ఆ రైతులకూ అన్నదాత సుఖీభవ..!
ABN , Publish Date - Nov 26 , 2025 | 11:04 PM
రాష్ట్ర వ్యాప్తంగా అగ్రహారం, ఈనామ్ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు మొదటి విడతలో అన్నదాత సుఖీభవ నిధులు జమకాలేదు. ఈ కారణంగా అద్దంకి నియోజకవర్గంలోని సంతమాగులూరు, బల్లికురవ మండలాలలోని అగ్రహారం, ఇనామ్ భూములు సాగు చేసుకుంటున్న రైతులు నిరుత్సాహానికి గురయ్యారు.
ఈనామ్, అగ్రహారం భూములు సాగు చేసుకునే వారికి ఊరట
1,434 మంది ఖాతాల్లో రూ.1.43 కోట్ల జమ
రెండు విడతల నగదు ఒకేసారి..
హర్షం వ్యక్తం చేస్తున్న పలు గ్రామాల రైతులు
ప్రత్యేక దృష్టి సారించి నిధులు విడుదల చేయించిన గొట్టిపాటి
అద్దంకి, నవంబరు 26(ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర వ్యాప్తంగా అగ్రహారం, ఈనామ్ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు మొదటి విడతలో అన్నదాత సుఖీభవ నిధులు జమకాలేదు. ఈ కారణంగా అద్దంకి నియోజకవర్గంలోని సంతమాగులూరు, బల్లికురవ మండలాలలోని అగ్రహారం, ఇనామ్ భూములు సాగు చేసుకుంటున్న రైతులు నిరుత్సాహానికి గురయ్యారు. ఈ విషయాన్ని వారు విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ దృష్టికి తీసుకుపోయారు. దీనిపై ప్రత్యేక దృష్టి సారించిన మంత్రి.. ఆ సమస్యను సీఎం చంద్రబాబునాయుడు, వ్యవసాయశాఖ మంత్రి అచ్చెనాయుడు దృష్టికి తీసుకుపోయారు. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఇచ్చే నగదును అగ్రహారం, ఇనామ్ భూములు సాగు చేసుకునే రైతులకు కూడా వర్తింపచేసేలా కృషి చేశారు. దీంతో మొదటి విడత, రెండవ విడత నిధులు ఒకేసారి జమ చేయించారు. రెండు విడతలకు కలిపి 10 వేల రూపాయలు జమయ్యాయి. ఇలా 1434 మంది రైతులకు 1.43 కోట్ల రూపాయలు రైతుల బ్యాంక్ ఖాతాలలో పడ్డాయి.
సంతమాగులూరు మండలంలోని కొమ్మాలపాడు, మక్కెనవారిపాలెంలలో మొత్తం 1,373 మంది రైతులు అగ్రహారం, ఇనామ్ భూములు సాగు చేసుకుంటుండగా వారిలో 976 మందికి 97.60 లక్షల రూపాయలు, బల్లికురవ మండలం చెన్నుపల్లిలో 879 మంది రైతులు ఉండగా 462 మందికి 46,20 లక్షల రూపాయలు జమయ్యాయి. సాంకేతిక కారణాలతో మరో 814 మంది రైతులకు ఇంకా నిధులు జమకాలేదు. క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపి అర్హులైన రైతులను గుర్తించి జాబితా తయారు చేయాలని విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారులను ఆదేశించారు. నిధులు జమ కాని వారిలో ఎక్కువ మంది ఉమ్మడి కుటుంబంలో సభ్యులుగా ఉండి ఒకే రేషన్ కార్డులో సభ్యులుగా ఉండటం, ఈకేవైసీ చేయించుకొని ఉండక పోవటం తదితర కారణాలతో నిధులు జమకాలేదని తెలుస్తుంది. అర్హుల జాబితా సిద్ధమైన తరువాత మంత్రి రవికుమార్ ప్రత్యేక దృష్టి సారించి అన్నదాత సుఖీభవ నిధులు జమచేయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. రెండు విడతల నిధులు ఒకే సారి బ్యాంక్ ఖాతాలలో జమ కావటంతో ఆయా గ్రామాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.