కదిలిన బీజేపీ
ABN , Publish Date - Aug 07 , 2025 | 02:29 AM
జిల్లాలోని బీజేపీ నేతలు, కార్యకర్తల్లో అనూహ్యమైన కదలిక కనిపిస్తోంది. ఒకరికొకరు పోటీపడి పార్టీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడి పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు మాధవ్ కూడా ఇలా వచ్చారు.. అలా వెళ్లారు అన్నట్లు కాకుండా రోజంతా ఒంగోలులోనే ఉండి ఇటు పార్టీ శ్రేణులతోపాటు అటు ప్రజల్లో కలిసే వినూత్న కార్యక్రమాలకు సిద్ధమయ్యారు.
నేడు నగరంలో రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పర్యటన
వివిధ కార్యక్రమాలు.. భారీ ఏర్పాట్లు
ఒంగోలు చేరిన ఆయనకు ఘనస్వాగతం పలికిన కమలదళం
ఆంధ్రజ్యోతి, ఒంగోలు
జిల్లాలోని బీజేపీ నేతలు, కార్యకర్తల్లో అనూహ్యమైన కదలిక కనిపిస్తోంది. ఒకరికొకరు పోటీపడి పార్టీ రాష్ట్ర కొత్త అధ్యక్షుడి పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు మాధవ్ కూడా ఇలా వచ్చారు.. అలా వెళ్లారు అన్నట్లు కాకుండా రోజంతా ఒంగోలులోనే ఉండి ఇటు పార్టీ శ్రేణులతోపాటు అటు ప్రజల్లో కలిసే వినూత్న కార్యక్రమాలకు సిద్ధమయ్యారు. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వీవీఎన్ మాధవ్ జిల్లాల పర్యటనలకు శ్రీకారం పలికారు. అందులో భాగంగా ఎన్నడూలేని విధంగా బీజేపీ జిల్లా నాయకులు, కార్యకర్తలు కదిలి ఆయనకు స్వాగతం పలికారు. బుధవారం రాత్రి 10.30 నిమిషాల సమయంలో ఒంగోలు వచ్చిన మాధవ్‌కు నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. గురువారం ఉదయం 6 గంటలకే ఆయన కార్యక్రమాలకు శ్రీకారం పలకనున్నారు. చాయ్ పే చర్చ పేరుతో ఉదయం 6 గంటలకు విందు భోజనం హోటల్ వద్ద అక్కడ వారితో మమేకం కానున్నారు. సుమారు గంట సేపు అక్కడ గడుపుతారు. ఆతర్వాత 10 గంటలకు లాయరుపేట సమీపంలోని ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాల వేస్తారు. అక్కడ్నుంచి పాత మార్కెట్ సెంటర్ వద్దకెళ్లి అక్కడ నుంచి జరిగే ర్యాలీలో పాల్గొంటారు. అనంతరం రిమ్స్ సమీపంలో ఉన్న ఎంఎస్ ఫంక్షన్ హాలులో జరిగే జిల్లా కార్యకర్తల విస్తృత సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు వల్లూరు వద్ద హైవే సమీపంలో ఉన్న హోటల్‌లో మేథావుల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం పార్టీలోని నేతల ఇంట్లోనే భోజనం చేసి రాత్రికి బస చేసి మరుసటి రోజు నెల్లూరు వెళతారు. ఆయన గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అటు ప్రజలు, ఇటు పార్టీ శ్రేణులతో గడిపేందుకు సమయం కేటాయించడం విశేషం. కాగా జిల్లా బీజేపీలో ఎన్నడూలేని ఉత్సాహం కనిపిస్తోంది. క్విస్ విద్యా సంస్థల అధిపతి డాక్టర్ నిడమానూరి కల్యాణ్‌చక్రవర్తి ఆపార్టీలో చేరిన తర్వాత జిల్లాలో కార్యక్రమాలు పుంజుకున్నాయి. ఆ విషయాన్ని గుర్తించిన అధిష్ఠానం ఆయనకు పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో స్థానం కల్పించి ప్రోత్సహించింది. ఆయనతోపాటు 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు, మాజీ అధ్యక్షుడు శివారెడ్డి, ఒంగోలు పార్టీ ఇన్‌చార్జి యోగయ్యయాదవ్ తదితరులు కలిసికట్టుగా పార్టీ శ్రేణులను , అభిమానులను కదిలించి మాధవ్ కార్యక్రమాల జయప్రదానికి సన్నద్ధం చేశారు