సీపీఐ సభలకు భారీ ఏర్పాట్లు
ABN , Publish Date - Aug 20 , 2025 | 01:28 AM
ఒంగోలు వేదికగా ఈనెల 23 నుంచి 25 వరకు భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) రాష్ట్ర 28వ మహాసభలు జరగనున్నాయి. అందుకు ఆ పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రతి మూడేళ్లకు ఒకసారి గ్రామస్థాయి నుంచి అఖిల భారత స్థాయి వరకు సీపీఐ, సీపీఎం ఇతర వామపక్షాలు సంస్థాగత నిర్మాణంలో భాగంగా మహాసభలను నిర్వహిస్తుంటాయి.
ఈనెల 23 నుంచి 25 వరకు ఒంగోలులో పార్టీ రాష్ట్ర మహాసభలు
తొలిరోజు భారీ ర్యాలీ, బహిరంగ సభ
హాజరుకానున్న అగ్రనేతలు రాజా, నారాయణ
జిల్లావ్యాప్తంగా శ్రేణుల విస్తృత ప్రచారం
నేటి నుంచి ఒంగోలులో కళా ప్రదర్శనలు
ఒంగోలు, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి) : ఒంగోలు వేదికగా ఈనెల 23 నుంచి 25 వరకు భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) రాష్ట్ర 28వ మహాసభలు జరగనున్నాయి. అందుకు ఆ పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రతి మూడేళ్లకు ఒకసారి గ్రామస్థాయి నుంచి అఖిల భారత స్థాయి వరకు సీపీఐ, సీపీఎం ఇతర వామపక్షాలు సంస్థాగత నిర్మాణంలో భాగంగా మహాసభలను నిర్వహిస్తుంటాయి. సెప్టెంబరులో పంజాబ్ రాజధాని చండీగఢ్‌లో సీపీఐ జాతీయ మహాసభలు జరగనుండగా ఈ లోపు రాష్ట్ర స్థాయిలోనూ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే అన్ని జిల్లా మహాసభలు పూర్తికాగా ఆయా జిల్లాలు, పార్టీ రాష్ట్ర, కేంద్రం నుంచి సుమారు 550 మంది ప్రతినిధులు ఒంగోలులో జరిగే మహాసభలకు హాజరుకానున్నారు. గత మూడేళ్లుగా రాష్ట్రంలో పార్టీ నిర్వహించిన కార్యక్రమాలు, ప్రస్తుత ప్రభుత్వాల తీరు, ప్రజా సమస్యలు, వాటి పరిష్కారం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాల సమీక్ష, భవిష్యత్ కార్యాచరణ రూపకల్పనతోపాటు రానున్న మూడేళ్ల కాలానికి పార్టీ నూతన నాయకత్వం ఎంపిక ఈ మహాసభల్లో జరగనున్నాయి.
భారీ ర్యాలీ, బహిరంగ సభ
మూడు రోజుల పాటు జరిగే మహాసభల ప్రారంభ సందర్భంగా తొలి రోజైన 23న జిల్లాతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చే సీపీఐ శ్రేణులతో నగరంలో భారీ ప్రదర్శన, బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు నెల్లూరు బస్టాండు సెంటర్‌లోని మునిసిపల్ స్కూలు నుంచి అద్దంకి బస్టాండు సమీపంలోని కూరగాయల మార్కెట్ మైదానం వరకు భారీ ర్యాలీ నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నారు. అనంతరం అక్కడ బహిరంగ సభ ఉంటుంది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అధ్యక్షతన జరిగే ఈ సభలో జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఇతర నాయకులు పాల్గొననున్నారు. అనంతరం 24, 25 తేదీల్లో ప్రతినిధుల సభలు జరుగుతాయి. దేశంలో సీపీఐ ఆవిర్భవించి వందేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతిష్టాత్మకంగా మహాసభల నిర్వహణతోపాటు యంగ్ కమ్యూనిస్టు కార్యకర్తలతో ర్యాలీలో కవాతు నిర్వహించేలా శిక్షణ ఇస్తున్నారు.
ప్రతిష్టాత్మకంగా కార్యక్రమం
తొలిసారి వామపక్ష పార్టీ రాష్ట్ర మహాసభలు ఒంగోలులో జరగనుండటంతో జిల్లాలో సీపీఐతోపాటు ఇతర వామపక్ష అభ్యుదయ వర్గాలు ఈ ఏర్పాట్లలో భాగస్వామ్యువుతున్నారు. సీపీఐ శ్రేణులు ఇప్పటికే వివిధ రూపాలలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాయి. ప్రజానాట్యమండలి కళాకారుల బృందం జిల్లా అంతటా ప్రదర్శనలు ఇచ్చింది. ఇదిలా ఉండగా మూడు రోజుల ముందు నుంచే ప్రజా కళా ఉత్సవాల పేరుతో స్థానిక సీవీఎన్ రీడింగ్ రూం ఆవరణలో సాయంత్రం కళా ప్రదర్శనలు, చర్చాగోష్టిలు ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల 20 నుంచి 22 వరకు రాష్ట్ర ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో ఉత్సవాలు జరగనున్నాయి. తెలుగు రాష్ట్రాలలో ప్రజా కళాకారులు, కవులుగా గుర్తింపు ఉన్న ప్రముఖులు, ప్రజానాట్యమండలి రాష్ట్ర కళాకారులు, నాయకులు హాజరవుతున్నారు. అలాగే 23న జరిగే ర్యాలీలోనూ కళాకారులు భారీగా పాల్గొననునాఆ్నరు. ఇదిలా ఉండగా జిల్లాకు చెందిన ప్రముఖ కమ్యూనిస్టు నేత నల్లూరి వెంకటేశ్వర్లు అధ్యక్షుడిగా జిల్లాలోని సీపీఐ ముఖ్యనేతలు, అభ్యుదయవర్గాల వారితో ఏర్పడిన ఆహ్వాన సంఘం ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి.