వలస కార్మికులు విలవిల
ABN , Publish Date - Oct 05 , 2025 | 11:06 PM
గనుల సీనరేజీ వసూలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గ్రానైట్ ఫ్యాక్టరీ యజమానులు చేపట్టిన నిరవధిక సమ్మె వలస కార్మికులపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
గ్రానైట్ ఫ్యాక్టరీ యజమానుల నిరవధిక సమ్మెతో ఉపాధి కరువు
పూట గడవక ఇబ్బందులు
కొందరు సొంత రాష్ట్రాలకు పయనం
చీమకుర్తి, అక్టోబరు5 (ఆంధ్రజ్యోతి) : గనుల సీనరేజీ వసూలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గ్రానైట్ ఫ్యాక్టరీ యజమానులు చేపట్టిన నిరవధిక సమ్మె వలస కార్మికులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఐదురోజుల నుంచి పనులు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో పొట్ట చేతపట్టుకొని ఇతర రాష్ర్టాల నుంచి ఉపాధి కోసం ఇక్కడికి వచ్చిన వారికి పూట గడవని దుస్థితి నెలకొంది. చీమకుర్తి, రామతీర్థం, మర్రిచెట్లపాలెం, బూదవాడ పరిసర ప్రాంతాల్లో దాదాపు 800 గ్రానైట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. వీటిల్లో దాదాపు పది వేల మందికిపైగా వలస కార్మికులు, మరో పది వేల మంది ఇతర కార్మికులు పనిచేస్తున్నారు. వలస కార్మికులంతా కాంట్రాక్ట్ పద్ధతిపై వచ్చిన వారు కావడంతో రాయి కటింగ్ చేసిన మేరకు మాత్రమే వారికి వేతనం అందుతుంది. ఈ పరిస్థితుల్లో ఈనెల ఒకటో తేదీ నుంచి గ్రానైట్ ఫ్యాక్టరీ ఓనర్లు తమ ఫ్యాక్టరీలను షట్‌డౌన్ చేశారు. దీంతో వలస కార్మికుల పరిస్థితి అగమ్మగోచరంగా మారింది. వీరిలో రాజస్థాన్, ఒడిసా, జార్ఖండ్, బిహార్ తదితర ప్రాంతాల నుంచి వచ్చినవారు ఎక్కువగా ఉన్నారు. రాజస్థాన్‌కు చెందిన కార్మికుల్లో చాలా మంది ఇక్కడ నెలకొన్న క్లిష్ఠ పరిస్థితులను గమనించి తిరుగుముఖం పట్టారు. మిగతా వారు తమ పరిస్థితి ఏమిటని బిక్కుబిక్కుమంటూ చూస్తున్నారు. గత కరోనా కాలంలో ఫ్యాక్టరీలు మూతపడిన సమయంలో భారీ స్థాయిలో వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లిపోయారు. మళ్లీ ఇప్పుడు అదే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఫ్యాక్టరీ ఓనర్లు సైతం ఆందోళన చెందుతున్నారు.
సీఐటీయూ నాయకుల పరామర్శ
గ్రానైట్ ఫ్యాక్టరీలు మూతపడటంతో వాటిలో ఉండాల్సిన కాంట్రాక్ట్ కార్మికులు అద్దె గదుల్లో ఉండాల్సి వస్తోంది. పూటగడవడం కష్టంగా మారింది. తమ పరిస్థితి ఏమిటా అని దిగాలుగా ఉన్న కార్మికులను సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు, జిల్లా కార్యదర్శి పల్లాపల్లి ఆంజనేయులు పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా సుబ్బారావు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని గ్రానైట్ పరిశ్రమలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులను పరిష్కరించాలని కోరారు. వలస కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
సమ్మెకు ఎడ్జ్ కటింగ్ ఫ్యాక్టరీ ఓనర్ల మద్దతు
గ్రానైట్ ఫ్యాక్టరీ యజమానుల సమ్మెకు ఎడ్జ్ కటింగ్ ఫ్యాక్టరీ (టూ బై ఓన్ కటింగ్ ఫ్యాక్టరీల) ఓనర్ల అసోసియేషన్ మద్దతు ప్రకటించింది. ఆదివారం రామతీర్థం వద్ద ఉన్న వీటీసీలో నిర్వహించిన సంఘ సమావేశానికి దాదాపు 200 మంది హాజరై తమ సంఘీభావాన్ని తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. తాము కూడా సమ్మెలో పాల్గొంటామని స్పష్టం చేశారు.