కనకదుర్గా కరుణించమ్మా
ABN , Publish Date - Sep 30 , 2025 | 10:41 PM
దసరా శరన్ననవరాత్రులను పురస్కరించుకుని అమ్మవార్లు మంగళవారం వివిధ రూపాల్లో భక్తలకు దర్శనం ఇచ్చారు. అర్చకులు శ్రీపతి అప్పనాచార్యులు రాజ్యలక్ష్మీ అమ్మవారి మూలవిరాట్ ఉత్సవ మూర్తికి అభిషేకాలు, అలంకరణ నిర్వహించారు.
మార్కాపురం వన్‌టౌన్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : దసరా శరన్ననవరాత్రులను పురస్కరించుకుని అమ్మవార్లు మంగళవారం వివిధ రూపాల్లో భక్తలకు దర్శనం ఇచ్చారు. అర్చకులు శ్రీపతి అప్పనాచార్యులు రాజ్యలక్ష్మీ అమ్మవారి మూలవిరాట్ ఉత్సవ మూర్తికి అభిషేకాలు, అలంకరణ నిర్వహించారు. శ్రీలక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో రాజ్యలక్ష్మి అమ్మవారు వేదలక్ష్మి అలంకారంలో దర్శనం ఇచ్చారు. ఈవో గొలమారి శ్రీనివాసరెడ్డి కార్యక్రమాలు పర్యవేక్షించారు. మార్కండేశ్వర స్వామి ఆలయంలో జగదాంబ మహాచండీ అలంకారంలో దర్శనమిచ్చారు. ఈవో ఈదుల చెన్నకేశవరెడ్డి భక్తులకు సౌకర్యాలు కల్పించారు. వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారు మహిషాసుర మర్దినిగా దర్శనమిచ్చారు. జవహర్ నగర్‌లోని ఆమలక లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో విజయలక్ష్మి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేశారు. ఆయా ఆలయాల వద్ద పెద్దఎత్తున ప్రసాద పంపిణీ నిర్వహించారు.
త్రిపురాంతకం : శ్రీ త్రిపురాంతకేశ్వరస్వామి శ్రీమత్ బాలా త్రిపురసుందరీదేవి అమ్మవారి దేవస్థానంలో దసరా శరన్నవరాత్రుల్లో అమ్మవారు మంగళవారం మహాదుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై పూజల్లో పాల్గొన్నారు. మహాదుర్గగా అమ్మవారు నందివాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
కంభం : దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా శ్రీ కోట సత్యమాంబ దేవి మహిషాసుర మర్దిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి దేవి 9వ రోజు మంగళవారం దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
మార్కాపురం రూరల్ : జమ్మనపల్లి గ్రామంలో ని ముద్దసానమ్మ ఆలయంలో అమ్మవారు మహిషాసుర మర్దిని అలంకణలో దర్శనమిచ్చారు.
తర్లుపాడు : మండలంలోని నాగెళ్లముడుపులోని శ్రీమత్ పర్వత వర్దిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో అమ్మవారు దుర్గాదేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. వేదపండితులు గణవరపు శర్మ, దేవులపల్లి పవర్ కుమార్ శర్మ, శ్రీధర్ సుబ్రహ్మణ్యం, ఓరుగంటి శివకుమార్ శర్మ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ధర్మకర్త కూనంపులి కుమార్ భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు.
గిద్దలూరు దసరా నవరాత్రుల్లో భాగంగా మంగళవారం శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో దుర్గాష్టమి వేడుకలు వైభవంగా జరిగాయి. అమ్మవారు మహిషాసుర మర్దినిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈసందర్భంగా దుర్గాష్టమి వేషధారణలతో చేసిన ప్రదర్శనలు అందరినీ అలరించాయి. రాత్రి బొమ్మ దున్నుపోతును నరికి వేడుకలు నిర్వహించారు. షరాఫ్ బజారులోని శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో స్వామి వారు కృష్ణావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
పెద్దదోర్నాల : వాసవీదేవి అమ్మవారు దుర్గాదేవి అలంకారంలోదర్శనమిచ్చారు.పోలేరమ్మ, సాయిబాబా, శ్రీ చౌడేశ్వరిదేవి ఆలయాల్లో అమ్మవారు పూజలందుకున్నారు.
రాచర్ల : దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు మంగళవారం శ్రీ దుర్గాదేవిగా దర్శనమిచ్చారు. మండల కేంద్రమైన రాచర్ల శ్రీ పట్టాభి రామాలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారికి పూజలు చేసి తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.
వాసవీ మాతకు పట్టువస్త్రాల సమర్పణ
కొమరోలు : అమ్మ దయతో ప్రజలంతా ఆరోగ్యంగా.. ఆనందంగా ఉండాలని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ప్రార్థించారు. శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో మంగళవారం ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి, సతీమణి పుష్పలీల ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయ అధ్యక్షుడు తుమ్మలపెంట వెంకటరమణ, పూజారి గౌరిపెద్ది హరిశర్మ, ఆర్యవైశ్య సంఘం నాయకులు పూర్ణకుంభంతో ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అశోక్‌రెడ్డి దంపతులు అమ్మవారికి పట్టువస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ఆర్యవైశ్య, యువజన, వర్తక సంఘం, కిరాణామర్చంట్ వంటి వివిద సంఘాల నాయకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కొమరోలు, ఇడమకుల్లు సొసైటీ అధ్యక్షుడు ముత్తుముల సంజీవరెడ్డి, బిజ్జం రవింద్రారెడ్డి, ఏఎంసీ చైర్మన్ బాలయ్య, ఉపాధ్యక్షుడు ఓబుల్‌రెడ్డి, డైరెక్టర్ తిరుమలరెడ్డి, నాయకులు పులకుర్తి వెంకటేశ్వర్లు, శ్రీనివాసచౌదరి, పార్టీనాయకలు, కార్యకర్తలు పాల్గొన్నారు.