Share News

పశ్చిమాన అపార నష్టం

ABN , Publish Date - Oct 28 , 2025 | 01:21 AM

జిల్లాలోని పశ్చిమ రైతులు ఇటీవలి వర్షాలకు తీవ్రంగా నష్టపోయారు. ఆ ప్రాంతంలో ఖరీఫ్‌ సీజన్‌లో వేసిన పంటలలో అత్యధిక భాగం దెబ్బతిన్నాయి. అల్పపీడన ప్రభావంతో ఈనెల 22 నుంచి 25 వరకు నాలుగు రోజుల పాటు విస్తారంగా కురిసిన వర్షాలతో ఆ ప్రాంతంలోని పత్తి, మిర్చి, పొగాకు, సజ్జ ఇతర పంటలకు నష్టం వాటిల్లింది.

పశ్చిమాన అపార నష్టం
రాచర్ల మండలం రామాపురం వద్ద పత్తి చేలో నిలిచి ఉన్న నీరు

ఉరకెత్తుతున్న పత్తి, మిర్చి, పొగాకు పంటలు

మొలకెత్తుతున్న సజ్జ

తాజా వర్షాలతో మరింత నష్టం

ఆందోళన చెందుతున్న రైతులు

ఒంగోలు, అక్టోబరు 27 (ఆంఽధ్రజ్యోతి) : జిల్లాలోని పశ్చిమ రైతులు ఇటీవలి వర్షాలకు తీవ్రంగా నష్టపోయారు. ఆ ప్రాంతంలో ఖరీఫ్‌ సీజన్‌లో వేసిన పంటలలో అత్యధిక భాగం దెబ్బతిన్నాయి. అల్పపీడన ప్రభావంతో ఈనెల 22 నుంచి 25 వరకు నాలుగు రోజుల పాటు విస్తారంగా కురిసిన వర్షాలతో ఆ ప్రాంతంలోని పత్తి, మిర్చి, పొగాకు, సజ్జ ఇతర పంటలకు నష్టం వాటిల్లింది. ప్రాథమికంగా ఆ వర్షాలకు జిల్లాలోని 21 మండలాల్లోని 156 గ్రామాల్లో 8,888 మంది రైతులకు చెందిన దాదాపు 2వేల ఎకరాలలో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. అందులో 90శాతం పంటలు పశ్చిమ ప్రాంతంలోనే ఉన్నాయి. బాగా దెబ్బతిన్న వాటిలో ఒక్క పత్తి పంటే ఇంచుమించు 14వేల ఎకరాలలో ఉంది. వర్షాలు వెలసి పశ్చిమప్రాంతంలో శనివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు పొడి వాతావరణం నెలకొనగా పంటలు జరిగిన నష్టం వెలుగుచూస్తోంది.

పొలాల్లోనే వాన నీరు

అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలు ఆగిపోయి మూడు రోజులు గడుస్తున్నా ఇంకా పశ్చిమప్రాంతంలోని అనేక గ్రామాల్లో పంట పొలాల్లో నీరు బయటకు వెళ్లలేదు. దీంతో వేలాది ఎకరాల్లో పంటలు ఉరకెత్తుతున్నాయి. ప్రధానంగా పత్తి, మిర్చి, పొగాకు పంటలకు ఈ పరిస్థితి ఎదురు కాగా సజ్జ పంట కోత దశలో ఉండటంతో కంకులు మొలకెత్తుతున్నాయి. అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలకే ఈ పరిస్థితి ఎదుర్కొన్న ఈ ప్రాంత రైతులు ప్రస్తుత తుఫాన్‌ ప్రభావంపై మరింత ఆందోళన చెందుతున్నారు. మొంథా తుఫాన్‌ ప్రభావంతో సోమవారం సాయంత్రం నుంచి వర్షాలు ప్రారంభమయ్యాయి. బుధవారం వరకు అవి కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటికే ఉరకెత్తుతున్న పంట పొలాలు ఈ వర్షాలతో పూర్తిగా దెబ్బతిని పోతాయని రైతులు వాపోతున్నారు. సగటున ఒక్కో ఎకరాకు రూ.40 వేల నుంచి రూ.50వేల వరకు రైతులు ఖర్చుచేయగా ఇప్పటికే సగం నష్టపోయిన రైతులు తాజా వర్షాలతో పూర్తిగా నష్టపోతామని ఆవేదన చెందుతున్నారు.

Updated Date - Oct 28 , 2025 | 01:21 AM