డీఎస్సీ అభ్యర్థుల కోసం భారీ ఏర్పాట్లు
ABN , Publish Date - Sep 24 , 2025 | 01:23 AM
డీఎస్సీ టీచర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 25న అమరావతిలో ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు నియామక పత్రాలను అందజేయనున్నారు. ఆ కార్యక్రమానికి విద్యాశాఖ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. మెగా డీఎస్సీలో జిల్లాస్థాయిలో 661 మంది, జోనల్ స్థాయిలో 188 మంది కలిపి 849 మంది జిల్లాకు చెందిన అభ్యర్థులు ఉపా ధ్యాయ పోస్టులకు ఎంపికయ్యారు.
1,700 మందికి వసతి, 43 బస్సులు
నియోజకవర్గాల వారీగా సీటింగ్
ఒంగోలు విద్య, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి) : డీఎస్సీ టీచర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 25న అమరావతిలో ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు నియామక పత్రాలను అందజేయనున్నారు. ఆ కార్యక్రమానికి విద్యాశాఖ అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. మెగా డీఎస్సీలో జిల్లాస్థాయిలో 661 మంది, జోనల్ స్థాయిలో 188 మంది కలిపి 849 మంది జిల్లాకు చెందిన అభ్యర్థులు ఉపా ధ్యాయ పోస్టులకు ఎంపికయ్యారు. ప్రతి అభ్యర్థికి తోడు కుటుంబ సభ్యుడు ఒకరిని అనుమతిస్తున్నారు. దీంతో 1,700 మందికి ఒంగో లులోని నాలుగు కేంద్రాల్లో వసతి ఏర్పాట్లు చేశారు. ప్రతి కేంద్రానికి ఒక అధికారిని ఇన్‌చార్జిగా నియమించారు. ప్రతి 20 మంది అభ్యర్థులకు ఒకరిని బాధ్యులుగా నియమించారు. ఆ 20 మందికి సంబంధించిన అన్ని విషయాలను సదరు అధికారి చూసుకోవాలి. అభ్యర్థులను గురువారం అమరావతికి తరలించేందుకు 43 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. ప్రతి బస్సుకు ఒక ఎంఈవో, హెచ్‌ఎం ఇన్‌చార్జిగా వ్యవహరిస్తారు. వీరికి సహాయ పడేందుకు పీడీలను నియమించారు. అభ్యర్థులను అమరావతికి తీసుకెళ్లి మళ్లీ క్షేమంగా ఒంగోలుకు చేర్చే బాధ్యత వారిదే. అభ్యర్థులకు రాత్రికి బసతోపాటు భోజన ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు బుధవారం మధ్యాహ్నానికి ఒంగోలులో వారికి కేటాయించిన వసతి కేంద్రానికి చేరుకోవాలి. మహిళా అభ్యర్థులు, వారి తల్లిదండ్రులను క్విస్ ఇంజనీరింగ్ కళాశాలలో చేర్చేందుకు ఆరు స్కూలు బస్సులను కేటాయించారు. అమరావతిలో నియామకపత్రాలు అందుకునేందుకు వెళ్తున్న అభ్యర్థులకు నియోజకవర్గాల వారీగా ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేశారు. అమరావతిలో జరిగే సీఎం సభలో కూడా వీరికి నియోజకవర్గాల వారీగా సీటింగ్ ఏర్పాటు చేసి అభ్యర్థులు వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా నెంబర్లు కేటాయించారు.
డీఈవో సమీక్ష
డీఎస్సీ అభ్యర్థులకు జిల్లాలో చేస్తున్న ఏర్పాట్లను డీఈవో కిరణ్‌కుమార్ మంగళవారం స్థానిక డీఆర్‌ఆర్‌ఎం హైస్కూలులో సమీక్షించారు. వసతి కేంద్రాల ఇన్‌చార్జిలు, బస్సు ఇన్‌చార్జిలతో ఆయన మాట్లాడారు. అభ్యర్థులందరికీ ఫోన్ చేసి అమరావతికి హాజరయ్యేలా చూడాలన్నారు. ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.