహదారి పనులు వేగవంతం

ABN , Publish Date - Dec 28 , 2025 | 11:25 PM

అద్దంకి పట్టణంలో మినీబైపాస్‌ గ్రావెల్‌రోడ్డు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. సంక్రాంతి నాటికి గ్రావెల్‌ రోడ్డు పూర్తిచేసే విధంగా పనుల్లో వేగం పెంచారు.

మినీబైపాస్‌ రహదారి పనులు వేగవంతం

అద్దంకి, డిసెంబరు28 (ఆంధ్రజ్యోతి): అద్దంకి పట్టణంలో మినీబైపాస్‌ గ్రావెల్‌రోడ్డు పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. సంక్రాంతి నాటికి గ్రావెల్‌ రోడ్డు పూర్తిచేసే విధంగా పనుల్లో వేగం పెంచారు. పట్టణంలోని కాకానిపాలెం నుంచి నామ్‌ రోడ్డులో సూర్య రెస్టారెంట్‌ వద్ద కలిసేలా సుమారు 1.5 కి.మీ దూరం అద్దంకి మేజర్‌ కాలువను మినీ బైపాస్‌ చేయాలన్న ఆలోచన కొంత కాలంగా ఉంది. దీంతో విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే కాలువ కట్టలపై ఆ క్రమణలు తొలగింపు పూర్తి కాగా, గ్రావెల్‌ రోడ్డు పనులు ప్రారంభించారు. ఇళ్లు తొలగించిన తరువాత వాటి శిథిలాలను తరలిస్తూ అద్దంకి కొండ నుంచి గ్రావెల్‌ తరలించి రోడ్డు నిర్మిస్తున్నారు. అద్దంకి మేజర్‌ కాలువ వెడల్పు 70 అడుగుల నుండి 100 అడుగుల వరకు ఉండడంతో ముందుగా గ్రావెల్‌ మొత్తం చదును చేస్తున్నారు. సంక్రాంతి నాటికి గ్రావెల్‌ రోడ్డు నిర్మాణం పూర్తి చేసి వాహనాల రాకపోకలు సాగించేలా చేయలన్న తలంపుతో పనులు చేస్తున్నారు. జిల్లా సర్వేయర్‌ ద్వారా అద్దంకి మేజర్‌ కాలువ మొత్తం వెడల్పును సర్వే చేయించి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయనున్నారు. గ్రావెల్‌ రోడ్డు నిర్మాణం పనులు ఒక వైపు చేస్తుండగా మరో వైపు సీసీ రోడ్డు నిర్మాణానికి అవసరమైన రూ.15 కోట్ల నిధులు మంజూరైన వెంటనే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసేందుకు అడుగులు పడుతున్నాయి. 70 అడుగుల వెడల్పులో మధ్యలో సుమారు 10 అడుగుల వెడల్పుతో సాగర్‌ కాలువ ఏర్పాటు చేసి, రెండు వైపులా సీసీ రోడ్డు నిర్మించనున్నారు. సీసీ రోడ్డుకు పక్కనే రెండు వైపుల ఆయా కాలనీల నుంచి వచ్చే మురుగు నీరు పారుదల కు వీలుగా సైడ్‌ డ్రైన్‌ ల నిర్మాణం చేపట్టనున్నారు. అదే సమయంలో రెండు వైపులా విద్యుత్‌ లైన్‌ లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. కొన్ని చోట్ల ఎన్‌ఎస్‌పీ స్థలం 100 అడుగుల వరకు ఉండడంతో మినీ బైపాస్‌కు పోను మిగిలిన స్థలాన్ని భవిష్యత్తు అవసరాలకు, ఇతర అవసరాలకు వినియోగించే విధంగా అన్ని ముందస్తు చర్యలు చేపట్టేందుకు సిద్దం అవుతున్నారు. గత అనుభవాలను గుర్తుంచుకొని భవిష్యత్తులో ఒక్క అడుగు స్థలం కూడా ఆక్రమణ కు గురికాకుండా ఉండే విధంగా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. సంక్రాంతి నాటికి గ్రావెల్‌ రోడ్డు నిర్మాణం పూర్తయి తాత్కాలికంగా వాహనాల రాకపోకలు సాగించే అవకాశం ఉంది. తొలివిడత మినీబైపాస్‌ రోడ్డు నిర్మాణం పూర్తయిన తరువాత రెండవ విడతలో కాకానిపాలెం నుంచి టిడ్కో గృహాల మీదుగా శింగరకొండ సమీపంలోని 99 అడుగుల అభయాంజనేయస్వామి వి గ్రహం వద్ద నామ్‌ రోడ్డు లో కలిపే విధంగా తారు రోడ్డు నిర్మాణం చేయనున్నారు.

Updated Date - Dec 28 , 2025 | 11:25 PM