ఒంగోలులో 7న మెగా ప్లాంటేషన్
ABN , Publish Date - Nov 05 , 2025 | 01:12 AM
ఒంగోలు నగర సుందరీకరణ, మౌలిక సౌకర్యాల మెరుగుపై దృష్టి సారించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మరో భారీ కార్యక్రమానికి సన్నాహాలు చేస్తున్నారు. నగరంలో పచ్చదనానికి ప్రాధాన్యం ఇస్తూ పెద్దఎత్తున మొక్కలు నాటేందుకు సిద్ధమయ్యారు.
విద్యార్థుల భాగస్వామ్యంతో ఒకేరోజు ఐదువేల మొక్కలు
ప్రధాన రోడ్ల వెంట నాటేలా ఎమ్మెల్యే జనార్దన్ ప్రణాళిక
పాల్గొననున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు
ఒంగోలు, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలు నగర సుందరీకరణ, మౌలిక సౌకర్యాల మెరుగుపై దృష్టి సారించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మరో భారీ కార్యక్రమానికి సన్నాహాలు చేస్తున్నారు. నగరంలో పచ్చదనానికి ప్రాధాన్యం ఇస్తూ పెద్దఎత్తున మొక్కలు నాటేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 7న నగరంలో ఒకే రోజు ఐదువేల మొక్కలు నాటేలా కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఒక్కో విద్యార్థి ఒక్కో మొక్కను ఏకకాలంలో నాటేలా నగరంలోని డిగ్రీ, ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలతో మాట్లాడారు. ఆ విధంగా వేలాది మందిని కార్యక్రమంలో భాగస్వాములను చేస్తున్నారు. నగరంలోని మంగమూరు రోడ్డు, గుంటూరు రోడ్డు కొత్తపట్నం రోడ్డు.. ఇలా మొత్తం ఎనిమిది ప్రధాన రోడ్లలో మొక్కలు నాటనున్నారు. ఆ కార్యక్రమంలో జిల్లాలోని కీలక ప్రజాప్రతినిఽధు లంతా పాల్గొననున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై కార్పొరేషన్ అధికారులు దృష్టి సారించారు. తొలుత గతనెల 24న మెగా ప్లాంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆ రోజున డీఆర్సీ సమావేశం ఉండటంతో ఇన్‌చార్జి మంత్రి, జిల్లాకు చెందిన మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు హాజరవుతారని వారందరితో మొక్కలు నాటించాలని భావించారు. అయితే ఆ సమావేశం వాయిదా పడటంతోపాటు మొంథా తుఫాన్ ఆ సమయంలో నగరాన్ని ముంచెత్తడంతో కార్యక్రమం వాయిదా పడింది. తిరిగి ఈనెల 7న డీఆర్సీ సమావేశం జరగనుంది. ఇన్‌చార్జి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, జిల్లాకు చెందిన మంత్రి డాక్టర్ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, జిల్లాలోని ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నేతలు ఆ సమావేశానికి వస్తున్నారు. దీంతో ఆ సమావేశం లోపు వారందరూ మొక్కలు నాటేలా ఎమ్మెల్యే జనార్దన్ కార్యక్రమాన్ని రూపొందించారు.
ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు
వేలాదిమంది విద్యార్థులు పాల్గొనే అవకాశం ఉండటంతో ప్రణాళికాబద్ధంగా కార్యక్రమ నిర్వహణపై కార్పొరేషన్ అధికారులు దృష్టి సారించారు. రోడ్లు అత్యధిక భాగం సిమెంట్‌వి కాగా వాటికి ఇరువైపులా ఎక్కడ మొక్కలు నాటాలన్నది గుర్తించి మిషన్ల ద్వారా కటింగ్ చేసి గుంతలు తీస్తున్నారు. అలాగే పలు కళాశాలల యాజమాన్యాలతో మంగళవారం కమిషనర్ వెంకటేశ్వరరావు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఏ కాలేజీ నుంచి ఎంతమంది విద్యార్థులు హాజరవుతారు, ఏ కాలేజీ వారు ఏ రోడ్డులో మొక్కలు నాటాలన్న దానిపై చర్చించారు. ఒక్కో బస్సులో 50 మంది కాలేజీ విద్యార్థులు వస్తే వారికి కాలేజీ నుంచి ఒకరు, కార్పొరేషన్ నుంచి ఒకరు సిబ్బంది అందుబాటులో ఉండి మొక్కలను క్రమపద్ధతిలో నాటించేలా షెడ్యూల్‌ను సిద్ధం చేస్తున్నారు. అలాగే మొక్కలు నాటే రోడ్డులో ట్యాంకర్లతో నీరు, ట్రాక్టర్ ద్వారా మట్టి అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకున్నారు. నగరంలో పచ్చదనం పెంపు కోసం చేపడుతున్న ఈ బృహత్తర కార్యక్రమానికి ప్రజలంతా సహకరించాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కోరారు.