Share News

భారీగా స్కూల్‌ అసిస్టెంట్ల బదిలీ

ABN , Publish Date - Jun 08 , 2025 | 02:04 AM

ఉమ్మడి జిల్లాలో భారీగా స్కూలు అసిస్టెంట్లకు స్థానచలనం కలిగింది. మొత్తం 2,205 మంది బదిలీ అయ్యారు. జిల్లాలో మూడో వంతు యూపీ స్కూళ్లను ప్రాథమిక పాఠశాలలుగా డౌన్‌గ్రేడ్‌ చేయడం, హైస్కూళ్లలోని 3, 4, 5 తరగతులను వెనక్కు పంపడంతో వందల సంఖ్యలో స్కూలు అసిస్టెంట్లు మిగులుగా తేలారు.

భారీగా స్కూల్‌ అసిస్టెంట్ల బదిలీ

2,205 మందికి స్థానచలనం

నేడు రిలీవ్‌ కావాలని ఉత్తర్వులు

ఒంగోలు విద్య, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి జిల్లాలో భారీగా స్కూలు అసిస్టెంట్లకు స్థానచలనం కలిగింది. మొత్తం 2,205 మంది బదిలీ అయ్యారు. జిల్లాలో మూడో వంతు యూపీ స్కూళ్లను ప్రాథమిక పాఠశాలలుగా డౌన్‌గ్రేడ్‌ చేయడం, హైస్కూళ్లలోని 3, 4, 5 తరగతులను వెనక్కు పంపడంతో వందల సంఖ్యలో స్కూలు అసిస్టెంట్లు మిగులుగా తేలారు. దీంతో వారు తప్పనిసరిగా బదిలీ కావాల్సి వచ్చింది. ఒకే పాఠశాలలో ఎనిమిదేళ్లు పూర్తయిన వారు, పునర్విభజనలో మిగులుగా తేలిన వారు సుమారు 1,600మంది కూడా విధిగా బదిలీ కావాల్సి వచ్చింది. మిగులుగా తేలిన వారిలో 404 మంది స్కూలు అసిస్టెంట్లను ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎంలుగా సర్దుబాటు చేశారు. ఈనేపథ్యంలో స్కూలు అసిస్టెంట్లు మొత్తం 2,929 మంది బదిలీకి దరఖాస్తు చేశారు. వీటిలో 14 దరఖాస్తులను వివిధ కారణాలతో తిరస్కరించారు. బదిలీ అయిన వారిలో స్కూలు అసిస్టెంట్‌ తెలుగు 181మంది, హిందీ 233, ఇంగ్లీషు 223. సంస్కృతం నలుగురు, ఉర్దూ ఆరుగురు, గణితం 282 మంది, ఫిజికల్‌ సైన్స్‌ 365, బయోలాజికల్‌ సైన్స్‌ 200, సోషల్‌ 164, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ 9, పీఎస్‌ హెచ్‌ఎంలుగా 404 మంది మొత్తం 2,205 మంది స్థానాలు మారారు. బదిలీ ఉత్తర్వులు అందుకున్న స్కూలు అసిస్టెంట్లంతా ఆదివారం సాయంత్రం ప్రస్తుతం వారు పనిచేస్తున్న స్థానాల నుంచి రిలీవ్‌ అయ్యి సోమవారం బదిలీ అయిన కొత్త స్థానాల్లో చేరాలని డీఈవో కిరణ్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - Jun 08 , 2025 | 02:04 AM